‘ఓటుకు కోట్లు’ కేసులో ఎన్నికల సంఘం ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం ఏకంగా రూ. 5 కోట్లు ఖర్చు పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవడాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో, ఆడియో రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు సిద్ధమైంది. ఈ రికార్డుల కాపీలను తమకు ఇవ్వాలని కోరుతూ గురువారం నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసు కోర్టు పరిధిలో ఉండడంతో... కోర్టు తీర్పు ఆధారంగా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. అంతేకాదు ఈ రికార్డులను ఫైల్ చేసి ఉంచనుంది. అసలు ఈ ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం పూర్తిగా అవినీతి, క్రిమినల్ కేసేనని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ పేర్కొనడం గమనార్హం. మరోవైపు ‘ఓటుకు కోట్లు’ కేసులో సూత్రధారితో పాటు పలువురు కీలక పాత్రధారులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఏసీబీ ఒక నివేదికను అందజేయనుంది.