Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

India Slams Chinese State Media Over Op Sindoor1
అక్కడ జరిగిందేమిటి?.. మీరు చేస్తున్నదేమిటి?

న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకుల్ని ప్రాణాలు పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల వేరివేత లక్ష్యంగా భారత్ ‘ ఆపరేషన్ సిందూర్’ నిర్వహించింది. పాక్ లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసిన భారత్.. 90 మంది వరకూ టెర్రర్ మూకలను మట్టుబెట్టింది. అయితే భారత్ విజయవంతంగా పూర్తి చేసిన ఆపరేషన్ సిందూర్ పై చైనా మీడియా విషం కక్కింది. చైనాలోని గ్గోబల్ టైమ్స్’ అనే మీడియా సంస్థ ఆపరేషన్ సిందూర్ భారత్ విమానాలను పాక్ కూల్చిందంటూ తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది. కొన్ని పాత ఫోటోలను జత చేసి వాటిని ప్రస్తుత ఆపరేషన్ సిందూర్ కు ఆపాదించింది. దీనిపై చైనాలోని భారత్ ఎంబాసీ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. అక్కడ జరిగింది ఏమిటి.. మీరు చేస్తున్నదేమిటి అంటూ మండిపడింది ఒక విషయాన్ని వార్త రూపంలో ప్రచురించేటప్పుడు వాస్తవాలను తెలుసుకోవాలని, దానికి మూలాలను అన్వేషించి వార్తలు వేయాలని గ్లోబల్ టైమ్స్ కు చురకలంటించింది. అక్కడా ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసి విజయవంతంగా దాన్ని పూర్తి చేస్తే మీరు దాన్ని వక్రీకరించడం తగదంటూ హితవు పలికింది. కాగా, ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ దాయాది పాకిస్థాన్‌కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం. జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో 10 మంది మసూద్‌ కుటుంబసభ్యులు హతమయ్యారు.

CM Revanth says Holidays cancelled for emergency services employees2
అత్యవసర సేవల ఉద్యోగుల 'సెలవులు రద్దు'

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అత్యవసర సేవలు అందించే అన్ని విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుని హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించింది. పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం అర్ధరాత్రి భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ)లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల నేపథ్యంలో మనమంతా సైన్యంతో ఉన్నామనే సందేశం ఇవ్వాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ సమయంలో రాజకీయాలకు, పార్టీలకు తావు లేదని అన్నారు. మీడియా, సోషల్‌ మీడియాలో ప్రభుత్వ ఉద్యోగులు అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. ప్రజల కోసం 24/7 టోల్‌ ఫ్రీ నంబర్‌ ‘సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా టోల్‌ ఫ్రీ నంబర్‌ వెంటనే ఏర్పాటు చేయాలి. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. మూడు కమిషనరేట్లకు సంబంధించిన సీసీటీవీలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ వంటి దేశాల నుంచి వచ్చి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలి. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలి. రక్తం, ఆహారం నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలి బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందుకోసం రెడ్‌ క్రాస్‌తో సమన్వయం చేసుకోవాలి. అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల అందుబాటుపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలి. ఆహార నిల్వలు కూడా తగినంత ఉండేలా చూడాలి. సైబర్‌ దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. ఫేక్‌ న్యూస్‌ ప్రచా రం చేసే వారిపై ఉక్కు పాదం మోపాలి. ఫేక్‌ న్యూస్‌ వల్ల ప్రజల్లో ఆందోళన మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని అరికట్టడానికి ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలి. కీలక ప్రాంతాల్లో భద్రత పెంచాలి అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భద్రత పెంచాలి. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, అన్ని విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ సంస్థల దగ్గర కూడా భద్రత పెంచాలి. నగరంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే పీస్‌ కమిటీలతో మాట్లాడాలి. హిస్టరీ షీటర్లు, పాత నేరస్తుల విషయంలో పోలీస్‌ విభాగం అప్రమత్తంగా ఉండాలి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. విదేశీ పర్యాటకులకు రక్షణ కల్పించండి హైదరాబాద్‌లోని ఆర్మీ, నేవీ, వైమానిక కార్యాలయాలు, రక్షణ రంగ సంస్థల దగ్గర భద్రతాపరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసులను ఆదేశించారు. నగరంలో మాక్‌ డ్రిల్‌ అనంతర పరిస్థితులపై అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని చెప్పారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలని చెప్పారు. కేంద్ర నిఘా బృందాలతో , రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. చంపినా చూస్తూ ఊరుకుంటే ఎలా..? ఐసీసీసీ వద్ద ఎండలో నిలబడిన మీడియాను చూసిన రేవంత్‌రెడ్డి తన వాహనం ఆపి వారితో ముచ్చటించారు. ‘భారత రక్షణ రంగంలో హైదరాబాద్‌ అత్యంత కీలక ప్రాంతం. అన్ని విభాగాలను అప్రమత్తం చేశాం. దేశంలోకి వచ్చి చంపుతుంటే చూస్తూ ఊరుకుంటే ఎలా? ’అని వ్యాఖ్యానించారు.సైన్యానికి సెల్యూట్‌: సీఎం రేవంత్‌ ఆపరేషన్‌ సిందూర్‌లో భారత సాయుధ దళాలు సాధించిన విజయంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మన సైన్యం దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. ‘ఒక భారతీయ పౌరుడిగా, నేను ముందుగా మన సాయుధ దళాలకు బలమైన అండగా నిలుస్తున్నా. ఉగ్రవాద నిర్మూలన దిశగా భారత సైన్యం చేపట్టిన ఈ ధైర్యవంతమైన చర్య దేశ భద్రతకు నిదర్శనం. ఈ దాడులు మన సైన్యం సామర్థ్యం, ధైర్యాన్ని ప్రపంచానికి స్పష్టంగా చాటాయి. మనమంతా ఒకే గొంతుకై, ఒకే స్వరంతో ప్రకటిద్దాం.. జై హింద్‌..’అని సీఎం తన ‘ఎక్స్‌’ఖాతాలో పోస్టు చేశారు. నేడు సంఘీభావ ర్యాలీ భారత సైన్యానికి సంఘీభావంగా హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం నుంచి నెక్లెస్‌ రోడ్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర నేతలు పాల్గొననున్నారు.

