రాష్ట్ర రాజధాని నిర్మాణంలో తన తాబేదారు కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబిలింగ్(ఏపీఐడీఈ) చట్టాన్నే మార్చేశారు. స్వప్రయోజనాలను కాపాడుకోవడంలో క్షణమైనా ఆలస్యం జరగకూడదన్న ఉద్దేశంతో ఆదివారం ఆఘమేఘాలపై ఆర్డినెన్స్ జారీ చేశారు. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి తీసుకున్న విలువైన భూములను స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు పేరుతో సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియానికి కట్టబెట్టడానికి సీఎం ఏకంగా స్విస్ చాలెంజ్ చట్టంలో మార్పులు చేశారు. ప్రస్తుత చట్టంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నేతృత్వంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి విస్తృత అధికారాలున్నాయి. దానికి అధికారాలను కల్పించే సెక్షన్ 2 (ఎఫ్‌ఎఫ్)ను సవరణతోతొలగించారు. ఈ నెల 18న మంత్రివర్గ సమావేశం ఈ సవరణలను ఆమోదించగా, ఆదివారం ఏపీఐడీఈ చట్ట సవరణ-2016 ఆర్డినెన్స్‌ను జారీ చేశారు.