వ్యాపారవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. నాలుగు రోజులుగా అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి సూత్రధారిగా, ఆమె ప్రియుడు రాకేష్‌రెడ్డి హంతకుడిగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఆర్థిక పరమైన లావాదేవీల్లో విభేదాలే ఈ హత్యకు కారణమని తేలింది. గత నెల 31న దస్పల్లా హోటల్ వద్ద నుంచి జయరామ్‌ను కారులో తీసుకొచ్చిన రాకేష్.. మరికొందరితో కలిసి అతనికి జబ్బుతో ఉన్న కుక్కలకు ఇచ్చే ఇంజెక్షన్ చేసి హైదరాబాద్‌లోనే హత్య చేసినట్లు సమాచారం. ఆ తర్వాత కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని ఐతవరం వద్ద రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించే యత్నం చేశారని పోలీసులు భావిస్తున్నారు. జగ్గయ్యపేటలోని రాంకో సిమెంట్ కంపెనీకి చెందిన గెస్ట్‌హౌస్‌లో జిల్లా ఎస్పీ ఎస్.త్రిపాఠి.. రాకేష్‌ని, శిఖా చౌదరిని వేర్వేరుగా విచారించారు. హత్య కేసులో వారిద్దరి పాత్రపై ఒక స్పష్టతకు వచ్చిన పోలీసులు.. వారికి సహకరించిందెవరు? హత్యకు గల కారణాలు మరేమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.