ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బుధవారం విజయవాడలోని అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం వద్ద హైడ్రామాకు తెరలేపారు. బెంజ్‌సర్కిల్ వద్దనున్న వేదిక కళ్యాణ మండపం వద్ద కార్యాలయం ప్రారంభోత్సవానికి బుధవారం సాయంత్రం మాజీ సీఎం వచ్చారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జేఏసీ నేతలతో కలసి ఆటోనగర్ వద్ద బస్సు యాత్రను ప్రారంభించేందుకు బెంజిసర్కిల్ నుంచి పాదయాత్రగా బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండా పాదయాత్రగా వెళ్లడానికి వీల్లేదని, సాయంత్రం వేళ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని పోలీసు అధికారులు వివరించారు.