
‘సాక్షి’ ఎడిటర్‌పై తప్పుడు కేసు ఉపసంహరించుకోవాలి
ఏపీయూడబ్ల్యూజే నాయకుల డిమాండ్
కడప సెవెన్‌రోడ్స్: సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డితోపాటు మరో ఆరుగురిపై డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులు నమోదు చేసిన తప్పుడు కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మోపూరి బాలకృష్ణారెడ్డి, సాక్షి టీవీ జిల్లా ప్రతినిధి వెన్ను శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం డీఆర్వో విశ్వేశ్వరనాయుడుకు ఈ మేరకు వారు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్నాడు జిల్లా మాచర్లలో హరిశ్చంద్ర అనే వ్యక్తి హత్య కేసును బాధితుల కథనం మేరకు సాక్షి దినపత్రికలో ప్రచురించారని పేర్కొన్నారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదును విచారణ చేయకుండానే డీజీపీ కేసు నమోదు చేయించారని అన్నారు. పల్నాడు పోలీసులు నమోదు చేసిన కేసు పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఉందన్నారు. డీజీపీ ఇలాంటి తప్పుడు ఫిర్యాదులపై ఆగమేఘాల మీద స్పందించడం మాని వాస్తవాలను తెలుసుకున్న తర్వాత చర్యలు తీసుకుంటే రాష్ట్ర పోలీసుల గౌరవం పెరుగుతుందన్నారు. నమోదు చేసిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవడం ద్వారా రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కాపాడుతామన్న సంకేతాలను సమాజానికి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు బీవీ నాగిరెడ్డి, నూర్‌బాష, శ్రీనివాసులతోపాటు పలువురు పాత్రికేయులు, వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు.