Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu TDP coalition government abolished MDU system1
బియ్యం బండి ఆగింది.. మీ రేషన్‌ మీరే తెచ్చుకోండి

సాక్షి, అమరావతి: పనులు మానుకుని రోజంతా రేషన్‌ డిపోల దగ్గర పడిగాపులు.. బియ్యం కోసం క్యూ లైన్లో కుస్తీలు.. ఎండైనా, వానైనా అరుగులపై కూలబడి అవస్థలు.. తీరా సర్వర్లు మొరాయించడంతో ఉసూరుమంటూ ఇంటి ముఖం పట్టిన దుర్భర దృశ్యాలు రాష్ట్రంలో పునరావృతం కానున్నాయి! వీధివీధినా బెల్టు షాపుల ఏర్పాటుతో ఊరూరా మద్యపుటేరులు పారిస్తున్న టీడీపీ కూటమి సర్కారు ఇప్పటికే రేషన్‌ డోర్‌ డెలివరీ వ్యవస్థను నీరుగార్చగా, తాజాగా పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది. ప్రజల అవస్థలను తొలగిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవస్థ ‘ఇంటి వద్దకే రేషన్‌’ను చంద్రబాబు సర్కార్‌ కక్షపూరితంగా రద్దు చేసింది. ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కుతూ రాజకీయ దురుద్దేశాలతో ఏకపక్షంగా ‘ఎండీయూ’ వ్యవస్థను తొలగించింది. కేవలం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టారనే దుగ్ధతో, వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలను జీర్ణించుకోలేక కోట్లాది మంది పేదలకు సేవలందిస్తున్న ఎండీయూలపై విషం చిమ్ముతూ ఆ వ్యవస్థకే మంగళం పాడేసింది. ఇకపై మీ రేషన్‌.. మీరే తెచ్చుకోండి..! అంటూ ప్రజలను నిలువునా మోసం చేసింది. బాబు ఆగమనం.. రాష్ట్రం తిరోగమనం! టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేసి, వలంటీర్‌ వ్యవస్థను రద్దు చేస్తూ తిరోగమన పాలనకు శ్రీకారం చుట్టింది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సమయంలో.. దేశం మెచ్చిన ఎండీయూ వ్యవస్థకు తిలోదకాలు ఇచ్చేసింది. సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన అంటూ ఊకదంపుడు ఉపన్యా­సా­లతో అరచేతిలో వైకుంఠం చూపించే సీఎం చంద్రబాబు అండ్‌ కో ఉన్న ఉద్యోగాలే ఊడగొడుతోంది. మొన్న... 2.66 లక్షల వలంటీర్ల కుటుంబాలు.. నేడు 9,260 మంది ఎండీయూ ఆపరేటర్ల కుటుంబాలు, వారిపై ఆధారపడి ఉపాధి పొందుతున్న మరో పది వేల మంది హెల్పర్ల కుటుంబాలను నడిరోడ్డు పైకి లాగేశారు. రాష్ట్రంలో 29,500 రేషన్‌ దుకాణాల వద్దకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవడానికి నానా ప్రయాసలు పడిన ప్రజలకు సాంత్వన చేకూరుస్తూ గత ప్రభుత్వం తెచ్చిన ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్‌ విధానాన్ని చంద్రబాబు భారీ ఆర్థిక భారంగా చిత్రీకరించారు. పేదల ఇంటికి ప్రభుత్వ సేవలు చేరుతుంటే దాన్ని అనవసర భారంగా ముద్రవేశారు. మళ్లీ కూలి మానుకునే దుస్థితి.. గత ప్రభుత్వంలో ఎండీయూ వాహనం ఇంటికి వచ్చే ముందు వలంటీర్‌ ద్వారా నిర్ణీత సమయం, తేదీతో సహా లబ్ధిదారులకు సందేశం వెళ్లేది. ఇంటి యజమానే కాకుండా కార్డుదారుల్లో ఏ వ్యక్తి ఉన్నా బియ్యం ఇచ్చేవారు. రేషన్‌ బియ్యం కోసం ఏ ఒక్కరూ పనులు మానుకుని ఎదురు చూడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు రేషన్‌ కోసం కూలి పనులు మానుకుని ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది కార్డుదారులు ఉండగా వీరిలో అత్యధికం రోజువారీ పనులు చేసుకుని జీవించేవారే. వీరంతా రూ.300 – రూ.500 రోజు కూలీని నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. వీరిలో సగటున కోటి మంది రేషన్‌ తీసుకోవడానికి డిపోకు వెళితే ఆ రోజు పనికి దూరం కాక తప్పదు. అంటే ఒక నెలలో ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ తీసుకోవడానికి పేదలు రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లు నష్టపోవాల్సిన పరిస్థితి. ఇక ఏడాదికి రూ.3,600 కోట్ల నుంచి రూ.6 వేల కోట్లు నష్టపోనున్నారు. పోనీ వెళ్లిన రోజే రేషన్‌ వస్తుందా అంటే అదీ లేదు. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో అనుభవాలే దీనికి నిదర్శనం. నెలకు కేవలం రూ.25 కోట్లతో సమర్థంగా నిర్వహించే ఎండీయూ వ్యవస్థను ఆర్థిక భారంగా పరిగణిస్తూ కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది. ఒకవైపు 60 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్‌ ఇస్తుంటే.. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే రేషన్‌ సరుకులు ఇంటికి పంపిస్తామంటూ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఎవరి సహాయంతో రేషన్‌ డోర్‌ డెలివరీ చేస్తారో చెప్పకపోవడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎండీయూలపై నేర ముద్ర.. గతంలో చౌక దుకాణాలపై కేసుల్లేవా! ఓ విప్లవాత్మక వ్యవస్థను నిర్వీర్యం చేయాలంటే నిందారోపణలు చేయాలి. ఇదే చంద్రబాబు సర్కార్‌ స్ట్రాటజీ! అందులో భాగంగానే ఎన్నికల ముందు నుంచే రేషన్‌ అక్రమ రవాణాకు కేరాఫ్‌ అంటూఎండీయూ వ్యవస్థపై గోబెల్స్‌ ప్రచారం సాగించారు. రేషన్‌ అక్రమ రవాణా మొత్తం ఎండీయూల చేతుల్లోనే జరుగుతోందంటూ హీనాతిహీనంగా మాట్లాడారు. వాస్తవానికి ఎండీయూ ఆపరేటర్లు అంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన యువతే. వీరంతా సొంతూరిలో సగౌరవంగా తలెత్తుకుని జీవించేలా, సొంత కాళ్లపై నిలబడేలా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 90 శాతం రాయితీతో వాహనాలను అందించి ఉపాధి కల్పించింది. తద్వారా సామాజిక న్యాయం, సాధికారతకు బాటలు వేసింది. ఎండీయూలకు ఆర్థిక ఊరట కల్పించేందుకు వాహన మిత్ర పథకంలో భాగంగా ఏడాదికి రూ.10 వేలు చొప్పున అందించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎండీయూలపై అక్రమ రవాణాదారులుగా నిందలు మోపింది. 9,260 ఎండీయూ వాహనాల్లో ఇప్పటి వరకు 288 ఆపరేటర్లపై బియ్యం అక్రమ రవాణా కేసులు పెట్టామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ మంగళవారం మీడియా ముఖంగా చెప్పారు. అంటే దాదాపు 9 వేల వాహనాలు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నట్టే కదా? పోనీ గతంలో చౌక ధరల దుకాణదారులపై రేషన్‌ బియ్యం అక్రమ నిల్వ, అక్రమ రవాణా కేసులు లేవా అంటే కోకొల్లలుగా ఉన్నాయి. వ్యవస్థల్లో లోపాలు ఎక్కడైనా సహజంగా ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ పాలన సాగించాల్సిన ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ప్రజా ప్రయోజనకారిగా ఉన్న వ్యవస్థలను శాశ్వతంగా తొలగించడం అవివేకం కాక మరేమిటన్నది ప్రశ్న? ఇక రేషన్‌ డీలర్‌ అందుబాటులో లేకపోతే ఆ నెలలో సరుకులు కచ్చితంగా ఆలస్యం అవుతాయి. కానీ ఎక్కడైనా ఎండీయూ ఆపరేటర్‌ సెలవులో ఉన్నా, అనివార్య కారణాలతో రాకున్నా వీఆర్‌వో ద్వారా లబ్ధిదారులు ఇంటి వద్దే సరుకులు పొందేలా గత ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఎండీయూ వాహన ఆపరేటర్ల పోస్టు ఖాళీగా ఉంటే వెంటనే భర్తీ చేయడంతో పాటు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ప్రాతిపదికపైన నియమించి నిత్యావసరాలను సరఫరా చేసింది. గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఎండీయూ వాహనాలు వెళ్లడం కష్టంతో కూడుకున్నది. ఈ పరిస్థితుల్లో అదనపు ఖర్చు చేసి ఇతర వాహనాల్లో లబ్ధిదారుల ఇళ్లకు రేషన్‌ చేరవేసింది. ఆసక్తి చూపిన ఎనిమిది రాష్ట్రాలు.. రేషన్‌ పంపిణీలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 2021లో రూ.530 కోట్లకు పైగా వ్యయంతో ‘ఇంటి వద్దకే రేషన్‌’ వ్యవస్థను తీసుకొచ్చింది. నాణ్యమైన సార్టెక్స్‌ బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి ముంగిటికే వాహనాల ద్వారా (ఎండీయూ) డోర్‌ డెలివరీ చేయడంతో పాటు ఐసీడీఎస్‌(అంగన్‌వాడీలు), మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు కూడా ఫోరి్టఫైడ్‌ బియ్యాన్ని నేరుగా సరఫరా చేసింది. దీంతో అంగన్‌వాడీలు, పాఠశాలలకు వ్యయ ప్రయాసలు తొలగిపోయాయి. గోదావరి వరదలు, విజయవాడ వరదలు లాంటి విపత్తుల సమయంలోనూ ఎండీయూలే సమర్థంగా సేవలందించాయి. ఇలా ఓ వ్యవస్థను వివిధ ప్రభుత్వ సేవలకు వినియోగించుకునే వెసులుబాటు ఉన్నప్పుడు దాన్ని విస్మరించి ఏకపక్షంగా రద్దు చేయడం సిగ్గుచేటు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండీయూ వ్యవస్థ వచ్చిన తర్వాత రేషన్‌ వినియోగం పారదర్శకంగా 90 శాతానికిపైగా పెరిగింది. దేశంలో 8 రాష్ట్రాలకు పైగా రేషన్‌ డోర్‌ డెలివరీపై ఆసక్తి కనబరిచాయి.అధికారంలోకి రాగానే అడ్డుకున్న కూటమి ఎమ్మెల్యేలు.. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది రేషన్‌ కార్డుదారులకు ఎండీయూ వ్యవస్థ ద్వారా సమర్థంగా నాణ్యమైన బియ్యం పంపిణీ జరుగుతోంది. ఒక్కో ఎండీయూ వాహనం రోజుకు 90 కార్డులకు తగ్గకుండా నెలలో 17 రోజుల పాటు ఇంటి వద్దకే వెళ్లి రేషన్‌ను చేరవేస్తోంది. కల్తీకి ఆస్కారం లేకుండా, కచ్చితమైన తూకంతో ప్రజల సమక్షంలో బియ్యాన్ని ఇంటి ముంగిట్లో అందజేస్తోంది. వివిధ కారణాలతో ఇంటి దగ్గర ఎవరైనా రేషన్‌ తీసుకోకుంటే సాయంత్రం పూట గ్రామ, వార్డు సచివాలయం వద్ద ఇచ్చేలా వెసులుబాటు ఉంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యల్లో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరికీ సార్టెక్స్‌ బియ్యాన్ని సరఫరా చేసింది. ఈ క్రమంలో ఎక్కడా రేషన్‌ డీలర్ల ఉపాధికి ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు. కేవలం ప్రజల దగ్గరకే ప్రభుత్వ సేవలు చేరువయ్యాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆర్థిక భారం పేరుతో ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీని నిలిపివేసింది. అధికారంలోకి రాగానే కూటమి పార్టీల ఎమ్మెల్యేలు 2 వేలకుపైగా ఎండీయూ వాహనాలను బలవంతంగా నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లో చౌక ధరల దుకాణాల్లోకి వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవాలని హుకుం జారీ చేశారు. పేదల ఇంటికి రేషన్‌ వద్దు... మద్యం ముద్దుపేదల ఇంటికి రేషన్‌ వద్దు గానీ మద్యం మాత్రం ముద్దు అనే రీతిలో టీడీపీ కూటమి సర్కారు చర్యలున్నాయి. బెల్ట్‌ షాపులతో ప్రతీ గ్రామంలో మద్యం డోర్‌ డెలివరీ చేస్తూ ఇంటివద్దకే రేషన్‌ను మాత్రం అదనపు వ్యయంగా చిత్రీకరిస్తోంది.2027 వరకు ఒప్పందం గడువు ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి ఆ వాహనాలను ఆపరేటర్లకు ఉచితంగా ఇస్తామంటూ మంత్రి నాదెండ్ల ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఎండీయూ అసోసియేషన్లు, చౌక ధరల దుకాణదారుల అసోసియేషన్ల సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే దీనిపై విధివిధానాలు ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. 2027 వరకు ఒప్పందం గడువు ఉన్నందున మధ్యలో ఎలా వెళ్లగొడతారని ఎండీయూ అసోసియేషన్‌ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. అర్ధంతరంగా ఎండీయూలను నిలిపివేస్తే తాము ఉపాధి కోల్పోవడంతోపాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని విన్నవించినా ప్రభుత్వం ఆలకించలేదు. తమకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు లేకుండా ఎన్‌వోసీ ఇచ్చిన తర్వాతే రద్దుపై నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ఎండీయూలను కొనసాగించాల్సిందేనని తేల్చిచెప్పారు. రోడ్డుపై వదిలేస్తాం అంటే ఊరుకోముఎండీయూ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడే మాకు 72 నెలలకు అగ్రిమెంట్‌ చేశారు. 2027 జనవరి వరకు సమయం ఉంది. ఇంకా సుమారు 20 నెలలు కొనసాగే హక్కు మాకు ఉంది. ఇన్నేళ్లుగా మా సేవలను వినియోగించుకుని ఇప్పుడేదో ఉచితంగా వాహనం ఇచ్చేస్తున్నట్లు మాట్లాడటం సరికాదు. మాకేమైనా దానధర్మం చేస్తున్నారా? మేం పని చేయలేదా? ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రోడ్డుపై వదిలేస్తామంటే చూస్తూ ఊరుకోం. బుధవారం నుంచి మా కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం మాకు ఏం ఉపాధి చూపిస్తారో చెప్పాలి. స్పందించకుంటే న్యాయ స్థానాన్ని ఆశ్రయించడానికి కూడా వెనుకాడబోం. మాకు న్యాయం చేయకుండా డీలర్ల ద్వారా రేషన్‌ పంపిణీ ఎలా చేస్తారో చూస్తాం. ముందుగా మాకు బ్యాంకుల నుంచి ఎన్‌వోసీ ఇప్పించి జీవనోపాధి చూపించాలి. – రౌతు సూర్యనారాయణ, ఎండీయూ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడుఇబ్బంది లేకుండా సరుకులు తీసుకున్నాంఇంటి ముందుకే రేషన్‌ వాహనం రావడం వల్ల ఇబ్బంది లేకుండా సరుకు­లు తీసుకున్నాం. ఐదేళ్లు ప్రశాంతంగా ఇంటి ముందుకే వచ్చాయి. ఇప్పుడు వాహనాలు రావంటే మాలాంటోళ్లం ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా ఇంటి నుంచి రేషన్‌ షాపు అర కిలోమీటరు దూరంలో ఉంది. అంత దూరం నడిచి వెళ్లి క్యూలో నిలబడాలి. డీలర్‌ ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి. వేలిముద్రలు పడకపోతే గంటల తరబడి నిలబడాలి. మమ్మల్ని ఇన్ని కష్టాలు పెడితే ఈ ప్రభుత్వానికి ఏం వస్తుంది? – దారుకుమల్లి వెంకటసుబ్బమ్మ, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా గిరిజనులకు ఎంతోమేలు జరిగింది గతంలో గిరిజనులంతా నిత్యావసరాలు పొందేందుకు అవస్థలు పడ్డారు. గత ప్రభుత్వం ఎండీయూ వాహ­నాలతో ఇంటింటికి బియ్యం, ఇతర నిత్యావసరాల పంపిణీని ప్రారంభించి గిరిజనులకు ఎంతో మేలు చేసింది. కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేస్తే 3 కి.మీ. దూరంలో ఉన్న మినుములూరు డీఆర్‌ డిపో నుంచి సరుకులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. –పాలికి లక్కు, గిరిజనుడు, గుర్రగరువు గ్రామం, మినుములూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా మాగ్రామంలో రేషన్‌ షాపు లేదు మా గ్రామంలో రేషన్‌ షాపు లేదు. మూడు కి.మీ. దూరంలో ఉన్న బురాందొడ్డికి వెళ్లి బియ్యం, ఇతర రేషన్‌ సరుకులు తెచ్చుకునేవాళ్లం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాకు రేషన్‌ కష్టాలు తొలిగాయి. ఇంటి దగ్గరకే రేషన్‌ బండి వచ్చింది. ఇప్పుడు వాటిని తీసి వేస్తే మళ్లీ బియ్యం సంచి నెత్తిన మోయాల్సిందే. చంద్రబాబు పుణ్యమా అని పాత కష్టాలు పునరావృతమవుతున్నాయి. – రహేలమ్మ, బ్యాతోలి గ్రామం, సీబెళగల్‌ మండలం, కర్నూలు జిల్లా

Donald Trump Golden Dome Missile Shield System Protect USA2
175 బిలియన్‌ డాలర్లతో ట్రంప్‌ ‘గోల్డెన్‌ డోమ్‌’.. చైనా, రష్యా ఆందోళన..

