మాక్ డ్రిల్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది
రాయచోటి: కలెక్టర్ కార్యాలయాన్ని బాంబులతో పేల్చేస్తున్నట్లు దుండగుల నుంచి ఫోన్ సమాచారం అందింది. వెంటనే విషయాన్ని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తెలియపరిచారు. సమాచారం అందగానే జిల్లా బాంబు స్క్వాడ్, డాగ్స్ స్క్వాడ్‌లు కలెక్టర్ కార్యాలయంలో అణువణువు గాలింపు చేశాయి. కార్యాలయ సిబ్బంది అంతా ఒక్క మారుగా ఉలికిపాటుకు గురయ్యారు. తీరా ఇదంతా జిల్లా పోలీస్ యంత్రాంగం మాక్ డ్రిల్‌లో భాగమని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయానికి వస్తే శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో బాంబు బెదిరింపు వచ్చినపుడు ఎలా స్పందించాలనే దానిపై పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఉద్యోగుల అప్రమత్తత కోసం.....
ఉద్యోగులను అప్రమత్తం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇవ్వడమే మాక్ డ్రిల్ ఉద్దేశమని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో బాంబు బెదిరింపు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో రాయచోటి పట్టణ సీఐ చలపతి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ వీజే రామకృష్ణ, సీఐలు, ఎస్‌ఐలు,ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్ పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.