
సాక్షి, తిరుపతి/చిత్తూరు/అమరావతి: తన పాలనలో ఎవ్వరూ రోడ్డు మీదకొచ్చి గొడవచెయ్యలేదని సీఎం చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం చిన్నపాండూరు వద్ద అపోలో టైర్స్ పరిశ్రమ నిర్మాణానికి సీఎం చంద్రబాబు మంగళవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీని ఆటోమొబైల్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఆటోమొబైల్స్ రంగం ద్వారా రూ.24,600 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. రూ.6.80 లక్షల కోట్ల పెట్టుబడులతో 80.63 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పుకొచ్చారు. మచిలీపట్నం, దొనకొండ, విశాఖ, ఏర్పేడు వద్ద పరిశ్రమలు నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. మొత్తం రూ.5 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చినందుకు అపోలో టైర్స్ యాజమాన్యాన్ని అభినందించారు. మొదటి దశలో 270 ఎకరాల్లో రూ.1,800 కోట్ల పెట్టుబడులతో 700 మందికి ఉపాధి కల్పించనుందని చెప్పారు. అనంతరం అపోలో టైర్స్ చైర్మన్, వైస్ చైర్మన్ ఓంకార్ కన్వర్, నీరజ్ కన్వర్ ప్రసంగించారు. రానున్న 24 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు.