ఫ్లోరిడాకు చెందిన టెకారా తన కుటుంబంతో కలిసి గ్రాండ్ బహామాలోని ఫ్రీపోర్ట్‌ను సందర్శించడానికి వెళ్లారు. అదే సమయంలో డోరియా తుఫాను వారు వెళ్లిన ప్రదేశాన్ని చుట్టుముట్టింది. దీంతో ఇక భూమిపై నూకలు చెల్లినట్టే అని భయపడిపోయినప్పటికీ ఎలాగోలా తుపాను బారి నుంచి వారంతా తప్పించుకున్నారు. విలువైన వస్తువులు పోయాయే తప్ప కుటుంబంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన జరిగిన తర్వాత తొలిసారిగా సోమవారం టెకారా తన కుమారుడు మకై సిమోన్స్‌ను స్కూలుకు తీసుకెళ్లింది. అక్కడ తోటి విద్యార్థులు మకైపై కురిపించిన ప్రేమకు ఆ తల్లికి నోటమాట రాలేదు. డోరియా తుపాను నుంచి మకై క్షేమంగా బయటపడటంతో మిగతా పిల్లలందరూ పరుగున వచ్చి మకైను హత్తుకున్నారు.