ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన డేటాబ్రీచ్‌పై ఎట్టకేలకు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ నోరు విప్పారు. సుమారు 5కోట్లమంది ఫేస్‌బుక్ యూజర్ల సమాచారం లీక్ అయిందన్న దుమారం రేగిన నాలుగు రోజుల తరువాత స్పందించారు. తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో జుకర్‌బర్గ్ ఒక పోస్ట్ పెట్టారు. డాటా లీక్ వ్యవహారంలో తప్పయిందంటూ ఆయన అంగీకరించారు. అయితే అదృష్టవశాత్తూ తాము ఇప్పటికే డేటా రక్షణకు సంబంధించి చర్యలు చేపట్టామని వివరణ ఇచ్చారు. ఇది కోగన్, కేంబ్రిడ్జ్ ఎనలిటికా , ఫేస్‌బుక్‌మధ్య విశ్వాస ఉల్లంఘన. అంతేకాదు ఇది ఫేస్‌బుక్‌కు, డేటాను సంస్థతో పంచుకున్న యూజర్లకూ మధ్య ఉన్న నమ్మకాన్ని కూడా దెబ్బతీసిందని పేర్కొన్నారు. దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని జుకర్ బర్గ్ ఒప్పుకున్నారు.