వాషింగ్టన్‌: ప్రపంచంలోని పలు దేశాల మధ్య యుద్ధం వాతావరణం కొనసాగుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ వార్‌.. ఇక, ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణ వంటి పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, రక్షణ వ్యవస్థల గురించి చాలా చర్చలు జరిగాయి. ఇలాంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆ దేశానికి కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ‘గోల్డెన్ డోమ్’ అని పేరు పెట్టారు. ఈ ‘గోల్డెన్‌ డోమ్‌’ కోసం ఏకంగా దాదాపు రూ.15 వేల కోట్లకు పైగా( 175 బిలియన్‌ డాలర్లు)ఖర్చు చేస్తామని వెల్లడించారు.వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కోసం కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అమెరికాను క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి మూడేళ్లలోనే ‘గోల్డెన్‌ డోమ్‌’ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతానికి 25 బిలియన్‌ డాలర్ల ప్రారంభ నిధులు కేటాయిస్తున్నామని, అంతిమంగా 175 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజల కోసం రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.అత్యంత సాంకేతికతతో కూడిన మిస్సైల్ డిఫెన్స్ షీల్డ్ ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాజెక్ట్ ను ఆమోదిస్తున్నందుకు సంతోషంగా ఉందని ట్రంప్ తెలిపారు. గోల్డెన్ డోమ్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం అవతలి నుంచి అమెరికాపై క్షిపణి దాడులు చేసినా ఇది తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. స్పేస్ నుంచి దాడులు చేసినా అమెరికాకు ఏమీ కాదన్నారు. మన దేశం విజయంలో.. మనం భూమి మీద నివసించాలంటే ఇలాంటివి అవసరం అని ట్రంప్ పేర్కొన్నారు.🚨 #BREAKING: President Trump and Secretary Hegseth have announced the GOLDEN DOME missile defense system for the U.S."Golden Dome will be capable of catching missiles from across the world or even SPACE.""We'll be completing the job Reagan started 40 years ago!"Trump also… pic.twitter.com/MX1URx1fa0— Nick Sortor (@nicksortor) May 20, 2025యూఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లీన్ నాయకత్వంలో గోల్డెన్‌ డోమ్‌ నిర్మాణం జరుగుతుందని ట్రంప్‌ పేర్కొన్నారు. దీని నిర్మాణంలో భాగం కావడానికి కెనడా సైతం ఆసక్తిని చూపినట్లు తెలిపారు. డోమ్‌ నిర్మాణానికి 175 బిలియన్‌ డాలర్లు ఖర్చు అవుతుందని ట్రంప్‌ పేర్కొన్నప్పటికీ.. దీనికి 542 బిలియన్‌ డాలర్ల వ్యయం అవుతుండొచ్చని కాంగ్రెస్‌ బడ్జెట్‌ ఆఫీస్‌ అంచనా వేసింది. పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్ మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేశాన్ని క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, హైపర్‌సోనిక్ క్షిపణులు, డ్రోన్‌లు, అణు దాడుల నుంచి రక్షించడమే లక్ష్యంగా దీని ఏర్పాటుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.చైనా, రష్యా ఆందోళన..ఇక, ఇప్పటికే ఇజ్రాయెల్.. ఐరన్ డోమ్ వ్యవస్థను 2011 నుంచి ఉపయోగిస్తోంది. ప్రత్యర్థుల క్షిపణులు దూసుకొచ్చినా.. ఉక్కు కవచంలా వాటిని అడ్డుకునేందుకు టెల్‌అవీవ్‌ ఈ డోమ్‌ను ఉపయోగిస్తుంది. దీని నిర్మాణానికి అమెరికా పూర్తిగా సాయం చేసింది. దీంతో అటువంటి గోల్డెన్‌ డోమ్‌ను అభివృద్ధి చేసుకునేందుకు అమెరికా (USA) సైతం సిద్ధమయ్యింది. అయితే, ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై చైనా, రష్యా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విధానం వల్ల అంతరిక్షం యుద్ధభూమిగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. ప్రపంచంలో అస్థిర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశాయి. . @SecDef "The Golden Dome for America’s game changer. A generational investment in security in America and Americans..." pic.twitter.com/uazlPcCytR— DOD Rapid Response (@DODResponse) May 20, 2025

YS Jagan Fires on TDP Govt Over Red Book Politics3
హామీలు గాలికి.. కుట్రలు తెరపైకి..: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికలప్పుడు ఇచ్చిన సూపర్‌ సిక్స్, ఇతర హామీలు అమలు చేయకపోగా ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడంపైనే దృష్టి పెట్టిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థ­లన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని, ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదని.. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు పెచ్చుమీరిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రెడ్‌బుక్‌ కుట్రలతో విధ్వంసం సృష్టిస్తున్నారని, బరితెగించి యథేచ్ఛగా కేసుల మీద కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని.. మనం రాక్షస యుగంలో ఉన్నామని, చంద్రబాబు పాలనలో రాజకీయాలు నైతికంగా పతనం అయ్యాయన్నారు. అయితే ఈ అక్రమ కేసులు, అరెస్టుల పర్వానికి భయపడాల్సిన అవసరం లేదని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు తేల్చి చెప్పారు. జైళ్లకు పంపినా సరే.. ‘చంద్ర­బాబూ.. నిన్ను ఎదుర్కొంటాం’ అని ధైర్యంగా, గట్టిగా నిలబ­డగలిగినప్పుడే రాష్ట్రంలో రాజకీయం చేయగలమని స్పష్టం చేశారు.ఆయన మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీ­పురం మున్సిపాలిటీ, పశ్చిమ గోదా­వరి జిల్లా పాల­కొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం, శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామ­గిరి మండలం, గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొ­రేషన్‌కు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావే­శ­మ­య్యారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై చర్చించి.. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్‌సీపీకి కార్యకర్తే నంబర్‌ వన్‌ అని, వచ్చేది మన ప్రభుత్వమే­నని, జగన్‌ 2.0లో కార్యకర్తలకే అత్యధిక ప్రాధా­న్యం ఇస్తామని పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌లు, వైస్‌ చైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, ఆయా జిల్లాల పార్టీ ముఖ్య నాయకులను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత ⇒ ఈ రోజు మనం ఎలాంటి పరిస్థితుల మధ్య ప్రయాణం చేస్తున్నామో నా కంటే మీకే బాగా తెలుసు. మనం రాక్షస యుగంలో ఉన్నాం. కలియుగంలో అంటే చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలంటే.. కేసులు వేసినా భయపడకూడదు. జైళ్లకు పంపినా, చంద్ర­బాబూ.. నిన్ను ఎదుర్కొంటాం అని గట్టిగా అంటేనే రాజకీయాల్లో ఉండగలం. రాజకీయాలు చేయగలం. అదే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటున్న పాఠం. ఈరోజు రాజకీయాలు అలా తయారయ్యాయి. ⇒ మామూలుగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఏడాది తర్వాత కొంత వస్తుంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వానికి ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు ఆయన్ను తీవ్రంగా ద్వేషిస్తున్నారు. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చాడు. జగన్‌ ఇచ్చినవన్నీ ఇవ్వడమే కాకుండా, ఇంకా మూడు ఎక్కువ ఇస్తానన్నాడు. కానీ, ఏదీ నిలబెట్టుకోలేదు. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. అందుకే ఆయన ప్రభుత్వంపై అంత వ్యతిరేకత వచ్చింది.⇒ చంద్రబాబు, ఆయన పార్టీ కార్యకర్తలు ఏ ఒక్క ఇంటికీ ధైర్యంగా పోలేరు. వారు ఏ ఇంటి తలుపు తట్టినా.. పిల్లవాడి స్థాయి నుంచి ప్రశ్నించడం మొదలు పెడతారు. ఎన్నికలప్పుడు ఇంటింటికి పోయి ఏం చెప్పారు? బాండ్లు అన్నాడు. ఇంకా ఏమేం చెప్పారు? ఇంటింటికీ వెళ్లి, చిన్న పిల్లాడు కనబడితే నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని, అదే ఇంట్లో ఆ పిల్లల అమ్మ కనబడితే నీకు రూ.18 వేలు అని, ఆ ఇంట్లోనే అమ్మమ్మలు కనబడితే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్ల యువకుడు కనబడితే నీకు రూ.36 వేలు అని, రైతు కనబడితే నీకు రూ.26 వేలు ఇస్తామని చెప్పారు. ఆ మాటలు ఇంకా వారిని వెంటాడు­తాయి. మాట మీద నిలబడని రాజకీయ నాయకుడు సీఎం హోదాలో ఉన్నాడు. మాట ఇస్తే, దాన్ని అమలు చేయని వ్యక్తి సీఎంగా ఉన్నాడు.వ్యవస్థలన్నీ నిర్వీర్యం ⇒ రాష్రంలో విద్యా రంగం నిర్వీర్యం అయింది. ఇంగ్లిష్‌ మీడియం లేదు. గోరుముద్ద నామమాత్రం అయింది. నాడు–నేడు లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. మనం అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున ఇచ్చాం. ఇవాళ అది లేదు. నిరుపేదల ఆరోగ్యం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని వదిలేసింది. ఆ బిల్లులు దాదాపు రూ.3,600 కోట్లు ఇవ్వడం లేదు. ఆరోగ్య ఆసరా అమలులోనే లేదు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వక పోవడంతో వైద్యానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. ⇒ ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. దళారులు వచ్చారు. ఆర్బీకే వ్యవస్థను నాశనం చేశారు. ఉచిత ఇన్సూ్యరెన్స్‌ లేదు. పంటనష్ట పరిహారం ఇవ్వడం లేదు.మనం బాగు చేస్తే.. బాబు చెడగొడుతున్నాడు ⇒ మనం 17 మెడికల్‌ కాలేజీలు కడితే, ఈరోజు వాటిని అమ్మేస్తున్నారు. ఏదైనా జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఉంటే, అక్కడ అన్ని వైద్య సదుపాయాలు, ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఉన్నట్లు. దానివల్ల ఆ జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు రోగులను మోసం చేయలేవు.⇒ మనం మూలపేట (శ్రీకాకుళం జిల్లా)తోపాటు మూడు పోర్టులు కట్టడం మొదలు పెట్టాం. వాటిలో 30 శాతం పనులు పూర్తి చేస్తే, కమీషన్ల కోసం చంద్రబాబు వాటిని అమ్మేస్తున్నాడు.⇒ ఉత్తరాంధ్రలో ట్రైబల్‌ ఇంజినీరింగ్, మెడికల్‌ కాలేజ్, ఐటీడీఏ పరిధిలో ఐదు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం మొదలు పెడితే, ఈ పెద్దమనిషి మొత్తం వదిలేశాడు. భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కోసం మనం భూసేకరణ చేశాం. 30 శాతం పనులు చేశాం. రాష్ట్రంలో ఎక్కడైనా, ఏ ప్రాంతంలో అయినా, ఏ అభివృద్ధి అయినా జరిగింది అంటే కేవలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే.⇒ చంద్రబాబు అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు. ఆయన ఎక్కడా మాట నిలబెట్టుకోలేదు. అలా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. అందుకే తనను ఎవరూ ప్రశ్నించకూడదని భయానక పాలన సాగిస్తున్నాడు. అందులో భాగంగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుపుతున్నారు. ఎవరు మాట్లాడినా, వారి గొంతు నొక్కుతున్నారు. నిలదీస్తున్న గొంతులను నలిపేస్తున్నారు.రాష్ట్రంలో తొలిసారిగా మాన్యుఫ్యాక్చర్‌ విట్నెస్‌ సృష్టిస్తుండటాన్ని చూస్తున్నాం. అంటే నేరంతో ఒక మనిషికి సంబంధం లేకపోయినా, వారికి సంబంధించిన ఒక వ్యక్తిని పట్టుకుని అప్రూవర్‌ అంటున్నారు. ఆయనతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నారు. ఆ మనిషితో, ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు. ఈ మనిషిని అరెస్టు చేస్తున్నారు. అలా ఒక మాన్యుఫ్యాక్చర్‌ ఎవిడెన్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. చరిత్రలో గతంలో ఏనాడూ ఇలాంటివి జరగలేదు. ఒక తప్పుడు సంప్రదాయానికి ఈ పెద్దమనిషి చంద్రబాబు ఈరోజు బీజం వేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో పాత కేసులు తిరగ తోడుతున్నారు. మన ఎమ్మెల్యే అభ్యర్థులు, చురుగ్గా పని చేస్తున్న ప్రజా ప్రతినిధులు, నాయకులను ఇరికిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. - వైఎస్‌ జగన్‌మన ప్రభుత్వ హయాంలో ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ఇంటింటికీ వెళ్లగలిగాడు. మేనిఫెస్టో చూపి, జగన్‌ ఏం చేశాడో చూపి టిక్‌ పెట్టమని అడిగాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు.. మూడు సార్లు ప్రతి ఇంటికీ వెళ్లి, ఎన్నికల ముందు ఏమేం చేశామో చెప్పాం. వాటిని చూపాం. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తి చేసిన పార్టీ దేశంలో ఎక్కడా లేదు. అయినా మనం ప్రతిపక్షంలో ఉన్నాం. కారణం కేవలం 10 శాతం మంది వారి మాటలు నమ్మి, మనకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇంత మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చున్నామంటే.. చంద్రబాబు పరిస్థితి ఏమిటి? ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ప్రజలు ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తంతారు. - వైఎస్‌ జగన్‌ఉధృతంగా పోరాడుదాం.. రాబోయేది మన ప్రభుత్వమే⇒ ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. మంగళగిరికి చెందిన సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ పాలేటి కృష్ణవేణిని హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చి, పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిప్పారు. అలాగే సుధారాణిని నెలల తరబడి శ్రీకాకుళం నుంచి అన్ని స్టేషన్లు తిప్పారు. బెయిల్‌ రాకుండా చూశారు. మాజీ ఎమ్మెల్యే వంశీపై 11 కేసులు పెట్టారు. ఒకదాంట్లో బెయిల్‌ వస్తే.. మరో కేసు.. రెండు నెలలుగా జైల్లోనే ఉంచారు. ఒక దాని తర్వాత మరో కేసు పెడుతున్నారు.⇒ ఇంకొకరు మాజీ ఎంపీ నందిగం సురేష్‌. దళితుడు. నెలల తరబడి జైల్లో పెట్టారు. బెయిల్‌ మీద బయటకు వస్తే, మరో కేసులో ఇరికించి, జైలుకు పంపారు. వాళ్ల ఇంటి దగ్గరకొచ్చి ఒక మనిషి తిట్టాడు. ఎందుకు తిడుతున్నావని ప్రశ్నిస్తే, మరో కేసు పెట్టి, జైలుకు పంపారు.⇒ ఈ రోజు ఒక తప్పుడు సంప్రదాయం మొదలు పెట్టారు. అది ఒక వృక్షమై, రెండింతలు పెరిగి, వాళ్లనే తన్నే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో గట్టిగా పోరాడుదాం. చూస్తుండగానే ఏడాది గడిచింది. ఇంకా చూస్తుండగానే మూడేళ్లు గడుస్తాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. చీకటి తర్వాత వెలుగు తప్పదు. మనం తప్పకుండా గెలుస్తాం. అందుకే రాబోయే రోజుల్లో ఉధృతంగా పోరాడాలి. ఈలోగా గ్రామ స్థాయి నుంచి బూత్‌ కమిటీలు, మండల, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఉద్యమబాట పట్టి, ప్రభుత్వ తప్పులను ప్రజల్లో ఎండగట్టాలి. అందుకే ఈ సమావేశాల నిర్వహణ. ఈ ప్రక్రియలో పార్టీ నాయకులు, కార్యకర్తలది చాలా గొప్ప పాత్ర.వైఎస్సార్‌సీపీకి కార్యకర్తే నంబర్‌ వన్‌ ⇒ ప్రతి కార్యకర్తకు చెబుతున్నా. మీకు ఎవరు అన్యాయం చేసినా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా, వారి పేరు రాసుకోండి. అది ఏ బుక్‌ అయినా సరే. వారి పేరు మాత్రం కచ్చితంగా రాసి పెట్టుకోండి. ఆ తర్వాత మనం వచ్చాక, ఈరోజు మీకు అన్యాయం చేసిన వారికి సినిమా చూపిస్తాం. ఆ మనిషి రిటైర్‌ అయినా, దేశం వదిలి పోయినా లాక్కొస్తాం. ఎవ్వరినీ వదిలి పెట్టం. సినిమా ఎలా చూపాలో వారికి చూపిస్తాం. మిమ్మల్ని ఎవరైనా కొట్టినా కొట్టించుకోండి. ఫరవా­లేదు. నీ టైమ్‌ బాగుంది.. కొట్టు అనండి. ఆ తర్వాత మన టైమ్‌ వస్తుంది. అప్పుడు మనం కొడతాం. ఇవాళ వారు నాటుతున్న విత్తనం రేపు రెండింతలు అవుతుంది.⇒ ఈరోజు నేను మీ అన్నగా, మీ బిడ్డగా ఒకటే చెబుతున్నా. జగన్‌ 2.0లో పరిస్థితి ఇలా ఉండదు. పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ రోజు కార్యకర్తల కష్టాలు చూశాను. స్వయంగా చెబుతున్నాను. గతంలో మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్‌. దాంతో మనం యుద్ధం చేశాం. అందువల్ల అనుకున్న మేరకు కార్యకర్తలకు చేయలేకపోయాను. ఇప్పుడు చెబుతున్నాను. రేపు ఈ పరిస్థితి ఉండదు. వైఎస్సార్‌సీపీకి కార్యకర్తనే నంబర్‌ వన్‌.

Vaibhav Suryavanshi Creates History 1st Player To Remarkable Feat4
చరిత్ర సృష్టించిన వైభవ్‌.. ఐపీఎల్‌ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా..

రాజస్తాన్‌ రాయల్స్‌ చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో ఓ సీజన్‌లో అత్యంత పిన్న వయసులోనే అత్యధిక ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK vs RR)తో మంగళవారం నాటి మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘనత సాధించాడు.దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన వైభవ్‌ సూర్యవంశీని రాజస్తాన్‌ రాయల్స్‌ ఐపీఎల్‌-2025 మెగా వేలంలో రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. కెప్టెన్‌, ఓపెనింగ్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ గాయం కారణంగా.. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా వైభవ్‌కు అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది.విధ్వంసకర శతకంతొలి మ్యాచ్‌లో 20 బంతుల్లో 34 పరుగులతో అలరించిన పద్నాలుగేళ్ల వైభవ్‌.. ఆ తర్వాత గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో సత్తా చాటాడు. కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు సాధించి.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు.ఇక ఆ తర్వాతి మ్యాచ్‌లో డకౌట్‌ అయిన వైభవ్‌.. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో 15 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. తాజాగా సీఎస్‌కేపై చితక్కొట్టిన ఈ హర్యానా కుర్రాడు 33 బంతుల్లో 57 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ సీజన్‌లో వైభవ్‌ సూర్యవంశీ ఏడు మ్యాచ్‌లు ఆడి ఓ శతకం, ఓ అర్ద శతకం సాయంతో 252 పరుగులు సాధించాడు.తద్వారా ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు సాధించిన ఆటగాడిగా వైభవ్‌ నిలిచాడు. అది కూడా 18 ఏళ్ల వయసులోపే ఈ ఘనత సాధించి.. తన పేరిట చెక్కు చెదరని రికార్డు లిఖించుకున్నాడు. ఇక ఐపీఎల్‌-2025లో తమ ఆఖరి మ్యాచ్‌లో చెన్నైతో తలపడ్డ రాజస్తాన్‌.. ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఓవరాల్‌గా సీజన్‌ మొత్తంలో పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలుపొందింది.18 ఏళ్ల వయసు నిండక ముందే ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు👉వైభవ్‌ సూర్యవంశీ- మొత్తం పరుగులు- 252 (రెండు ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు)👉ఆయుశ్‌ మాత్రే- మొత్తం పరుగులు- 206 (ఒక ఫిఫ్టీ ప్లస్‌ స్కోరు)👉రియాన్‌ పరాగ్‌- మొత్తం పరుగులు- 160 (ఒక ఫిఫ్టీ ప్లస్‌ స్కోరు)👉సర్ఫరాజ్‌ ఖాన్‌- మొత్తం పరుగులు- 111 (ఫిఫ్టీ ప్లస్‌ స్కోరు-0)👉అభిషేక్‌ శర్మ- 63 (ఫిఫ్టీ ప్లస్‌ స్కోరు-0).చదవండి: ఆ యంగ్ క్రికెట‌ర్‌కు నేను హాగ్ ఇవ్వ‌లేదు: ప్రీతి జింటాNo fear and pressure 🙅‍Just pure finesse 😎Vaibhav Suryavanshi with a scintillating fifty in the chase 🔥Updates ▶ https://t.co/hKuQlLxjIZ #TATAIPL | #CSKvRR | @rajasthanroyals pic.twitter.com/YUsYYeCQC0— IndianPremierLeague (@IPL) May 20, 2025

Pak army chief General Asim Munir promoted5
పాక్‌ ఆర్మీ చీఫ్‌కు ప్రమోషన్‌

ఇస్లామాబాద్‌: భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ అత్యున్నత మిలటరీ హోదా అయిన ఫీల్డ్‌ మార్షల్‌గా ప్రమోషన్‌ పొందారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ప్రధాని షరీఫ్‌ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌కు ఫీల్డ్‌ మార్షల్‌ హోదా కట్టబెట్టేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనపై చర్చించి, ఆమోదం తెలిపిందని పేర్కొంది.ఇటీవల భారత్‌తో తలెత్తిన సైనిక ఉద్రిక్తతల సమయంలో పాక్‌ బలగాలను విజయం దిశగా నడిపించిన మునీర్‌ పదోన్నతి పొందారని స్థానిక మీడియా తెలిపింది. ఈ విషయంలో ఆయన అద్వితీయమైన పాత్ర పోషించారని ప్రశంసించింది. యుద్ధంలో తమదే విజయమంటూ పాకిస్తాన్‌ గొప్పలు చెప్పుకుంటుండగా, భారత్‌ మాత్రం సాక్ష్యాధారాలతో వివిధ అంతర్జాతీయ వేదికలపై వాస్తవాలను వివరిస్తూ వస్తోంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ తిరుగులేని అధికారాలను చెలాయిస్తున్న మునీర్‌కు ఇటీవల ఆ దేశ సుప్రీంకోర్టు మరిన్ని అధికారాలను కట్టబెట్టడం తెల్సిందే. తాజాగా, ఆయనకు ప్రమోషన్‌ సైతం లభించడం గమనార్హం. Government of Pakistan has promoted Army Chief General Asim Munir to the rank of Field Marshal. ⭐⭐⭐⭐⭐ pic.twitter.com/NNrAM9Npzp— Ambassador Murad Baseer (@muradbaseer) May 20, 2025

No Air Defence Guns Deployed in Golden Temple Premises6
‘స్వర్ణదేవాలయంలో వైమానిక రక్షణ తుపాకులు మోహరించలేదు’

