ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు ఊపిరని, హోదా సాధించేవరకూ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్‌ఆర్ సీపీ) విశ్రమించబోదని అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మార్చి 5 నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో హోదా కోసం పార్టీ ఎంపీలు పోరాటం చేస్తారని చెప్పారు. ఏప్రిల్ 6 వరకూ(బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి) పోరాటం చేసినా ఫలితం లేకపోతే పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు.
86వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘ గత 12 రోజులుగా రాష్ట్రంలో జరగుతున్న డ్రామాను అందరూ గమనిస్తూనే ఉన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారన్న దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రామాకు తెర తీశారు. ఆయన డ్రామా ఏస్థాయిలో నడిచిందో మీ అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు తెలుగుదేశం మంత్రులు ఉన్నారు.