ఓటుకు నోటు కేసు భయంతో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తనకు ఏదో జరగబోతోందనే ఊహలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బాబు అండ్ కో రాష్ట్రాన్ని అడ్డంగా దోచేశారని ఆరోపించారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో సీబీఐ విచారణ జరిగితే తన బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. ఐటీ అధికారులకు సహకరించం, సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వమని చెబుతుండమే ఇందుకు నిదర్శనమన్నారు. వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.