పార్లమెంటులో జరిగిన సంఘటనపై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానమే దీనికి కారణమన్నారు. వేరే పార్టీకి చెందిన ఎంపీని కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు.. వేరే రాష్ట్రానికి చెందినవాళ్లు దాడిచేసి కొడుతుంటే ఆయనను కాపాడేందుకే తాను వెల్ లోకి వెళ్లానని, అంతేతప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో కాదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం పురమాయింపుతో కొంతమంది ఎంపీలు తమపై దాడికి దిగారని, పిడిగుద్దులు గుద్దారని లగడపాటి చెప్పారు. ఆ సమయంలో ఆత్మరక్షణ కోసం, ఒకేచోట గుమిగూడినవారిని అక్కడి నుంచి చెదరగొట్టి, శాంతియుత పరిస్థితి నెలకొల్పేందుకే తాను పెప్పర్ స్ప్రే ఉపయోగించానని, అది కూడా ఆత్మరక్షణ కోసం తప్ప ఎవరినీ ఇబ్బందిపెట్టేందుకు కాదని ఆయన తెలిపారు. అయినా.. జరిగిన సంఘటనకు తాను ఆవేదన చెందుతున్నానని గురువారం నాడు మీడియాతో చెప్పారు.