పై-లీన్ తుఫాను అరివీర భయంకరంగా దూసుకొస్తోంది. ఇది తీరం దాటే సమయంలో గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి సందర్భంలో అసలు ఏం జరిగే అవకాశాలుంటాయి? మనం ఎంతవరకు అప్రమత్తంగా ఉండాలో ఒక్కసారి చూద్దాం. గతంలో 1996లో కోనసీమ ప్రాంతంలోను, 1999 పెను తుఫాను వచ్చినప్పుడు కూడా గాలుల వేగం అత్యంత తీవ్రంగానే ఉంది. అప్పట్లో గోడలు కూలిపోయాయి. కిటికీల అద్దాలు వాటంతట అవే పగిలిపోయాయి. చెట్లు ఉన్నట్టుండి కూలిపోయాయి. కమ్యూనికేషన్ లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. టవర్లు కూలిపోయాయి. హోర్డింగులు కూడా పడిపోయాయి. విద్యుత్ సరఫరాకు, మంచినీటి సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అందువల్ల పాత అనుభవాల దృష్ట్యా.. ఈసారి ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. భారీ హోర్డింగులు, కరెంటు స్తంభాలు, టెలిఫోన్ స్తంభాలకు సమీపంలో నిలబడటం గానీ, వాటి వద్ద వాహనాలు పార్కింగ్ గానీ చేయకూడదు. కరెంటు వైర్లు తెగిపడొచ్చు కాబట్టి వాటికి దగ్గర్లో కూడా ఉండటం మంచిది కాదు. గాలులు తీవ్రమైన వేగంతో వీస్తాయి కాబట్టి, వర్షం నుంచి కాపాడుకోడానికి గొడుగులు పనికిరావు. టోపీలు గానీ, రెయిన్ కోట్లు గానీ తీసుకెళ్లడం మేలు. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి, మ్యాన్హోళ్లు ప్రమాదకరంగా ఉండొచ్చు కాబట్టి, ముందుగానే వాటివద్ద హెచ్చరిక బోర్డులు, కర్రలతో జెండాలు ఏర్పాటుచేయాలి. తాగునీటికి తీవ్రమైన కొరత రావచ్చు కాబట్టి ముందుజాగ్రత్తగా రెండు మూడు రోజులకు సరిపడ నీరు నిల్వచేసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే ఉపయోగించాలి. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉన్నందున సరిపడగా క్యాండిళ్లు, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. పిల్లలు, వృద్ధులు ఉంటే వారికోసం కావాల్సిన మందులు కూడా సదా సిద్ధంగా ఉంచుకోవాలి. కిటికీ రెక్కలు, తలుపులు, గాజు కిటికీలకు సమీపంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. గాలి వేగానికి వాటివల్ల ప్రమాదం సంభవించొచ్చు. సమీపంలో ఉన్న పునరావాస కేంద్రాలు, కంట్రోల్ రూం నెంబర్లు, సహాయ కేంద్రాల ఫోన్ నెంబర్లను రాసి, అందుబాటులో ఉంచుకోవాలి. సెల్ఫోన్లకు పూర్తిగా చార్జింగ్ పెట్టుకుని, అత్యవసరమైన కాల్స్ మాత్రమే చేయాలి. రెండు మూడు రోజులు విద్యుత్ సరఫరా లేకపోయినా కమ్యూనికేషన్ దెబ్బతినకుండా చూసుకోవాలి. కూరగాయలు, నిత్యావసరాలను సరిపడగా నిల్వచేసి ఉంచుకోవాలి.
Published Sat, Oct 12 2013 11:02 AM | Last Updated on Thu, Mar 21 2024 8:50 PM
Advertisement
Advertisement
Advertisement