రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
చింతకొమ్మదిన్నె : కడప–చిత్తూరు జాతీయ రహదారిపై మండల పరిధిలోని మద్దిమడుగు బిడికి గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మేకల ఆదినారాయణ, కోర్ణ సూర్యనారాయణ అనే వ్యక్తులు మృతి చెందినట్లు చింతకొమ్మదిన్నె సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున రాయచోటి నుంచి కడపకు రాతి స్తంభాలు వేసుకుని ఏపీ04 బీఎక్స్7660 నెంబర్ గల ట్రాక్టరులో డ్రైవర్ వెంకట చలపతి, సహాయకుడు మేకల ఆదినారాయణ వస్తుండగా మద్దిమడుగు సుగాలి బిడికి గ్రామ సమీపంలో ఉదయం 5.45 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ట్రాక్టర్ ట్రాలీ వెనుక ఎడమవైపు గల టైరు పేలి ట్రాక్టర్ అదుపు తప్పింది. ఈ ఘటనతో ట్రాక్టర్ ఒక్కసారిగా వేగం తగ్గడంతో వెనుక ఏపీ05 టీడీ 6549 నెంబరుగల కంకర లోడుతో వస్తున్న టిప్పర్ డ్రైవర్ వేగాన్ని అదుపు చేసుకోలేక ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్ వెంకట చలపతి, టిప్పర్ డ్రైవర్ కోర్న సూర్యనారాయణ, ట్రాక్టర్ సహాయకుడు ఆదినారాయణను రోడ్డు పక్కకు తీసుకెళ్లి నీరు తాగిస్తుండగా కొద్దిసేపటికే ఎన్‌ఎల్02 బి 7879 నెంబరుగల శివాజీ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు డ్రైవర్ తురక శివరామకృష్ణ కడప నుంచి రాయచోటి వైపు అతివేగంగా నడుపుకుంటూ వచ్చి టిప్పర్ డ్రైవర్ కోన సూర్యనారాయణను ఢీకొట్టాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ట్రాక్టర్‌లోని సహాయకుడు, టిప్పర్ డ్రైవర్‌ను రిమ్స్‌కు తరలించారు. ఉదయం 7.36 గంటలకు ట్రాక్టర్ సహాయకుడు మేకల ఆదినారాయణ, ఉదయం 9.11 గంటలకు టిప్పర్ డ్రైవర్ కోర్న సూర్యనారాయణ మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసినట్లు చింతకొమ్మదిన్నె సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment