గుజరాత్‌లో పటేల్ సామాజిక వర్గాన్ని ఇతర వెనకబడిన కులాల్లో(ఓబీసీ) చేర్చాలన్న డిమాండ్‌తో ప్రారంభమైన తమ ఉద్యమం మలి దశను మంగళవారం సూరత్ నుంచి ప్రారంభించనున్నట్లు ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ప్రకటించారు. ఈ రెండో దశ ఉద్యమం మొత్తం దేశం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. ఈ దశలో గ్రామ, తాలూకా స్థాయిల్లో కార్యక్రమాలు ఉంటాయన్నారు. అహ్మదాబాద్‌లో ఆగస్టు 25న హార్దిక్ నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారి, 10 మంది చనిపోవడం తెలిసిందే. ఢిల్లీ నుంచి సోమవారం గుజరాత్ తిరిగొచ్చిన హార్దిక్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమ రిజర్వేషన్ పోరాటానికి దేశవ్యాప్తంగా అనేక కులాలు, వర్గాల నుంచి గట్టి మద్దతు లభించిందని తెలిపారు. త్వరలో దేశవ్యాప్తంగా సభలు నిర్వహిస్తామన్నారు. రెండో దశ ఉద్యమంలో చేపట్టబోయే కార్యక్రమాలను మంగళవారం ప్రకటిస్తామన్నారు.