ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని... ఆత్మహత్య ఏ సమస్యకు కూడా పరిష్కారం చూపజాలదని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ నేత కె.కేశవరావు అన్నారు. పరిస్థితులు చేయిదాటక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు కార్మికులను సమ్మె విరమింపజేసి చర్చలకు సిద్ధం కావాలని కోరారు. గతంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా పరిష్కరించిందని.. 44 శాతం ఫిట్‌మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఆర్టీసీతో పాటు ఏ ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన లేదని.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేయడమంటే తమ విధానాన్ని మార్చుకోవాలని కోరడమేనని పేర్కొన్నారు. ఇది ఆర్టీసీ యూనియన్లకు సంబంధం లేని విషయమని వ్యాఖ్యానించారు.