బ్యాంకులకు కోట్లాది రూపాయల రుణాలను ఎగవేసి లండన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాను తిరిగి రప్పించే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. మాల్యాను అప్పగించిన వెంటనే ఆయనను ముంబయి ఆర్థర్ రోడ్ జైల్‌లో ఉంచాలని భావిస్తున్న క్రమంలో జైలు స్థితిగతులు, భద్రతా ప్రమాణాలపై కేంద్రం లండన్ కోర్టుకు నివేదిక సమర్పించింది. అర్థర్ రోడ్డు జైలులోని బ్యారక్ 12ను మాల్యాకు కేటాయించనున్నారు. గతంలో 26\11 పేలుళ్ల సూత్రధారి, పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఈ బ్యారక్‌లో ఉన్నాడు. ముంబయి మహాలక్షీ రేసుకోర్సుకు సమీపంలో ఉన్న అర్థర్ రోడ్ జైలు నిందితుడు(మాల్యా)కి అవసరమైన భద్రత ప్రమాణాలన్నింటినీ కలిగిఉందని లండన్ కోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. జైలు అధికారులు రూపొందించిన ఈ నివేదికను ప్రభుత్వం సీబీఐ ద్వారా మాల్యా అప్పగింత కేసును విచారిస్తున్న వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించింది. కేంద్రం నివేదికతో లండన్ కోర్టు అప్పగింత ప్ర్రక్రియను వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు.