● ఆపై తానూ ఆత్మహత్య ● వైఎస్సార్ జిల్లాలో ఘటన
వల్లూరు : మద్యం మత్తులో అనుమానంతో భర్తే భార్యను హత్య చేసి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వల్లూరు మండల పరిధిలోని అంబవరం ఎస్సీ కాలనీలో మంగళవా రం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు..అంబవరం ఎస్సీ కాలనీలో యర్రగుడిపాడుకు చెందిన చెన్న కేశవ, సుజాత దంపతులు నివసిస్తున్నారు. వీరికి సంతోష్ కుమార్ అనే వివాహమైన కుమారుడితో బాటు వరుణ్ కుమార్ (13) అనే కుమారుడు, స్వర్ణలత (8) అనే కుమార్తె ఉంది. చెన్న కేశవ (45) తాగుడుకు బానిసగా మారి మద్యం మత్తులో భార్య సుజాత (40)ను వేధిస్తుండేవాడు. సుజాతపై చెన్నకేశవ అనుమానం పెంచుకోవడంతో ఆమె 2 నెలల క్రితం తన పుట్టింటికి వెళ్లిపోయింది. నెల క్రితం ఆమె పెద్ద కుమారుని వివాహం జరగడంతో దాని కోసం ఆమె అంబవరం వచ్చింది. వివాహం జరిగిన తరువాత మళ్లీ తన అమ్మగారి ఇంటికి వెళ్లిపోయింది. కొడుకు అత్తగారి ఇంటి నుంచి కోడలికి ఉగాది సాంగ్యం తెస్తుండటంతో..తన కుమారుడు ఆమెను అంబవరానికి తీసుకువచ్చాడు. మంగళవారం మద్యం తాగిన చెన్న కేశవ ఇంటి ఆవరణలో సుజాతపై కొడవలితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చెన్న కేశవ కొడవలి పట్టుకుని క్రిష్ణాపురం, గంగాయపల్లె రైల్వేస్టేషన్ల మధ్య నల్లపురెడ్డిపల్లె రైల్వే గేటుకు కొద్ది దూరంలో గూడ్సు రైలు కింద ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అనుమానంతో భార్యను హతమార్చిన భర్త
అనుమానంతో భార్యను హతమార్చిన భర్త
అనుమానంతో భార్యను హతమార్చిన భర్త