రాజంపేట: పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు 522 వర్ధంతి ఉత్సవాలను బుధవారం నుంచి నిర్వహించనున్నారు. టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. తాళ్లపాక, 108 అన్నమయ్య అడుగుల విగ్రహం వద్ద చలువ పందిళ్లు, స్వాగతతోరణాలు, కళాకారుల కోసం కళావేదికను సిద్ధం చేశారు. ఈ ఉత్సవాలు 29 వరకు కొనసాగనున్నాయి. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
తాళ్లపాకను అభివృద్ధి చేయాలి
తాళ్లపాక వైపు టీటీడీ అధికారులు కన్నెత్తి చూడటం లేదని తాళ్లపాక గ్రామస్తులు అదృష్టదీపుడు, మోహనరావు, నారయణ, బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగోతు రమేష్‌నాయుడులు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు మంగళవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిశారు. తిరుమలలో హుండీలో వచ్చిన ఆదాయం ఒక శాతం తాళ్లపాక అభివృద్ధి కోసం వ్యయం చేయాలన్నారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల నేపథ్యంలో ఈ నెల 5న తాళ్లపాకకు వస్తానని, అభివృద్ధి చేసే అంశంపై చర్చిస్తానని చైర్మన్ హామీ ఇచ్చారని తెలిపారు.
తాళ్లపాక వైపు కన్నెత్తి చూడని టీటీడీ అధికారులు
చైర్మన్‌కు ఫిర్యాదు చేసిన తాళ్లపాక గ్రామస్తులు