పోలవరం ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న అక్రమాలను కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలో తీవ్రస్థాయిలో ఎండగట్టింది. హెడ్‌వర్క్స్ కాంట్రాక్టర్‌కు భారీ ప్రయోజనం కల్పించారని, పనుల్లో మాత్రం పురోగతి లేదని పేర్కొంది. బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన నివేదికలో కాగ్ ప్రస్తావించిన అక్రమాలు ‘సాక్షి’ గత నాలుగేళ్లుగా ప్రచురించిన కథనాలకు అద్దం పట్టాయి. సీఎస్‌ఎంఆర్‌ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటిరీయల్ రీసెర్చ్ స్టేషన్)తో ఒప్పందం చేసుకునే వరకూ అంటే 2017 జూలై వరకూ ప్రాజెక్టు పనుల నాణ్యత పరిశీలనకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయకపోవడంపై కాగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భూసేకరణ, నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ అమలులో అవతవకలను కడిగేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ని 2014 మే నెలలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం దీనితో ఒప్పందం చేసుకోవాలని పదేపదే కోరినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని కాగ్ పేర్కొంది.