కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

Published Mon, Mar 17 2025 11:21 AM | Last Updated on Mon, Mar 17 2025 11:15 AM

కుటుంబ కలహాలతో  వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

రైల్వేకోడూరు అర్బన్‌ : రైల్వేకోడూరు మండలం, బుడుగుంటపల్లి పంచాయతీ, రైల్వేస్టేషన్‌ సమీపంలో అనంతపురం దొనగిరికి చెందిన లక్ష్మీనారాయణ (35) అనే యువకుడు విద్యుత్‌ హై టెన్షన్‌ స్తంభానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా.. రెండేళ్ల క్రితం రైల్వేకోడూరుకు బేల్దారీ పనులు చేసుకునేందుకు భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చి బాలానగర్‌లో నివాసం ఉండేవాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆ యువకుడు ఉరివేసుకున్నాడు. దీంతో కుటుంబమంతా వీధిన పడింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మోటారు వైర్లు చోరీ

రాజంపేట రూరల్‌ : మండల పరిధిలోని ఆకేపాడు గ్రామ పంచాయతీలో శనివారం రాత్రి బోర్‌ వైర్‌ కేబుళ్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు వాపోయారు. రాయచోటికి వెళ్లే దారిలో ఉన్న వీరంరెడ్డి నారాయణరెడ్డి పొలంలోని 2 బోర్లకు చెందిన మోటర్‌ వైర్లు, స్టార్టర్లు దొంగిలించారు. అలాగే వీరంరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, మందకాల శ్రీనివాసులు, బొమ్మ రంగారెడ్డికి చెందిన మోటార్‌ వైర్లు, స్టార్టర్లు కూడా ఎత్తుకెళ్లారు. గొళ్ల విజయరెడ్డికి చెందిన 3 మోటాటర్‌ వైర్‌ కేబుళ్లు, గోళ్ల సుజాతారెడ్డికి చెందిన 2 మోటార్‌ వైర్‌ కేబుళ్లు చోరీకి గురయ్యాయి. పోలీసులు దొంగలను పట్టుకోవాలని బాధితులు కోరుతున్నారు.

‘నాకు రక్షణ కల్పించండి’

సిద్దవటం : తనను హతమార్చేందుకు యత్నిస్తున్నారని, రక్షణ కల్పించాలని సిద్దవటం మండలం కడపాయపల్లె గ్రామానికి చెందిన బత్తల శివకుమార్‌ కడప డీఎస్పీ, ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. మండల కేంద్రమైన సిద్దవటంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ తనతో పాటు బొంత రమాదేవి 2002 సంవత్సరంలో ప్రభుత్వం అసైన్‌మెంట్‌ కమిటీ ద్వారా సర్వేనెంబర్‌ 164 లింగంపల్లె రెవెన్యూ గ్రామ పొలంలో పట్టా పొందామన్నారు. ఈనెల 14వ తేదీన భూమి సాగు చేసుకునేందుకు జేసీబీతో పని చేయిస్తుండగా వెన్యూ వారు వచ్చి రికార్డులను పరిశీలించి వెళ్లారన్నారు. అయితే లింగంపల్లె గ్రామ మాజీ సర్పంచ్‌ వెంకటేశ్వర్లు ఫోన్‌ చేసి తనను అడగకుండా భూమి సాగు చేసేందుకు ఎంత ధైర్యం నీకు అంటూ బెదిరించాడన్నారు. ఆ తరువాత కొంత మంది లింగంపల్లె దళితులను తన వద్దకు పంపి తనపై దౌర్జన్యం చేసి పనిని నిలుపుదల చేశారన్నారు. అంతటితో ఆగకుండా వెంకటేశ్వర్లు తన మనుషులైన ఈరిశెట్టి సురేష్‌, ఈరిశెట్టి మునిసుబ్బరాయుడు, ఈరిశెట్టి నాగరాజు, పిట్టి గోపాల్‌ల చేత తనపై హత్యాయత్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.

సూరప్పగారిపల్లెలో భారీ చోరీ

గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ సూరప్పగారిపల్లెలో భారీ చోరి జరిగింది. వ్యవసాయపనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లిన ఓ రైతు ఇంట్లో దుండగులు ప్రవేశించి 150 గ్రాముల బంగారు నగలు, రూ.50 వేలు నగదు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన కుమ్మర మునిస్వామి వ్యవసాయం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటికి తాళాలు వేసుకొని గ్రామానికి సమీపంలోని తన పొలం వద్దకు వెళ్లారు. రైతు దంపతులు సాయంకాలం పనులు చేసుకొని ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటి తాళాలు పగులగొటి బీరువాలో ఉంచిన రూ. 13లక్షలు విలువచేసే బంగారు నగలు, రూ.50 వేలు నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement