ముందస్తు ప్రణాళికతో వేసవి తాపాన్ని అధిగమిద్దాం
కడప సెవెన్‌రోడ్స్ : ముందస్తు చర్యలు చేపట్టి అధిక ఉష్ణోగ్రత, వేడిగాలుల కారణంగా వచ్చే వడదెబ్బ (సన్ స్ట్రోక్), డీహైడ్రేషన్ వంటి సమస్యలను అధిగమించాలని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాలులో తాగునీటి కొరత, వేసవి వడగాడ్పులు, వడదెబ్బ, ముందస్తు జాగ్రత్త చర్యలపై జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, జిల్లా అదనపు వైద్యాధికారి ఉమామహేశ్వర కుమార్‌లతో కలిసి డీఆర్వో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ముందస్తుగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో దీనిపై ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు వేసవిలో అనవసరంగా బయటకు రాకూడదని.. అత్యవసర పనులు ఉంటే ఉదయం పూటనే పూర్తి చేసుకోవాలన్నారు. వడదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా గొడుగు వాడటం, తెలుపు రంగు, పలుచటి చేనేత వస్త్రాలను ధరించడం, తలకు టోపీ లేదా రుమాలు వాడటం, వేడిగాలులు తగలకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పక పాటించాలన్నారు.
అన్ని మండలాల్లో ఎక్కడా కూడా తాగునీటి కొరత లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
పంచాయతీ కార్యదర్శులు స్థానిక ఏఎన్‌ఎంలతో సమన్వయం చేసుకుని వడగాడ్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతంలో షెడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించడంతో పాటు తగినన్ని ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని డ్వామా అధికారులను ఆదేశించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వడగాడ్పులపై సీడీపీఓ, సూపర్‌వైజర్లు, అంగన్వాడీ వర్కర్ల ద్వారా అవగాహన కల్పించాలన్నారు.
అటవీ పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణులు, పశు పక్ష్యాదులకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు కలగకుండా.. అక్కడక్కడా నీటి తొట్టెలు ఏర్పటు చేసి.. నీరు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలని.. అటవీశాఖాధికారులను ఆదేశించారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో వేసవి వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు మొదలైన జీవాలకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్త చర్యలతో పాటు.. అన్ని పశు ఆరోగ్య కేంద్రాల వద్ద పశువులకు నీటి తొట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి, డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, అనుబంధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు
Comments
Please login to add a commentAdd a comment