అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ చెరుకూరి విజయారెడ్డి దారుణ హత్య నేపథ్యంలో ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన డ్రైవర్ కామళ్ల గురునాథం మంగళవారం మృతి చెందాడు. సోమవారం రైతు దాడిలో అగ్నికి ఆహుతైన విజయారెడ్డిని రక్షించేందుకు గురునాథం తీవ్రంగా శ్రమించాడు. ఈ క్రమంలో అతడికి కూడా నిప్పు అంటుకోవడంతో దాదాపు 85 శాతం శరీరం కాలిపోయింది. దీంతో గురునాథాన్ని అపోలో డీఆర్‌డీఎల్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఉదయం 11 గంటలకు మరణించాడు. కాగా విజయారెడ్డి డ్రైవర్ గురునాథం స్వస్థలం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామం. అతడికి భార్య, ఏడాదిన్నర కొడుకు ఉన్నారు.