IPL 2025: CSK Beat KKR By 2 Wickets3
IPL 2025: బ్రెవిస్‌ విధ్వంసం​.. కేకేఆర్‌పై సీఎస్‌కే విజయం

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (మే 7) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్‌కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నూర్‌ అహ్మద్‌ 4 వికెట్లు తీసి కేకేఆర్‌ను దెబ్బేశాడు. అన్షుల్‌ కంబోజ్‌, జడేజా తలో వికెట్‌ తీశారు. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో రహానే (48), మనీశ్‌ పాండే (36 నాటౌట్‌), రసెల్‌ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్‌కే 60 పరుగులకే సగం​ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (52) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో తన జట్టును తిరిగి గెలుపు ట్రాక్‌లో పెట్టాడు. మధ్యలో దూబే (45) బాధ్యతాయుతంగా ఆడి సీఎస్‌కే విజయతీరాలవైపు మళ్లించాడు. ఆఖరి ఓవర్‌లో 8 పరుగులు అవసరమైన తరుణంలో అప్పటిదాకా కామ్‌గా ఉన్న ధోని (17 నాటౌట్‌) సిక్సర్‌ కొట్టి సీఎస్‌కేకు గెలుపుకు చేరువ చేశాడు. నాలుగో బంతికి కంబోజ్‌ బౌండరీ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఈ గెలుపు వల్ల సీఎస్‌కేకు ఒరిగేది ఏమీ లేనప్పటికీ కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను దెబ్బకొట్టింది. బ్రెవిస్‌ విధ్వంసం​.. ఒకే ఓవర్‌లో 30 పరుగులువైభవ్‌ అరోరా వేసిన 11వ ఓవర్‌లో డెవాల్డ్‌ బ్రెవిస్‌ శివాలెత్తిపోయాడు. 3 ఫోర్లు, 3 సిక్సర్లు సహా 30 పిండుకున్నాడు. ఈ ఒక్క ఓవర్‌తో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు ఓటమి ఖాయమనుకున్న సీఎస్‌కే ఒక్కసారిగా గెలుపు ట్రాక్‌లోకి వచ్చింది.బ్రెవిస్‌ 20 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు.

Sakshi Editorial On India Actions On Pak Terrorism Operation Sindoor4
అదనుచూసి పదునైన పాఠం!

తీరికూర్చుని భారత్‌తో పెట్టుకుంటే ఏమవుతుందో జగడాలమారి పాకిస్తాన్‌కూ, దాని కీలుబొమ్మలైన ఉగ్రమూకలకూ తెలిసొచ్చి ఉండాలి. 2016 నాటి ‘ఉరి’ సర్జికల్‌ దాడులు, 2019 నాటి బాలాకోట్‌ వైమానిక దాడులకు అనేక రెట్లు అధికంగా మంగళవారం అర్ధరాత్రి దాటాక ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సంకేతనామంతో మన త్రివిధ దళాలు పకడ్బందీ సమన్వయంతో పాకిస్తాన్‌లోనూ, ఆక్రమిత కశ్మీర్‌ లోనూ తొమ్మిది చోట్ల గంటసేపు సాగించిన క్షిపణి దాడులు పాక్‌ సైన్యాన్నీ, ఉగ్రమూకల్నీ గుక్క తిప్పుకోనీయకుండా చేశాయి. ఉగ్రవాదుల శిక్షణ కేంద్రాలూ, వారి ఆయుధ గిడ్డంగులూ, ఇతరేతర అవసరాలకు వినియోగిస్తున్న బహుళ అంతస్తుల భవంతులూ లక్ష్యంగా మొత్తం 24 చోట్ల సాగించిన దాడుల్లో 70 మంది వరకూ ఉగ్రవాదులు మరణించగా, మరో 60 మంది గాయపడ్డారని చెబు తున్నారు. ఉగ్రవాద ముఠాలైన జైషే మొహమ్మద్‌ (జేఈఎం), లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) ప్రధాన కార్యాలయాలు రెండూ కుప్పకూలాయని సమాచారం. జేఈఎం చీఫ్‌ మసూర్‌ అజర్‌ సోదరితోసహా అతగాడి కుటుంబానికి చెందిన పదిమంది హతమయ్యారని కూడా చెబుతున్నారు. జరిగిన నష్టాన్ని కప్పెట్టే ఎత్తుగడతో అయిదు భారత్‌ విమానాలను కూల్చామంటూ పాక్‌ స్వోత్కర్షలకు పోతోంది. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి పాక్‌ లోలోపలివరకూ చొచ్చుకెళ్లి దాడులు సాగించిన తీరూ, ఒక్క క్షిపణి కూడా గురితప్పకుండా శత్రుమూకలపై చండ్రనిప్పులు కురిపించిన విధానం మన త్రివిధ దళాల పకడ్బందీ అంచనాలకూ, పదునైన వ్యూహచతురతకూ దర్పణాలు. పాక్‌ గడ్డపై గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఉగ్రశిబిరాల ఆనుపానుల్ని శత్రునేత్రానికి చిక్కని విధంగా గత పక్షం రోజులుగా మానవ రహిత విమానాలతో జల్లెడపట్టాకే ఈ దాడులు జరిగాయి. పహల్‌గామ్‌ సమీపంలో అకారణంగా, అన్యాయంగా నిరాయుధ భారత పౌరులను గురిచూసి కాల్చిచంపటానికి కిరాయిమూకల్ని పంపి కొన్నిరోజులుగా పాకిస్తాన్‌ మురుస్తోంది. దీనిపై నిలదీస్తే షరా మామూ లుగా సాక్ష్యాలడుగుతోంది. గత నెల 22న పహల్‌గామ్‌ సమీపంలో ఉగ్రవాద ముఠా 26 మందిని పొట్టనబెట్టుకున్నప్పటి నుంచీ భారత ప్రజ ప్రతీకారంతో రగిలిపోతోంది. కంటికి కన్ను సిద్ధాంతం పాటించి గట్టి దెబ్బతీయాల్సిందేనన్న అభిప్రాయం అలుముకుంది. ఈ నేపథ్యంలో మన దళాల దాడులు విజయవంతం కావటం అందరినీ సాంత్వన పరుస్తుందనటంలో సందేహం లేదు.అనుకోని పరిణామాలు తలెత్తితే అనుసరించాల్సిన పద్ధతులపై పౌరులకు అవగాహన కల్పించటానికి బుధవారం మాక్‌ డ్రిల్‌ జరగటం, అంతకుముందు రోజు రాత్రే మన త్రివిధ దళాలు దాడులు చేయటం గమనిస్తే వర్తమానం ఎంత జటిలంగా ఉన్నదో అర్థమవుతుంది. ఇది మనం కోరుకున్నది కాదు. మన ప్రమేయం లేకుండా వచ్చిపడిన విపత్తు. అకారణంగా మనపై రుద్దిన సంక్లిష్ట సమస్య. దీనికి దీటుగా స్పందించకపోతే ఉగ్రదాడులకు అంతూ పొంతూ ఉండదు. కనుకనే పహల్‌గామ్‌ మారణకాండ గురించి తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ పర్యటనను రద్దుచేసుకుని వెను దిరిగారు. ఆ వెంటనే మంత్రివర్గ సహచరులతో, త్రివిధ దళాల అధిపతులతో వరస సమాలోచనలు సాగించారు. ఎప్పుడు, ఎక్కడ ఎలా దాడులు సాగించాలో, తీవ్రత ఏ స్థాయిలో వుండాలో మీరే నిర్ణ యించండంటూ మన దళాలకు అధికారం ఇచ్చారు. పర్యవసానంగానే పాక్‌ ప్రాపకంతో చెలరేగి పోతున్న ఉగ్రముఠాలకు గట్టి సమాధానం వెళ్లింది. ఈ దాడులకు చాలాముందే ఇతరేతర నిర్ణ యాలు తీసుకున్నారు. సింధూ నదీజలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించ టంతోపాటు ఇండియా పలు చర్యలు తీసుకుంది. దీన్నంతటినీ గమనిస్తున్నవారికి మన దేశం సైనిక చర్యకు కూడా వెనకాడబోదని పక్షం రోజుల క్రితమే అర్థమైంది. యుద్ధం దేనికీ పరిష్కారం కాకపోవచ్చు. చర్చలే అంతిమంగా ఎంతటి జటిల సమస్యనైనా పరిష్కరిస్తాయన్న సిద్ధాంతం కూడా సరైనదే కావొచ్చు. కానీ పొరుగు పచ్చగావుంటే ఓర్వలేక నిష్కారణంగా దాడులకు దిగే నైజాన్ని శాంతిప్రవచనాలతో ఎదుర్కొనటం సాధ్యమేనా? ఒకపక్క పహల్‌గామ్‌ దాడులతో సంబంధం లేదంటూనే గత కొన్ని రోజులుగా అధీనరేఖ వద్దా, అంత ర్జాతీయ సరిహద్దు వద్దా పాక్‌ ఎలాంటి కవ్వింపూ లేకుండా కాల్పులకు దిగుతోంది. ఈ దాడుల కారణంగా ఒక్క బుధవారంనాడే పూంఛ్‌ జిల్లా గ్రామాల్లో 12 మంది పౌరులు బలయ్యారు. తన దుష్ట పన్నాగాలను కప్పిపుచ్చటానికి భద్రతామండలిలో పాకిస్తాన్‌ అమాయకత్వం నటిస్తూ భారత్‌ తీసు కుంటున్న వరస చర్యలకు వ్యతిరేకంగా తీర్మానం చేయించాలని విఫలయత్నం చేసింది. రేపో మాపో అది నేరుగా సైన్యాన్ని రంగంలోకి దించి ప్రతీకారం పేరిట చెలరేగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఉగ్రముఠాల ద్వారా మారణహోమానికి పాల్పడటం కన్నా ఒకరకంగా ఇది మంచిదే. భారత్‌ బెదిరిపోయి సైనిక దాడుల ఆలోచన మానుకుంటుందన్న తప్పుడు ఆలోచనతో కొన్ని రోజులుగా అది అణుబాంబు బెదిరింపులకు కూడా తెగించింది. ఆ దుస్సాహసానికి పూనుకుంటే చేజేతులా స్వీయవినాశనాన్ని కొనితెచ్చుకున్నానని పాక్‌ పశ్చాత్తాపపడే రోజు ఎంతో దూరంలో ఉండదు. ఈ కష్టకాలంలో దేశ ప్రజానీకం కుల మత భేదాలు మరిచి కలిసికట్టుగా ఉండటం అత్య వసరం. ఇదే అదనుగా నాలుగు ఓట్ల కోసమో, మరికొన్ని సీట్ల కోసమో ప్రజల్లో వైషమ్యాలు సృష్టించాలని చూసే అవాంఛనీయ శక్తుల్ని అందరూ సకాలంలో పోల్చుకుని దూరం పెట్టడం, తగిన బుద్ధి చెప్పటం ఎంతో అవసరం. మనలోని సమష్టితత్వమే ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనే ధైర్యాన్ని స్తుంది. విజయాన్ని మన చేతికందిస్తుంది.

Sakshi Guest Column On Operation Sindoor5
గతానికి భిన్నంగా...

