యూఎస్ కాన్సులేట్ పదో వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యూఎస్ కాన్సులేట్ భవనంలో సీఎం జగన్ తమతో మాట్లాడిన వీడియోను యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ‘మా పదేళ్ల ప్రయాణం గురించి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ప్రత్యేక సందేశం’ అంటూ ట్వీట్ చేసిన ఈ వీడియోలో సీఎం జగన్ యూఎస్ కౌన్సిల్ గురించి తన అభిప్రాయాలు వెల్లడించారు.
ఉద్వేగంగా ఉంది..
‘నాన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యూఎస్ కాన్సులేట్‌ను హైదరాబాద్‌కు రప్పించేందుకు ఈ భవనాన్ని కేటాయించారు. సరిగ్గా పదేళ్ల క్రితం నేను ఇప్పుడు ఈ భవనానికి ముఖ్యమంత్రి స్థాయిలో రావడం ఎంతో ఉద్వేగానికి గురిచేస్తోంది. ఈ సుదీర్ఘ కాలంలో ప్రపంచం ఎంతగానో మారిపోయింది. భారత్‌కు సహాయం చేసే విషయంలో అమెరికా ఎల్లప్పుడూ ముందుంటుందన్న విషయం తెలిసిందే. కాన్సులేట్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తోంది. పదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో కీలక సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలు మరింతగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సాఫ్ట్‌వేర్ లేదా ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఉద్యోగం కోసం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉన్న అమెరికా వైపే చూస్తున్నారు. విజయవంతంగా పది వసంతాలు పూర్తి చేసుకున్న యూఎస్ కాన్సులేట్‌కు శుభాభినందనలు. ఆల్ ది బెస్ట్’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.