ఈ ఏడాది డిసెంబర్ నాటికి దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులను దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఆయన ఆదివారం పరిశీలించారు. పనుల జాప్యంపై మంత్రులు ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి కృష్ణదాస్ మాట్లాడుతూ.. దుర్గగుడి ఫ్లైఓవర్ విజయవాడ నగరానికే ప్రతిష్టాత్మకమని అన్నారు. తొలి ప్రాధాన్యతగా ఫ్లైఓవర్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారన్నారు. గత ప్రభుత్వ హయాంలో పనులు ముందుకు సాగలేదని విమర్శించారు.