అమృత్‌సర్: ఆపరేషన్ సిందూర్ సమయంలో స్వర్ణ దేవాలయం(Golden Temple) ప్రాంగణంలో ఎటువంటి వైమానిక రక్షణ తుపాకులు, ఇతర వైమానిక రక్షణ వనరులను మోహరించలేదని సైన్యం స్పష్టం చేసింది. పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్న డ్రోన్, క్షిపణి ముప్పును ఎదుర్కొనేందుకు స్వర్ణ దేవాలయం నిర్వాహకులు ఆలయ ప్రాంగణంలో వైమానిక రక్షణ తుపాకులను మోహరించేందుకు అనుమతిచ్చారనే వార్తల నేపథ్యంలో సైన్యం ఈ ప్రకటన చేసింది.స్వర్ణ దేవాలయంలో ఏడీ (వాయు రక్షణ) తుపాకుల మోహరింపునకు సంబంధించి పలు రకాలుగా వార్తలు వస్తున్నాయని, ఇది నిజం కాదని, ఆలయ ప్రాంగణంలో ఏడీ తుపాకులు, మరే ఇతర ఏడీ వనరులను మోహరించలేదని ఆర్మీ(Army) ఒక ప్రకటనలో తెలిపింది. దీనికిముందు ఇలాంటి వార్తలను తోసిపుచ్చుతూ, ఆలయ అదనపు ప్రధాన పూజారి మీడియాతో మాట్లాడుతూ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) భారత సైన్యానికి వైమానిక రక్షణ తుపాకులను మోహరించడానికి అనుమతి ఇవ్వలేదన్నారు.భారత్‌-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన దరిమిలా బ్లాక్‌అవుట్ సమయంలో లైట్లు ఆపివేయడంపై మాత్రమే అధికారులు తమను సంప్రదించారని ఎస్‌జీపీసీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి తెలిపారు. హర్మందర్ సాహిబ్‌లో వాయు రక్షణ తుపాకుల మోహరింపునకు సంబంధించి ఏ ఆర్మీ అధికారి నుండి ఎటువంటి సంప్రదింపులు జరగలేదని ధామి పేర్కొన్నారు. ఇదేవిధంగా హర్మందర్ సాహిబ్ అధికారి గ్రంథి గియాని రఘ్‌బీర్ సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ సమయంలో తాను విదేశీ పర్యటనలో ఉన్నానని, ఆలయంలో తుపాకీల మోహరింపునకు సంబంధించి తనతో ఎటువంటి సంప్రదింపులు జరగలేదని స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: Covid-19 Returns: 257 కేసులు.. ఇద్దరు మృతి

International Tea Day: These Indian women's tea entrepreneurs7
'టీ' వ్యాపారంలో సత్తా చాటుతున్న మహిళలు వీరే..!

రోజులో తేనీటి ప్రాముఖ్యత ఎంతటిదో మనకు తెలిసిందే. అంతటి ముఖ్యమైన టీ వ్యాపార ప్రపంచంలోనూ తమ సత్తా చాటుతున్నారు భారతీయ మహిళలు. ఇంటర్నేషనల్‌ టీ డే సందర్భంగా వారి ప్రయాణ విజయాలు...భారతదేశ తేయాకు పరిశ్రమలో 50 శాతానికి పైగా పైగా మహిళలు ఉన్నట్టు నివేదికలు చూపుతున్నాయి. టీ ఎస్టేట్‌ నిర్వహణలోనూ, ఎగ్జిక్యూటివ్‌ పదవుల్లోనూ గణనీయమైన సంఖ్యలో మహిళలు ఉన్నారు. తేనీటి పరిశ్రమల్లోనూ మహిళల పాత్ర పెరుగుతున్నట్లు నవతరమూ తన విజయాల ద్వారా నిరూపిస్తోంది. ఇక తేయాకు తోటలలో కార్మికులుగా మహిళల శాతమే ఎక్కువ. సవాళ్లను అధిగమించడానికి, విజయవంతమైన వ్యాపార నిర్వహణలో సానుకూల మార్పును సృష్టించేలా తేనీటి రంగంలో ఈ మహిళలు తమ సామర్థ్యాన్ని చూపుతున్నారు. కెఫిన్‌ లేని టీ ఇండియాలో మొట్టమొదటి సర్టిఫైడ్‌ టీ సొమెలియర్‌గా స్నిగ్ధ మంచంద తన పేరును సుస్థిరం చేసుకుంది. ముంబై వాసి అయిన స్నిగ్ధ ‘టీ ట్రంక్‌’ కంపెనీ ద్వారా 2000 వేల రకాల టీ స్పెషల్స్‌ను అందిస్తోంది. ‘టీ వ్యాపారం గురించి ప్రొఫెషనల్‌గా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఏ విద్యాసంస్థా నాకు కనిపించలేదు. దీంతో భారతదేశంలో టీ స్కూల్‌ను ప్రారంభించాలనుకున్నాను. 2013లో కేవలం ఆరు టీ మిశ్రమాలతో టీ ట్రంక్‌ను ప్రారంభించాను. వాటి తయారీలో పరిపూర్ణత సాధించడానికి రెండేళ్ల సమయం పట్టింది. ప్రారంభ దశలో లిస్టింగ్, పంపిణీదారుల వైఖరి చాలా కష్టంగా ఉండేది. దీంతో దృష్టిని ఈ–కామర్స్‌ వైపు మళ్లించి, నేరుగా టీ ప్రియుల వద్దకు చేరుకున్నాను. సీజన్‌కు తగినట్టు టీలను మార్చుకోవాలని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తాను. వేసవిలో శరీరానికి చల్లదనాన్నిచ్చే హై బిస్కస్‌ గ్రీన్‌ టీ బాగుంటుంది. మందార పూల రేకలతో టీ సాంత్వనను ఇస్తుంది. కాలానికి తగినట్టు టీ తయారీ స్పెషల్స్‌ మా వద్ద లభిస్తాయి. వీటిలో ఎలాంటి కెఫిన్‌ ఉండదు. – స్నిగ్ధ మంచంద, టీ ట్రంక్‌ఇమ్యూనిటీలు‘చాయ్‌ డైరీస్‌’ పేరుతో తన లైఫ్‌ డైరీని కొత్తగా ఆవిష్కరించింది అమీ భన్సాలీ. న్యూయార్క్‌ బిజినెస్‌ స్కూల్‌లో బిజినెస్‌ కోర్సు చేస్తున్నప్పుడు చాయ్‌ కేఫ్‌ను ప్రారంభించాలనుకుంది అమీ. ‘మేనేజ్‌మెంట్, కస్టమ్స్, షిప్పింగ్, అమ్మకాల డేటా వంటివి... ఇందులో ప్రతిదీ నేర్చుకోవాల్సి వచ్చింది. 2011లో ఇండియాలో 2013లో అమెరికాలో ఎటువంటి బ్యాకప్‌ లేకుండా చాయ్‌ డైరీస్‌ ప్రారంభించాను. కుటుంబం నుంచి, బయటి నుంచి ఎలాంటి పెట్టుబడి సహకారమూ లేదు. అప్పు చేసి మరీ ఈ వ్యాపారంలోకి దిగాను. అనుకున్నది సాధించగలిగాను. ఇప్పుడు మా దగ్గర తులసి గ్రీన్, మోరింగా వంటి రోగనిరోధక శక్తిని పెంచే టీలు కూడా ఉన్నాయి. కోవిడ్‌ టైమ్‌లో పిల్లలకు పాలిచ్చే తల్లుల కోసం ‘మామా’ అనే టీ ని సృష్టించాను. ఆర్గానిక్‌ బాంబే మసాలా టీ లోపాలు, చక్కెర లేకున్నా రుచికరంగా ఉంటుంది. కాక్‌టెయిల్, ఐస్డ్‌ టీ వంటివి సలాడ్‌ డ్రెస్సింగ్‌గా కూడా ఉపయోగించవచ్చు.’– అమీ భన్సాలీ, చాయ్‌ డైరీస్‌ తయారీలో సమయం తెలియదుతండ్రి నుంచి టీ కంపెనీని తీసుకొని, ఆనందిని పేరుతో విజయవంతంగా నడుపుతోంది డార్జిలింగ్‌ వాసి అనామికా సింగ్‌. ‘ఒక కప్పు టీ కోసం ఉదయకాంతితో పాటు పోటీ పడుతూ 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను. 2014లో ‘ఆనందిని’ బ్రాండ్‌ని సృష్టించాను. ఇది కచ్చితంగా పురుషాధిక్య పరిశ్రమ. ప్రతి రంగంలో మహిళ తల చుట్టూ ఒక గాజు సీలింగ్‌ ఉంటుంది. దానిని అధిగమిస్తేనే అనుకున్నది సాధిస్తాం. పారదర్శకంగా ఉండటం, మూలంపై దృష్టిపెట్టడం మా సక్సెస్‌ మంత్ర. టీ మిశ్రమాలకు జోడించే పదార్థాలలో పువ్వులు, సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఉంటాయి. కానీ, కృత్రిమ రుచులు ఉండవు. నాకు ఇష్టమైనవి ఫిర్దౌస్, గోల్డెన్‌ నీడిల్, ఫైన్‌వుడ్‌ స్మోక్డ్‌ టీ లు. కొత్త రుచుల టీ తయారీల కోసం గంటల తరబడి పనిచేస్తాను. సమయం గురించి కూడా ఆలోచించను.’– అనామికా సింగ్, ఆనందిని హిమాలయ టీకచ్చితమైన సమయపాలనలండన్‌లో ఒక గ్లోబల్‌ అడ్వైజరీ సంస్థలో లక్షల్లో జీతం వచ్చే కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి 2016లో ఆసమ్‌ టీ పేరుతో బెంగళూరులో టీ వ్యాపార ప్రారంభించి రాణిస్తోంది మయూర రావు. ‘ఉదయం 5 గంటలకు ముందే నా రోజు ప్రారంభం అవుతుంది. ఒక కప్పు వేడి తేనీటితో మొదలయ్యే ప్రయాణంలో అన్నింటినీ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లడమే. బృందాన్ని సమీక్షించడం, టీ తయారీపై దృష్టి పెట్టడం, ఈ–కామర్స్, డిస్ట్రిబ్యూషన్‌ ప్రతిదీ కీలకమే. మేం మా వృద్ధిని గడిచిన 12 వారాల రన్‌రేట్‌ను పరిశీలించి తెలుసుకుంటాం. ప్రస్తుతం 4 గిడ్డంగులను నిర్వహిస్తున్నాం. ఆర్డర్‌ ప్రకారం ప్రతి కస్టమర్‌కి సకాలంలో డెలివరీ చేస్తాం. కచ్చితమైన సమయపాలన మా విజయానికి పునాది.– మయూర రావు, ఆసమ్‌ టీ (చదవండి:

Business of Agricultural Seeds Cornerstone of Global Food Security8
మెరుగైన విత్తనాలతో రైతేరాజు.. కానీ..

విత్తనాలు వ్యవసాయ పరిశ్రమకు కీలకం. ఆహార ఉత్పత్తి, సుస్థిరత, వాణిజ్య లాభదాయకతలో ఇవి ప్రధానపాత్ర పోషిస్తాయి. విత్తన ఉత్పత్తి రంగంలో నిత్యం విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు అతీతంగా బయోటెక్ ఆవిష్కరణలు, స్థిరమైన పద్ధతుల ద్వారా వీటిని ఉత్పత్తి చేసి రైతన్నలకు అధిక దిగుబడులు ఇవ్వాలని శాస్త్రవేత్తలు, కంపెనీలు, ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహార డిమాండ్ పెరగడంతో విత్తన పరిశ్రమలో పెట్టుబడులు, పరిశోధనలు, మార్కెట్ పోటీ పెరుగుతోంది.మార్కెట్ ఇలా..అధిక దిగుబడి, వాతావరణ మార్పులు, పంటలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2030 నాటికి ప్రపంచ వ్యవసాయ విత్తన మార్కెట్ 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. బేయర్ క్రాప్‌ సైన్స్‌, సింజెంటా, కోర్టెవా అగ్రిసైన్స్, యూపీఎల్‌.. వంటి ప్రధాన సంస్థలు ఈ పరిశ్రమలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే సేంద్రీయ, స్వదేశీ విత్తనాల ఉత్పత్తులపై అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లు దృష్టి సారిస్తున్నాయి.వ్యాపార ధోరణులుబయోటెక్, జీఎం విత్తనాలు: జన్యుమార్పిడి (జెనటికల్లీ మాడిఫైడ్‌-జీఎం) విత్తనాలను తెగుళ్లు, కరువు, వ్యాధులను తట్టుకేనేందుకు ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి దిగుబడిని మెరుగుపరుస్తాయని కంపెనీలు చెబుతున్నాయి. వీటి నియంత్రణ, వినియోగదారుల ప్రాధాన్యతల చుట్టూ వివాదాలు ఉన్నప్పటికీ జన్యుమార్పిడి విత్తనాలు ఏటా బిలియన్ల ఆదాయాన్ని సృష్టిస్తూనే ఉన్నాయి.హైబ్రిడ్ విత్తనాలు: అధిక ఉత్పాదకత కోసం రూపొందించిన హైబ్రిడ్ విత్తనాలను వ్యవసాయంలో విరివిగా వాడుతున్నారు. ఇవి రైతుల ఆదాయాన్ని పెంచుతున్నాయి.సేంద్రీయ, సుస్థిర విత్తనాలు: సుస్థిర వ్యవసాయం పెరగడంతో సేంద్రీయ విత్తనాలు ప్రజాదరణ పొందుతున్నాయి. పర్యావరణ స్పృహ కలిగిన వినియోగదారులను, నియంత్రణ సంస్థలను ఇవి ఆకర్షిస్తున్నాయి.శీతోష్ణస్థితిని తట్టుకునే విత్తనాలు: వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో కీలకమైన వేడిని, వరదలను తట్టుకునే రకాలను అభివృద్ధి చేయడానికి కంపెనీలు పరిశోధనలో పెట్టుబడులు పెడుతున్నాయి.ఈ-కామర్స్, డైరెక్ట్-టు-ఫార్మర్ సేల్స్: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రైతులు నేరుగా ఉత్పత్తిదారుల నుంచి అధిక నాణ్యత విత్తనాలను పొందడానికి వీలు కలుగుతుంది. మధ్యవర్తులపై ఆధారపడటాన్ని ఈ ప్లాట్‌ఫామ్‌లు తగ్గిస్తున్నాయి.పెట్టుబడి, లాభదాయకతవిత్తన కంపెనీలు ప్రత్యేక జన్యు పరీక్షలపై పేటెంట్లను పొందుతున్నాయి. దీని ద్వారా మేధో సంపత్తి హక్కులను అందిపుచ్చుకుంటూ దీర్ఘకాలిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. అదనంగా ప్రభుత్వ సబ్సిడీలు, పరిశోధన గ్రాంట్లు, కార్పొరేట్ భాగస్వామ్యాల ద్వారా కంపెనీలు వాటి మార్కెట్‌ను పెంచుకుంటున్నాయి. వ్యవసాయ వృద్ధిని అందిపుచ్చుకోవాలని చూస్తున్న ఇన్వెస్టర్లు కృత్రిమ మేధ ఆధారిత బ్రీడింగ్ పద్ధతుల్లో నైపుణ్యం కలిగిన విత్తన ఉత్పత్తి స్టార్టప్‌లపై ఆసక్తి చూపుతున్నాయి. భారత విత్తన మార్కెట్ 2025 నాటికి 3.82 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. 2030 నాటికి ఇది 5.01 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. 2022లో మొత్తం సాగు విస్తీర్ణంలో హైబ్రిడ్ విత్తనాలు 80.6%గా ఉన్నాయి.సవాళ్లురెగ్యులేటరీ ఆంక్షలు: జన్యుమార్పిడి విత్తనాల ఆమోదానికి సంబంధించి నియమాలు దేశాన్ని బట్టి మారుతాయి. ఇది ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుంది.అధిక పరిశోధన ఖర్చులు: కొత్త విత్తన వంగడాలను అభివృద్ధి చేయడానికి విస్తృతమైన పరిశోధన అవసరం అవుతుంది. ఇది విత్తన ఉత్పత్తి ఖర్చులను పెంచుతుంది.సరసమైన ధరలు: నాణ్యమైన విత్తనాలను చిన్న, సన్నకారు రైతులకు సరసమైన ధరలకు అందేలా చూడటం సవాలుగా మారుతుంది. దీనికితోడు బ్లాక్‌లో విత్తనాలు విక్రయించే మాఫియా ప్రభుత్వ యంత్రాంగానికి సవాలుగా మారుతుంది.ఇదీ చదవండి: దానశీలురు ఈ కార్పొరేట్లువ్యవసాయ విత్తనాలను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించకుండా నిరోధించడానికి ప్రభుత్వ యంత్రాంగం, సాంకేతిక పరిష్కారాలు, రైతుల్లో అవగాహన కల్పిచడం కీలకం. విత్తన కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లకు కచ్చితమైన సర్టిఫికేషన్ ప్రమాణాలు ఉండేలా చూడాలి. నకిలీ విత్తన విక్రయాలకు కఠిన శిక్షలు అమలు చేయాలి. విత్తన ధ్రువీకరణకు క్యూఆర్‌ కోడ్‌లు, ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లను ఉపయోగించాలి. తక్కువ దిగుబడులు, తెగుళ్ల బెడద, చట్టపరమైన సమస్యలు వంటి బ్లాక్ మార్కెట్ విత్తనాల వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించాలి.

Actor Ajith Tribute To Ayrton Senna In Italy9
అతని కాలి బూట్లకు ముద్దు పెట్టిన హీరో అజిత్‌.. వీడియో వైరల్‌

సినిమా హీరోలను దేవుడిలా అభిమానులు పూజిస్తారు. మరి ఆ హీరోలే మరోకరిని తమ జీవితానికి ఆదర్శంగా తీసుకుంటే అతనెంత గొప్పవాడై ఉంటాడో అని ఆలోచిస్తాం. సరిగ్గా అలాంటి సన్నివేశమే కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ లైఫ్‌లో ఒకటి ఉంది. అజిత్‌ తాజాగా తన అభిమాన కార్‌ రేసర్‌కు నివాళులు అర్పించారు. ఆయనపై తన అభిమానం ఏపాటిదో వీడియోతో చూపాడు. దానిని చూసిన అజిత్‌ ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.అజిత్‌ తాజాగా ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్‌ అయర్టన్ సెన్నాకు నివాళులర్పించారు. ఇటలీ పార్క్‌లో ఉన్న ఆయన విగ్రహం పాదాలకు ముద్దు పెట్టి తన అభిమానం ఎలాంటిదో చూపాడు. అయర్టన్ సెన్నా విగ్రహాన్ని కొంత సమయం పాటు అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో ఆయన చాలా ఎమోషనల్‌ అయ్యాడు. బ్రెజిల్‌ దేశానికి చెందిన అయర్టన్ సెన్నా మూడు సార్లు(1988,1990,1991) ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్‌గా గెలిచి రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. వరుసగా మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్‌ సెట్‌ చేశాడు. 1994 కార్‌ రేసింగ్‌లో జరిగిన ప్రమాదంలో ఆయన మరణించారు.అజిత్‌ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ప్రొఫెషనల్‌ రేసర్‌గానూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. షూటింగ్స్‌లకు కాస్త విరామం దొరికితే చాలు రేసింగ్‌ బైక్స్‌, కార్లలో చక్కర్లు కొడుతుంటారు. అంతర్జాతీయ కార్‌ రేసింగ్‌లలో కూడా ఆయన పాల్గొని సత్తా చాటారు. ఆపై తన రేసింగ్‌ టీమ్‌ను కూడా కొద్దిరోజుల క్రితమే ఆయన ప్రకటించారు. ‘అజిత్‌ కుమార్ రేసింగ్‌’ పేరుతో టీమ్‌ను ఏర్పాటు చేశారు. View this post on Instagram A post shared by Ajith Kumar Racing Team (@ajithkumarracing)

57 Percent of Indian Districts Face High to Very High Heat Risk: CEEW10
ఉరుముతున్న ఉష్ణోగ్రతలు

శిలాజ ఇంధనాల వాడకం నానాటికీ పెరిగిపోతుండడం, తద్వారా వాతావరణ మార్పులు సంభవిస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భారత్‌ సైతం ఇందుకు మినహాయింపు కాదు. దేశంలో 57 శాతం జిల్లాలు అధికం నుంచి అత్యధిక హీట్‌ రిస్క్‌ కేటగిరీలో ఉన్నట్లు ఢిల్లీకి చెందిన వాతావరణ సంస్థ కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌(సీఈఈడబ్ల్యూ) వెల్లడించింది. దేశంలోని మొత్తం జనాభాలో ఏకంగా 76 శాతం మంది ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతల ముప్పును ఎదుర్కొంటున్నట్లు తేల్చిచెప్పింది.ఈ మేరకు మంగళవారం ఒక నివేదిక విడుదల చేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, గోవా, కేరళ, గుజరాత్, రాజస్తాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ సహా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో హీట్‌ రిస్క్‌ అత్యధికంగా ఉన్నట్లు తెలియజేసింది. గత పదేళ్లలో అత్యధిక వేడి కలిగిన పగటి దినాల కంటే అత్యధిక వేడి కలిగిన రాత్రి దినాల సంఖ్య వేగంగా పెరిగినట్లు వివరించింది. ⇒ అధ్యయనంలో భాగంగా సీఈఈడబ్ల్యూ సంస్థ 734 జిల్లాలకు సంబంధించిన హీట్‌ రిస్క్‌ ఇండెక్స్‌(హెచ్‌ఆర్‌ఐ)ను అభివృద్ధి చేసింది. ఇందుకోసం 1982 నుంచి 2022 వరకు.. 40 ఏళ్ల వాతావరణ గణాంకాలు, ఉపగ్రహా చిత్రాలు ఉపయోగించుకుంది. ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులు, జల వనరులు, భూవినియోగం, పచ్చదనం తదితర అంశాలను అధ్యయనం చేసింది. ⇒ జనాభా, భవనాలు, ఆరోగ్య, సామాజిక–ఆర్థిక అంశాలు, పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు, వాతావరణంలో తేమ వంటి అంశాలను సైతం పరిగణనలోకి తీసుకుంది. ⇒ 734 జిల్లాలకు గాను 417 జిల్లాలు హై నుంచి వెరీ హై రిస్క్‌ కేటగిరీల్లో ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ఇందులో 151 జిల్లా హై రిస్క్, 266 జిల్లాలు వెరీ హై రిస్క్‌ విభాగంలో ఉన్నాయి. 201 జిల్లాలు సాధారణ, 166 జిల్లాలు తక్కువ లేదా అతి తక్కువ హీట్‌ రిస్క్‌ విభాగాల్లో నిలిచాయి. ⇒ ఉష్ణోగ్రతలు సాధారణం లేదా తక్కువగా ఉన్నట్లయితే దాని అర్థం వేడి వల్ల ముప్పు లేనట్లు కాదని, సీఈఈడబ్ల్యూ స్పష్టంచేసింది. ఇతర జిల్లాల కంటే కొంత తక్కువగా ఉన్నట్లు మాత్రమే భావించాలని పేర్కొంది. ⇒ దేశంలో అధిక ఉష్ణోగ్రత కలిగిన రోజులు పెరుగుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన రోజులు అంతకంటే ఎక్కువగా పెరుగుతుండడం గమనార్హం. అంటే మనుషులకు ముప్పు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నట్లే లెక్క. ⇒ ఉష్ణోగ్రతలు అత్యధికంగా మనుషులు తట్టుకోలేరు. అది ప్రమాదకరమే. శారీరకంగా, మానసికంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పల్లెలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో అధిక ఉష్ణోగ్రత కలిగిన రాత్రి దినాలు అధికంగా నమోదవుతున్నాయి. అర్బన్‌ హీట్‌ ఐలాండ్‌ ఎఫెక్టే ఇందుకు కారణం. ⇒ 10 లక్షలకుపైగా జనాభా ఉన్న జిల్లాలతోపాటు ముంబయి, బెంగళూరు, భోపాల్, జైపూర్, ఢిల్లీ, చెన్నై వంటి నగరాల్లో అధిక ఉష్ణోగ్రత కలిగిన రాత్రి దినాల సంఖ్య భారీగా పెరిగింది. ⇒ చల్లగా ఉండే హిమాలయా ప్రాంతాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన పగటి, రాత్రి రోజుల సంఖ్య పెరుగుతోంది. సున్నితంగా ఉండే పర్వత ప్రాంత భౌగోళిక స్థితిగతులను ఈ పరిణామం తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ⇒ జమ్మూకశీ్మర్, లద్దాఖ్‌లో అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన పగటి, రాత్రి రోజుల సంఖ్య 15 చొప్పున పెరిగింది. ఈ ప్రతి ఏటా వేసవిలో ఈ పెరుగుదల కనిపిస్తోంది. ⇒ ఉత్తర భారతదేశంలో వేసవి తేమ గత పదేళ్లలో 30–40 శాతం నుంచి 40–50 శాతం పెరిగింది. ⇒ అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా 2030 నాటికి 3.5 కోట్ల ఉద్యోగాలను కోల్పోతామని, జీడీపీలో 4.5 శాత తగ్గుదల నమోదవుతుందని సీఈఈడబ్ల్యూ అధ్యయనం అంచనా వేసింది. ⇒ ఇండియాలో 2024లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా 45,000కుపైగా గుండెపోటు కేసులు నమోదయ్యాయి. 159 మరణాలు సంభవించాయి. ఇవన్నీ అధికారికంగా నమోదైన గణాంకాలే. నమోదు కానివి ఇంకెన్నో ఉంటాయి. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement