ఈ రోజు చీపురుపల్లి నియోజకవర్గంలోని కెల్ల, రెల్లిపేట, గుర్ల గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. కెల్ల గ్రామంలో అంబళ్ల సీతమ్మ దయనీయగాథ మనసును కలచివేసింది. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు. ఏడేళ్ల కిందట మేడ మీద నుంచి పడటంతో వెన్నెముక దెబ్బతింది. మంచానికే పరిమితమయ్యాడు. భర్త తెచ్చే కూలి డబ్బులతోనే ఇంటిని నడుపుతూ.. కొడుకుకు సపర్యలు చేసుకుంటూ గడుపుతోందా తల్లి. ఏడు నెలల కిందట ఆమె భర్తకూ యాక్సిడెంట్ అయింది. మూత్రాశయం దెబ్బతింది. ఆరోగ్యశ్రీ వర్తించదన్నారు. వైద్యానికి వేలకు వేలు ఖర్చుపెట్టలేని దుస్థితి. ఓ వైపు.. భర్తకు, బిడ్డకు పసిబిడ్డలకు వలే సపర్యలు చేసుకోవాలి. మరోవైపు.. కూలి పనులకెళ్లి కుటుంబాన్ని పోషించాలి. ఆ సీతమ్మ కష్టాలు గుండెను బరువెక్కించాయి.