‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ | Sankranthiki Vasthunam Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Sankranthiki Vasthunam Review: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ

Published Tue, Jan 14 2025 11:46 AM | Last Updated on Tue, Jan 14 2025 8:43 PM

Sankranthiki Vasthunam Movie Review And Rating In Telugu

టైటిల్‌: ‘సంక్రాంతికి వస్తున్నాం’
నటీనటులు: వెంకటేశ్‌, ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి, వీకే నరేశ్‌, వీటీ గణేష్‌, సాయి కుమార్‌, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర లిమాయే తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 
నిర్మాతలు: శిరీష్‌, దిల్‌ రాజు
దర్శకత్వం: అనిల్‌ రావిపూడి
సంగీతం: భీమ్స్‌ సిసిరిలియో
సినిమాటోగ్రఫీ: సమీర్‌ రెడ్డి
ఎడిటర్‌: తమ్మిరాజు
విడుదల తేది: జనవరి 14, 2025​

ఈ సంక్రాంతికి చివరిగా వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Review). రిలీజ్‌ విషయంలో చివరిది అయినా.. ప్రమోషన్స్‌లో మాత్రం మిగతా సినిమాలతో పోలిస్తే ఇదే ముందంజలో ఉంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు చేసినంత ప్రమోషన్‌ మరే సినిమాకు చేయలేదు. దానికి తోడు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌ అదిరిపోవడంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’పై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 14)  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది?   ‘ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి విక్టరీ గ్యారెంటీ’ అనిపించుకున్న వెంకటేశ్‌ ఖాతాలో మరో ‘ ఫ్యామిలీ విక్టరీ’ పడిందా రివ్యూలో చూద్దాం.

కథేంటేంటే.. 
డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్‌ వైడీ రాజు(వెంకటేశ్‌) ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌. మంచి కోసం తాను చేసే ఎన్‌కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్‌ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్‌), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.

 కట్‌ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్‌)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్‌(నరేశ్‌). పార్టీ ప్రెసిడెంట్‌(వీటీ గణేశ్‌) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్‌ హౌజ్‌ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్‌ అతన్ని కిడ్నాప్‌ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్‌.. ఎలాగైనా బీజూ గ్యాంగ్‌ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు. 

ఐపీఎస్‌ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్‌ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్‌ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్‌ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్‌ ఎలా సక్సెస్‌ చేశాడనేదే ఈ సినిమా కథ. 

ఎలా ఉందంటే.. 
కొన్ని కథలు మన ఊహకందేలా సింపుల్‌గా ఉంటాయి. సినిమా ప్రారంభం మొదలు ఎండ్‌ వరకు ప్రతీది అంచనాకు తగ్గట్టే ఉంటాయి. కానీ తెరపై చూస్తుంటే తెలియని ఒక ఆనందం కలుగుతుంది. పాత కథ, రొటీన్‌ సీన్లే అయినప్పటికీ ఎంటర్‌టైన్‌ అవుతుంటాం. అలాంటి సినిమాలను తెరకెక్కించడం అనిల్‌ రావిపూడికి వెన్నతో పెట్టిన విద్య. సింపుల్‌ పాయింట్‌ని తీసుకొని రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. గత సినిమాల మాదిరే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. టైటిల్‌ మాదిరే సంక్రాంతికి అసలైన సినిమా ఇది.(Sankranthiki Vasthunam Review)

అనిల్‌ రావిపూడి(Anil Ravipudi) రిలీజ్‌ ముందే సినిమా కథంతా చెప్పేస్తుంటాడు.  ఈ సినిమా విషయంలోనూ అదే చేశాడు. ట్రైలర్‌లోనే కథంతా చెప్పేశాడు. హీరోహీరోయిన్ల క్యారెక్టర్‌ ఎలా ప్రవర్తిస్తాయో  కూడా ప్రమోషన్స్‌లోనే చెప్పేశాడు.   స్టోరీ మొత్తం తెలిసినా కూడా తెరపై ఆ కథను చూసి ఎంజాయ్‌ చేయాలని ప్రతి ప్రేక్షకుడు అనుకుంటాడు. దానికి కారణం.. ఈ కథ మెయిన్‌ పాయింట్‌.  భార్య, భర్త, ప్రియురాలు.. ఈ మూడు పాత్రలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కనిపిస్తాయి. వాళ్ల మధ్య వచ్చే ప్రతీ సీన్‌ మన నిజ జీవితంలో ఎక్కడో ఒక చోట చూసే ఉంటాం.  అలాంటి పాయింట్‌ పట్టుకోవడమే అనిల్‌ రావిపూడి సక్సెస్‌.  ఓ ఫ్యామిలీ స్టోరీకి ఓ వెరైటీ ఇన్వెస్టిగేషన్‌ యాడ్‌ చేసి ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా కథనాన్ని నడిపించాడు. 

ఆకెళ్ల కిడ్నాప్‌ సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. అయితే ఈ కిడ్నాప్‌ సీన్‌ని కూడా ఎంటర్‌టైనింగ్‌గానే తీర్చిదిద్ది.. కథనం మొత్తం ఫుల్‌ కామెడీ వేలో సాగుతుందనే ముందే చెప్పేశాడు దర్శకుడు.  ఆ తర్వాత రాజు ఫ్యామిలీ పరిచయం నవ్వులు పూయిస్తుంది.  వైడీ రాజు కొడుకు బుల్లిరాజు పండించే కామెడీకి పడిపడి నవ్వుతారు. వైడీ రాజు ఇంటికి మీనాక్షి వచ్చిన తర్వాత కామెడీ డోస్‌ డబుల్‌ అవుతుంది.  ఒక పక్క భార్య, మరో పక్క మాజీ ప్రియురాలుతో హీరో పడే బాధ థియేటర్‌లో నవ్వులు పూయిస్తుంది.  ఆహ్లాదకరమైన పాటలు... పొట్టచెక్కలయ్యే కామెడీ సీన్లతో ఫస్టాఫ్‌ ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా ముగుస్తుంది. 

ఇక సెకండాఫ్‌ ప్రారంభం అయిన కాసేపటికే కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. జైలర్‌ జార్జ్‌ ఆంటోనీ(ఉపేంద్ర లిమాయే)తో వచ్చే కొన్ని సీన్లు అంతగా ఆకట్టుకోవు. ఆస్పత్రి సీన్‌ కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది.  ‘ఆవకాయ’ సీన్‌కు అయితే పడిపడి నవ్వుతారు. క్లైమాక్స్‌ని పకడ్బందీగా రాసుకున్నాడు.  క్లైమాక్స్‌ యాక్షన్‌ సీన్‌ అయితే అదిరిపోతుంది. అక్కడ వెంకటేశ్‌ చెప్పే డైలాగ్స్‌ నవ్వులు పూయిస్తాయి. ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతినకుండా.. మగవాళ్లకు మనో ధైర్యాన్ని ఇచ్చేలా ఆ డైలాగ్స్‌ ఉంటాయి.  ముగింపులో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది. మొత్తంగా సంక్రాంతికి చూడాల్సిన మాంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. 

ఎవరెలా చేశారంటే.. 
ఇద్దరి ఆడవాళ్ల మధ్య నలిగిపోయే  పాత్రను వెంకటేశ్‌(Venkatesh) చేస్తే ఎలా ఉంటుందో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రంలోనే చూసేశాం. ఆయన కామెడీ టైమింగ్‌ గురించి అందరికి తెలిసిందే.  ఈ చిత్రంలో కూడా వెంకీ అలాంటి పాత్రే చేశాడు.  మాజీ ప్రియురాలు, భార్య మధ్య నలిగిపోయే యాదగిరి దామోదర రాజు పాత్రలో ఒదిగిపోయాడు.  ఇద్దరి ఆడాళ్ల మధ్య నలిగిపోతూ నవ్వులు పూయించాడు.  యాక్షన్‌తో అలరించడమే కాకుండా పాట పాడి ఆకట్టుకున్నాడు. ఇక చదువురాని పల్లెటూరి అమ్మాయి, రాజు భార్య  భాగ్యంగా ఐశ్వర్య రాజేశ్‌ తనదైన నటనతో ఆకట్టుకుంది.

రాజు మాజీ ప్రియురాలు, ఐపీఎస్‌ అధికారి మీనాక్షిగా మీనాక్షి చౌదరి అదరగొట్టేసింది.  తొలిసారి ఇందులో యాక్షన్‌ సీన్‌ కూడా చేసింది. ఇక వీరందరితో పాటు ముఖ్యంగా మట్లాడుకోవాల్సిన మరో పాత్ర బుల్లి రాజు.  ఈ పాత్రలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌ రేవంత్‌ ఒదిగిపోయాడు. ఇంత మంది స్టార్స్‌ ఉన్నప్పటికీ.. తనదైన నటనతో అందరి దృష్టి ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్‌ ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగాడానికి బుల్లిరాజు పాత్ర కూడా ఒక ప్రధాన కారణం. ‘కొరికేస్తా.. కొరికేస్తా’ అంటూ ఈ బుడ్డోడు చేసిన కామెడీకి ప్రేక్షకులు పలగబడి నవ్వారు. నరేశ్‌, సాయి కుమార్‌,  సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర మిగిలిన నటీనటులు తమ  పాత్రల పరిధిమేర నటించారు. 

సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా భీమ్స్‌ అందించిన సంగీతం సినిమాకే హైలెట్‌. అద్భుతమైన పాటలతో పాటు అదిరిపోయే బీజీఎం ఇచ్చాడు. ‘గోదారి గట్టు మీద...’పాటతో పాటు ప్రతి పాట తెరపై చూసినప్పుడు మరింత ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌ డెస్క్‌

 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement