‘ఓటు హక్కు వినియోగించుకోవడమన్నది ప్రజా విధుల్లో భాగం కాదు. ప్రజా విధుల్లో భాగం కాని నేరానికి అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) ఎలా వర్తిస్తుంది’ అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ప్రశ్నించారు. ఆయన ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున వాదనలు వినిపించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై సమగ్రంగా విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరపాల్సిందిగా ఏసీబీని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెల్సిందే. అయితే ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కొట్టేయాలని చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యంపై హైకోర్టులో గురువారం వాదనలు ప్రారంభమయ్యాయి.