ఏప్రిల్‌ నెల చివరలో జమ్మూ–కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో 26 మంది నిరాయుధులను దారుణంగా హత్య చేసినందుకు ప్రతీకారంగా, మే 7 ఉదయం పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్న తొమ్మిది ప్రదేశాలపై భారత సైన్యం దాడి చేసింది. పహల్‌గామ్‌ ఘాతుక చర్యకు సమాధానం ఇచ్చి తీరుతామని దేశ రాజకీయ నాయకత్వం స్పష్టం చేయడంతో సైనిక దాడి తప్పదని తేలిపోయింది. అయితే, పాక్‌ ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి జరగడం ఇదే మొదటి సారి కాదు, కానీ సరిహద్దు రేఖలు మారుతున్నాయని సూచించే లక్షణాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో ఉన్నాయి.సరిహద్దును దాటి...పాకిస్తాన్‌లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై చివరి ప్రధాన దాడి 2019 ఫిబ్రవరిలో చోటు చేసు కుంది. ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బాలాకోట్‌ను అప్పుడు భారత వైమానిక దళం లక్ష్యంగా చేసుకుంది. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌ కేంద్ర బిందువైన పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ప్రదేశాలపై భారతీయ సైన్యం దాడికి దిగింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్‌ సైన్యం లొంగిపోయిన తర్వాత,భారత వాయుసేన నియంత్రణ రేఖను దాటడం ఇదే మొదటిసారి. దక్షిణ పంజాబ్‌లోని బహావల్‌పూర్‌లో జైష్‌–ఎ–మొహమ్మద్‌ ప్రధాన కార్యాలయం ఉంది. పంజాబ్‌లోని మరొక ప్రదేశం మురీద్‌కే! ఇక్కడ లష్కరే తోయిబా చాలా కాలంగా ఉనికిలో ఉంది. అయితే కశ్మీర్‌లో వాస్తవ సరిహద్దును గుర్తించే ఎల్‌ఓసీకీ, పాకిస్తానీ పంజాబ్‌కు మధ్య వ్యత్యాసం ఏమిటంటే, స్థిరపడిన అంతర్జాతీయ సరిహద్దు. సూటిగా చెప్పాలంటే, ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులకు చెందిన భౌగోళిక ప్రాంతం ఇప్పుడు విస్తరించింది. ప్రతీకారం తీర్చుకునే విషయంలో పాకిస్తాన్‌లోని ఏ ప్రదేశం కూడా భారత్‌ లక్ష్యాలకు దూరంగా లేదని తాజా దాడులు స్పష్టంగా సందేశమిస్తున్నాయి.1971 నాటి యుద్ధంలోని ముఖ్యాంశాలలో ఒకటి, భారత సైన్యంలోని త్రివిధ బలగాలూ పాల్గొనడమే! నాటి యుద్ధంలో పూర్తి విజయం సాధించడానికి త్రివిధ దళాలు కలిసి పనిచేశాయి. ఆపరేషన్‌ సిందూర్‌లో కూడా మూడు దళాలూ పాల్గొన్నాయని ప్రభుత్వం తెలిపింది. వనరులను అత్యంత సమర్థంగా ఉపయోగించుకోవడానికి సైన్యం దీర్ఘకాలిక లక్ష్యంగా ఉన్న ఇంటిగ్రేటెడ్‌ థియేటర్‌ కమాండ్లకు ఇది శుభ సూచకం.నిజానికి భారతదేశం నుండి ప్రతిస్పందన అని వార్యం అయింది. అయినా భారీ స్థాయి దళాల కదలికల ద్వారా భారత్‌ ప్రతిస్పందన ఉంటుందని చెప్పే సూచన లేవీ లేవు. పాకిస్తాన్‌ వైపు మాత్రం వారు ప్రతిస్పందన కోసం సిద్ధమవుతున్నప్పుడు గణనీయ స్థాయిలో దళాల కదలిక కనిపించింది. అదే సమయంలో భారత్‌ సంయమన మార్గాన్ని ఎంచుకుంది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో జరిగిన దాడుల్లో ఏవీ పాకిస్తాన్‌ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. ఈ దాడిని ఉగ్రవాద మౌలిక సదుపాయాల నిర్మూలనకే పరిమితం చేశారు. దాడుల తర్వాత కూడా ప్రభుత్వం తన మీడియా ప్రకటనలో భారతదేశం తీవ్ర స్థాయి యుద్ధంలోకి వెళ్లకుండా ఉండాలనుకుంటున్నట్లు స్పష్టంగా సూచించింది.ప్రతిదాడి చేయడానికి ముందు, భారతదేశం తాను అనుకున్న విధంగా ప్రతీకారం తీర్చుకోవడానికి గణనీయమైన స్థాయిలో అంతర్జాతీయ మద్దతును సాధించింది. చైనా మాత్రమే దీనికి మినహాయింపు. అదే సమయంలో, అంతర్జాతీయ ప్రధాన శక్తులు వాణిజ్య యుద్ధంతో పాటుగా పశ్చిమాసియాలో, ఉక్రెయిన్‌లో దీర్ఘకాలిక సంఘర్షణ సవాలును ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఇరుదేశాల మధ్య ఘర్షణలు ఒక స్థాయికి మించి పెరగకూడదని అవి ఆశిస్తున్నాయి.వికసిత భారత్, రుణ సంక్షోభ పాక్‌భారతదేశం మూడు దశాబ్దాలకు పైగా జమ్మూకశ్మీర్లో పాకిస్తాన్‌ ప్రాయోజిత ఉగ్రవాదంతో పోరాడు తోంది. ఈ క్రమంలో రెండు దేశాలలోనూ, వేర్వేరు ఆర్థిక పథాల్లో అభివృద్ధి జరుగుతోంది. భారత్‌ తన ఆర్థిక సరళీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన 1991 నాటికి, పాకిస్తాన్‌ తలసరి జీడీపీ భారత్‌ కంటే ఎక్కువగా ఉంది. తాజాగా ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం, 2023లో పాకిస్తాన్‌ తలసరి జీడీపీ 1,365 డాలర్లు కాగా, భారత్‌ జీడీపీ 82 శాతం ఎక్కువగా 2,481 డాలర్ల వద్ద ఉంది. అంటే రెండు దేశాల ఆర్థిక పథాలు వాటి వ్యూహాత్మక ఎంపికలను ప్రభావితం చేశాయి.భారత్‌ ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉంది. ‘బ్రెగ్జిట్‌’ తర్వాత అది బ్రిటన్‌తో చేసుకున్న అత్యంత ముఖ్యమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఇటీవలే ముగించింది. మరోవైపు, పాకిస్తాన్‌ ఒక రుణ సంక్షోభం నుండి మరొక రుణ సంక్షోభానికి గురవుతూ, ఐఎమ్‌ఎఫ్‌ ఆపన్న హస్తం కోసం విజ్ఞప్తి చేస్తోంది. అది దాదాపు చైనా కాలనీగా మారింది. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఎంచుకున్న ఎంపికలనూ, పాకిస్తాన్‌ ఎదుర్కొంటున్న సార్వభౌమాధికారపు నిరంతర బలహీనతనూ పరిశీలించడం అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో జనరల్‌ అసీమ్‌ మునీర్‌కు అది ఎంతో ఉపయోగకరంగా ఉండవచ్చు.సంజీవ్‌ శంకరన్‌ వ్యాసకర్త ‘మనీ కంట్రోల్‌’ ఒపీనియన్స్‌–ఫీచర్స్‌ ఎడిటర్‌

Defence Minister Rajnath SIngh Hails Operation Sindoor6
‘అమాయకుల ప్రాణాలు తీసిన వారిని మట్టుబెట్టాం’

న్యూఢిల్లీ: అమాయకుల ప్రాణాలు తీసిన వారిని ఆపరేషన్ సిందూర్‌తో మట్టుబెట్టామని కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ తో శత్రువుకు తగిన విధంగా బుద్ధి చెప్పామన్నారు. ఈ రోజు(బుధవారం) ప్రెస్ మీట్ లో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్.. ‘రైట్ టు రెస్పాండ్ హక్కును వాడుకున్నాం. భారత సైనం తన సత్తాను చాటింది. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు చేశాం. పహల్గామ్ లో అమాయకుల ప్రాణాలు తీసిన వారు మూల్యం చెల్లించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశ శత్రువులకు తగిన విధంగా బుద్ధి చెప్పాం. హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నాం. భారత సైన్యం లక్ష్యం పాక్ పౌరులు కాదు.. ఉగ్రవాదుల స్థైర్యాన్ని దెబ్బతీశాం. ఆపరేషన్ సిందూర్‌తో రికార్డు సృష్టించాం. పాక్ పౌరుల ప్రాణాలకు ముప్పు కలగకుండా ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేశాం’ అని ఆయన పేర్కొన్నారు.కాగా, ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ దాయాది పాకిస్థాన్‌కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం.జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో 10 మంది మసూద్‌ కుటుంబసభ్యులేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బవహల్పూర్‌ లోని జైష్-ఎ-మహమ్మద్‌, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కర్-ఎ-తొయిబా క్యాంపులపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది..

Indian Captain Rohit Sharma Announces RETIREMENT From Test Cricket With Immediate Effect7
క్రికెట్‌ అభిమానులకు గుండె పగిలే వార్త.. రిటైర్మెంట్‌ ప్రకటించిన రోహిత్‌ శర్మ

టీమిండియా అభిమానులకు గుండె పగిలే వార్త. రోహిత్‌ శర్మ టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని హిట్‌మ్యాన్‌ స్వయంగా తన ఇన్‌స్టా ఖాతా ద్వారా వెల్లడించాడు. తన రిటైర్మెంట్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని రోహిత్‌ పేర్కొన్నాడు. రోహిత్‌ తన రిటైర్మెంట్‌ ప్రకటనలో ఇలా రాసుకొచ్చాడు. "అందరికీ నమస్కారం, నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. తెల్ల దుస్తుల్లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా గౌరవంగా ఉంది. సంవత్సరాలుగా మీ అందరి ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు. వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతాను"38 ఏళ్ల రోహిత్‌ భారత్‌ తరఫున 67 టెస్ట్‌లు ఆడి 40.6 సగటున 4301 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్‌ సెంచరీ, 11 సెంచరీలు, 18 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 2022లో విరాట్‌ కోహ్లి నుంచి టెస్ట్‌ కెప్టెన్సీని చేపట్టిన రోహిత్‌.. 24 టెస్ట్‌ల్లో టీమిండియా సారథిగా వ్యవహరించాడు. ఇందులో 12 మ్యాచ్‌ల్లో భారత్‌ను విజేతగా నిలబెట్టాడు. 9 మ్యాచ్‌ల్లో భారత జట్టు ఓడగా.. మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. రోహిత్‌ తర్వాత టీమిం‍డియా తదుపరి టెస్ట్‌ కెప్టెన్‌ను ప్రకటించాల్సి ఉంది. రేసులో శుభ్‌మన్‌ గిల్‌ ముందున్నాడు. రోహిత్‌ గతేడాది పొట్టి ప్రపంచకప్‌ తర్వాత టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో రోహిత్‌ భారత్‌ను జగజ్జేతగా నిలిపాడు. ఇదిలా ఉంటే, ఇటీవలి కాలంలో టెస్ట్‌ల్లో రోహిత్‌ శర్మ ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. గత 10 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్‌ ఒక సెంచరీ, రెండు హాఫ్‌ సెంచరీలు మాత్రమే చేశాడు. తాజాగా ముగిసిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో రోహిత్‌ దారుణంగా విఫలమయ్యాడు. 5 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. పేలవ ప్రదర్శన కారణంగా ఆ సిరీస్‌ ఆఖరి మ్యాచ్‌లో రోహిత్‌ స్వతాహాగా జట్టు నుంచి తప్పుకున్నాడు.అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లోనూ రోహిత్‌ దారుణంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో కేవల​ం 91 పరుగులు మాత్రమే చేశాడు. వ్యక్తిగతంగా విఫలం కావడమే కాకుండా ఈ రెండు సిరీస్‌ల్లో రోహిత్‌ కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. ఈ రెండు సిరీస్‌లను భారత్‌ కోల్పోయింది.

Pak PM Shehbaz Sharif  In Action Army Chief No Action8
పాక్ పీఎం యాక్షన్.. ఆర్మీ చీఫ్ నో యాక్షన్!

భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాబ్ షరీఫ్ ‘యాక్టింగ్‌ కెప్టెన్‌’ పాత్రకు రెడీ అయ్యారు. భారత్‌తో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. భారత్ తమపై దాడి చేసిందని, అందుకు ప్రతీకారం తీర్చుకుంటామనీ అన్నారు. రైట్ టు రెస్పాండ్ హక్కు మాకూ ఉందన్నారు. ఈ మేరకు అత్యవసరం సమావేశం కూడా ఏర్పాటు చేశారు.ఆర్మీ చీఫ్‌ ఎక్కడ..?ఈ మేరకు హై లెవిల్ సెక్యూరిటీ మీటింగ్ కు పాక్ ప్రధాని షరీఫ్ పిలుపునిచ్చారు. అయితే దీనికి ఆ దేశ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ హాజరుకాలేదు. కనీసం మునీర్ నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతల నడుమ మునీర్ ఎక్కడో కీలక ప్రాంతంలో దాక్కున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తో యుద్ధాన్ని ఆర్మీ చీఫ్ మునీర్ వద్దనుకునే కీలక మీటింగ్ లకు దూరంగా ఉంటున్నాడనే వాదన కూడా తెరపైకి వచ్చింది.ఇప్పుడు పాక్ ప్రధాని షరీప్ కాస్త యాక్టింగ్ లోకి దిగుదామని ప్రయత్నిస్తున్నా అక్కడ సైన్యం పూర్తిగా సహకరించడం లేదనడానికి మునీఫ్ గైర్హాజరీనే ఒక ఉదాహరణ. ప్రస్తుతం భారత్ పై తిరుగుబాటు చేస్తే పాక్ కే నష్టమని పలువురు దేశ, విదేశీ రాజకీయనాయకులు చెబుతున్న మాట. ఇదే ఫాలో అవుతున్నట్లున్నాడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. పాక్ లో అత్యంత శక్తివంతుడుగా విస్తృత ప్రచారంలో ఉన్న మునీర్.. మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్లో పాక్ పెద్దలకు అర్థం కావడం లేదు. హైలెవిల్ మీటింగ్ కు రావాలని పాక్ భద్రతా దళాల అధికారులకు ప్రధాని ఆదేశాలు ఇచ్చిన తరుణంలో మునీర్ ఎందుకు దూరంగా ఉన్నట్లు. పాక్ పీఎం యాక్షన్ ప్లాన్ కు ఆ దేశ ఆర్మీ చీఫ్ నుంచి ఎటువంటి యాక్షన్ లేకపోవడం ఏంటనేది ఇప్పుడు ఆ దేశంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు..మునీర్.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్.. తమ పార్టీ మాత్రం ప్రభుత్వం నిర్వహించే కీలక సమావేశాల్లో పాల్గొదనే సంకేతాలిచ్చాడు. దాంతోనే ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీలోని పార్లమెంట్ సభ్యులు కూడా ప్రభుత్వంపై అవకాశం వచ్చినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్మీ చీఫ్ కూడా కీలక సమయంలో పాక్ హ్యాండిచ్చాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మేకపోతు గాంభీర్య ప్రదర్శిస్తూ భారత్ వార్నింగ్ ఇచ్చిన మునీఫ్.. సరైన సమయానికి మాత్రం ఎస్కేపింగ్ ప్లాన్ చేసుకున్నట్లు కనబడుతోంది.మరో ముషారఫ్ రాజ్యం రాబోతుందా..?పాకిస్తాన్ లో ప్రభుత్వాలను కూల్చేసి ఆర్మీ చీఫ్ లు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం గతంలో చూశాం. మరి మునీఫ్ కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నాడని కొంతమంది విశ్లేషిస్తున్నారు. అయితే మునీఫ్ అంత సీన్ లేదనే కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతం పాక్ లో ప్రభుత్వాన్ని మునీర్ కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అందుకే సైలెంట్ మోడ్ లోకి మునీఫ్ వెళ్లాడని, ఇది పరోక్షంగా ఇమ్రాన్ ఖాన్ కు మేలు చేయడం కోసమేనని పాక్ లోనే వినిపిస్తోంది. గతంలో పాక్‌ మాజీ సైనాకాధికారి ముషారఫ్‌.. సైన్యం మద్దతు విశేషంగా కూడగట్టుకుని పాక్‌ ప్రభుత్వాన్ని కూల్చేసి అధ్యక్షుడయ్యాడు.ముషారఫ్.. 1999 నాటి కుట్రలో ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నుంచి అధికారం హస్తగతం చేసుకొని, ‘ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌’గా, ఆ పైన సైనికాధ్యక్షుడిగా, చివరకు పౌర అధ్యక్షుడిగా తొమ్మిదేళ్ళ కాలం దేశాన్ని గుప్పెట్లో పెట్టుకొన్నారు. ఆఖరికి మెడ మీద అభిశంసన కత్తితో 2008లో గద్దె దిగక తప్పలేదు.

Operation SIndoor: How PM Narendra Modi Strategic Shift9
ప్రధాని మోదీ విజయరహస్యం ఇదే..!

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధ వ్యూహాలపైనే చర్చ నడుస్తోంది. ఎంత కఠినమైన సమయంలో కూడా తనలోని గాంభీర్యాన్ని ముఖంలో కనిపించనీయకుండా. పైకి తనపని తాను చేసుకుంటూ వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉండటమే మోదీ శైలి. అవతలి వాడికి అవకాశమివ్వడం, అవతలివాడిని మాట్లాడనీయడం మోదీకి తెలిసిన మరో విద్య. అది చెడు కానంతవరకే మోదీ భరిస్తారు.. ఒకవేళ అవతలి వాళ్ల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న సమయంలో మాత్రం మోదీ వ్యవహరశైలి భిన్నంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా విశేష అభిమానం సందపాదించుకున్న మోదీ యుద్ధ వ్యూహాలను చూసి ప్రపంచ మిలిటరీ వ్యూహకర్తలు, విశ్లేషకులు నివ్వెరపోతున్నారు.ఎడమవైపు సంజ్ఞ చేస్తారు కుడివైపుకు తిరుగుతారు.. ఇది మనకు మోదీ ప్రసంగంలో తరుచు కనిపిస్తూ ఉంటుంది. మరి మోదీ వ్యూహాలు కూడా ఇలానే ఉంటాయి. ప్రస్తుతం పాకిస్తాన్‌ ఉగ్రస్థావరాలపై దాడులే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌ కూడా ఇదే కోవలోకి వస్తుంది. పాకిస్తాన్‌ ఉగ్రస్థావరాలపై దాడులే కాకుండా ఆ దేశ కవ్వింపు చర్యలకు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో తలపెట్టిన ఆపరేషన్‌ సింధూర్‌ విజయవతమైంది. గత కొన్నేళ్లుగా మోదీ యుద్ధ తంత్రాలను దాయాది దేశం పాకిస్తాన్‌ పసిగట్టలేకపోతోంది.బాలాకోట్, "ఆపరేషన్ సింధూర్" రెండింటికీ ముందు, ప్రధాని మోదీ బాడీ లాంగ్వేజ్ బహిరంగ ప్రదర్శనే గాక ఆయన ప్రసంగాలు కూడా ప్రశాంతంగా కనిపించాయి. మోదీ అసలు ఉద్ధేశాన్ని బహిర్గత పరచలేదు. ఈ రెండు సమయాల్లోనూ సూదిమొనంత కచ్చితత్వంతో తాను చేయబోయే అ దాడులను,కాయన అమాయక మొహం వెనక దాచిపెట్టారు.బాలాకోట్ దాడి వ్యూహం తరహాలోనే, ఈసారి కూడా ప్రధాని మోదీ వ్యూహాలు పాకిస్తాన్‌ను నివ్వెరపరచాయ్. దాడికి ముందు ప్రశాంతమైన బాడీ లాంగ్వేజ్‌తో మాస్టర్‌మైండ్‌ యుద్ధతంత్రంతో. ఆపరేషన్ సింధూర్ కు ముందు ప్రదర్శించిన వైఖరి.. బాలకోట్‌కు ముందు ఆయన ప్రదర్శించిన వైఖరి పాకిస్తాన్‌ను అయోమయంలో పడేసింది.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక వైపు చూపించి.. మరో వైపు నుంచి.. మధ్యందిన మార్తాండుని వలే అనన్యసామాన్యమైన శక్తితో శత్రువుపై పిడుగులు కురిపించే కళలో ప్రావీణ్యం సంపాదించినట్లే ఉంటుంది.. 2019లో బాలకోట్ దాడులకు ముందు ఆయన ప్రయాణ ప్రణాళికతో పాటు ఆయన ప్రసంగం, ప్రస్తుత "ఆపరేషన్ సింధూర్" సందర్భంగా ఆయన వ్యూహాలు.. యుద్ధతంత్రంలో మాస్టర్‌క్లాస్‌లు.. శత్రువును అచేతనం చేసి.. మూగబోయేలా చేశాయి.ఒకసారి చేస్తే యాదృచ్ఛికం కానీ మళ్ళీమళ్ళీ పునరావృతం చేయడమంటే.. ప్రపంచమనే వేదికను నివ్వెరపరచడమే. ఇది మోదీకే సాధ్యమైన యుద్ధతాండవం. అని నిస్సంకోచంగా చెప్పొచ్చు. రెండు దాడులకు మధ్య ఉన్న సారూప్యతలను పరిశీలిస్తే.. అవి కచ్చితంగా ఆశ్చర్యచకితుల్ని చేసే విధంగా ఉంటాయి. బాలకోట్ దాడికి ముందు ప్రధాని మోదీ ప్రదర్శించిన తంత్రం నుండి ఎలాంటి పాఠం నేర్చుకోనందుకు పాకిస్తాన్‌ తన చెప్పుతో తననే కొట్టుకుంటుంది.బాలకోట్ కు 48 గంటల ముందు2019 ఫిబ్రవరి 26న.. తెల్లవారుఝామున భారతదేశం బాలకోట్ పై దాడి చేసింది. కానీ, ఆ దాడికి ముందు 48 గంటలు, మోదీ షెడ్యూల్ అంతా యథావిధిగా జరిగింది.ఫిబ్రవరి 25న, ఆయన న్యూఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని జాతికి అంకితం చేశారు. భారత సాయుధ దళాల పరాక్రమం గురించి ఆయన మాట్లాడినప్పటికీ, పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని జిహాదిస్ట్ మౌలిక సదుపాయాలపై రాబోయే దాడి గురించి ఎటువంటి సూచన ఇవ్వలేదు.నిన్న(మంగళవారం, మే 6వ తేదీ) రాత్రి 9 గంటలకు, భారత విమానాలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ప్రధాని మోదీ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. భారతదేశం యొక్క ఆకాంక్షలు, అభివృద్ధి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దాని సంకల్పం గురించి మోదీ మాట్లాడారు. ఆందోళన సూచించే ఒక్క ముడత కూడా అతని నుదిటిపై కనిపించలేదు. ప్రసంగంలో సందేహాస్పదమైన అంశాలకు ఏమాత్రం చోటివ్వలేదు.తుఫాను ఎదురైనప్పుడు ప్రశాంతత, అగ్ని గుండంలోనూ ధైర్యంగా నిలబడగలగడం గొప్ప నాయకుడి లక్షణాలు అని మనస్తత్వవేత్తలు అంటారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వం.. వారు సూచించే నాయకత్వ అంచనాలకు సరిపోవడం చూసి.. వారు నాయకత్వానికి ఇచ్చిన భాష్యం సరైందేనని భావిస్తారు.మోదీ వ్యూహాలు అర్థం కాలేదు,..చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోకపోతే, అవే తప్పులను పునరావృతం చేస్తారు. బాలాకోట్‌కు ముందు ప్రధాని మోదీ తీరును పాకిస్తాన్ విశ్లేషించి ఉంటే.. మే 6వ తేదీ రాత్రి నియంత్రణ రేఖ వెంబడి తొమ్మిది లక్ష్యాలపై భారత్‌ దాడి చేసినప్పుడు ఆ దేశం ఎంతో కొంత ప్రతిఘటించే ఉండేది, కానీ మోదీ వ్యూహాలు అర్ధం కాకపోవడంతో పాకిస్తాన్‌ చూస్తూ ఉండిపోయింది.బాలకోట్‌కు ముందు ప్రధాని మోదీ వైఖరికి సంబంధించి కచ్చితత్వానికి ప్రతిరూపంగానే నిలుస్తుంది. దాడులకు కొన్ని గంటల ముందు, ఆయన ఒక మీడియా కార్యక్రమంలో పాల్గొని 2047 నాటికి భారతదేశం ఆర్థికంగా గొప్ప దేశంగా ఎదగాలనే ఆకాంక్షల గురించి మాట్లాడారు.30 నిమిషాల పాటు జరిగిన ఆనాటి తన ప్రసంగంలో.. ఏమాత్రం ఆందోళన కానీ ఒత్తిడి లేని వ్యక్తిలా ప్రశాంతంగా ఆయన మాట్లాడారు, జోకులు వేస్తూ, భారతదేశంలో ఉగ్రవాద దాడులకు మద్దతు ఇచ్చినందుకు పొరుగువారిని విమర్శించడం వినడానికి ప్రేక్షకులు ఆసక్తిగా కనిపించినప్పటికీ, పాకిస్తాన్ అనే పదాన్ని మాత్రం ఒక్కసారి కూడా పలకలేదు. ఆ సందర్బంగా మోదీ బాడీ లాంగ్వేజ్‌ను పరిశీలిస్తే ఎలాంటి అంచనాకు రాలేం.భారతదేశం అంతటా యుద్ధ విన్యాసాలు ప్రకటించడం అతిపెద్ద తంత్రం.. ప్రధానమంత్రి మోదీ ఇప్పటికీ తన దేశాన్ని సైనిక చర్యకు, దాని పరిణామాలకు సిద్ధం చేస్తున్నారని సూచిస్తుంది. కానీ, ఇది పాకిస్తాన్‌కు విలాసవంతమైన సమయం ఉందనే భ్రమను కలిగించడానికి ఒక వ్యూహం మాత్రమే అని ఉదయాన్నే తేలింది.యుద్ధ కళలో నిష్ణాతులు ఏమంటారంటే.. మీకు మీ శత్రువు గురించి పూర్తిగా తెలిస్తే, యుద్ధంలో ఓటమికి చాలా తక్కువ అవకాశం ఉంటుందని చెబుతారు. పాకిస్తాన్‌ను మోదీ పూర్తిగా చదివేశారు... కానీ ఆయన్ను అంచనా వేయడంలో పాక్‌ మళ్లీ ఫెయిల్‌ అయ్యింది. అందుకే గెలుపు ప్రతీసారి మోదీనే వరిస్తుంది.

IPL 2025: Mumbai Indians Travel To Dharamsala Deferred In The Wake Of Operation Sindoor10
Operation Sindoor: ముంబై ఇండియన్స్‌పై ఎఫెక్ట్‌

ఆపరేషన్‌ సిందూర్‌ ఎఫెక్ట్‌ ముంబై ఇండియన్స్‌పై పడింది. తమ తదుపరి మ్యాచ్‌ కోసం ముంబై ఇండియన్స్‌ ఇవాళ (మే 7) సాయంత్రం ముంబై నుంచి చండీఘడ్‌ మీదుగా ధర్మశాలకు ప్రయాణించాల్సి ఉంది. అయితే ఆపరేషన్‌ సిందూర్‌ తదనంతర పరిణామాల నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ధర్మశాల ప్రయాణం వాయిదా పడింది. భారత ప్రభుత్వం సూచనల మేరకు చండీఘడ్‌ సహా దేశంలో పలు విమానాశ్రయాలు మూసివేశారు. చాలా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇందులో ముంబై ఇండియన్స్‌ ప్రయాణించాల్సిన విమాన సర్వీస్‌ కూడా ఉంది. బీసీసీఐ నుంచి తదుపరి సూచనలు వచ్చే వరకు ముంబై ఇండియన్స్‌ జట్టు ముంబైలోనే ఉండనుంది.ఈ నెల 11న ముంబై ఇండియన్స్‌ ధర్మశాల వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ కోసమే వారు ధర్మశాల ప్రయాణానికి సిద్దమయ్యారు. ఈ లోపే విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరోవైపు ధర్మశాలలో రేపు (మే 8) ఓ మ్యాచ్‌ జరుగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌.. పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు ఇదివరకే ధర్మశాలకు చేరుకున్నాయి.కాగా, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాక్‌ దాడులకు తెగబడే అవకాశం ఉండటంతో భారత ప్రభుత్వం పలు విమానాశ్రయాలను మూసి వేయాలని సూచించింది. అయితే దీని ప్రభావం​ ఐపీఎల్‌ పడే అవకాశం ఉంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లు షెడ్యూల్‌ ప్రకారం సాగాలంటే ఆయా జట్లు ఓ వేదిక నుంచి మరో వేదికకు విమానాల ద్వారా ప్రయాణించాల్సి ఉంది. దేశంలో పలు విమానాశ్రయాలు మూసివేసిన నేపథ్యంలో జట్ల ప్రయాణానికి ఆటంకం కలుగవచ్చు. దీని ప్రభావం ఐపీఎల్‌ షెడ్యూల్‌పై పడే అవకాశం ఉంది.స్పందించిన బీసీసీఐషెడ్యూల్‌ మార్పు అంశంపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశాయి. ఈ విషయంపై బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘పరిస్థితులను బీసీసీఐ నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్‌ మ్యాచ్‌లు షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నాయి.మ్యాచ్‌ ముగిసిన కొద్ది సేపటికే ఆపరేషన్‌ సిందూర్‌ మొదలైందిముంబై ఇండియన్స్‌ -గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య నిన్న (మే 6) జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది. ఈ మ్యాచ్‌ ముగిసిన కాసేపటికే భారత సైన్యం పాకిస్తాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది.జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత నెల 22వ తేదీన పాక్‌ ఉగ్రమూకలు దాడులకు తెగబడి 26 మంది అమాయకుల ఫ్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. దీనికి బదులుగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట పాక్‌కు బుద్ధి చెప్పింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement