
పర్సెంటేజీ తమ ఇంటికొస్తే చాలనుకునే నేతలు... ప్రాజెక్టు లేటైతే అంచనాలు పెంచేద్దామనుకునే కాంట్రాక్టర్లు... నాలుగు కాసులిస్తే సర్దుకుపోయే అధికారులు.. అంతిమంగా 120 గ్రామల దాహార్తి తీర్చేందుకు రూ. కోట్ల నిధులు పారించినా... జనం గొంతు మాత్రం తడవడం లేదు. ముదిగుబ్బ మండలంలో పైలెట్ మంచినీటి ప్రాజెక్ట్ పనులు ఐదున్నరేళ్లుగా సాగుతూనే ఉన్నాయి.
ధర్మవరం : సరిగ్గా ఐదేళ్ల క్రితం 2013 జూలై 30న ముదిగుబ్బ మండల కేంద్రానికి సమీపంలో రూ. 21.40 కోట్లతో బృహత్తర పైలెట్ మంచినీటి ప్రాజెక్ట్ పనులకు అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ముదిగుబ్బ, తనకల్లు మండలాల్లోని 120 గ్రామాలకు 2014 నవంబరు నాటికి మంచినీటిని అందివ్వాలన్నది దీని లక్ష్యం. దీని కోసం జాతీయ గ్రామీణ మంచినీటి అభివృద్ధి పథకం (ఎన్‌ఆర్‌డబ్ల్యూపీ) కింద రూ. 21.40 కోట్ల కేంద్రం నిధులు మంజూరయ్యాయి. తొలివిడతగా రూ. 7 కోట్లు, మలివిడతగా మరో రూ. 14 కోట్లు ఇచ్చేలా టెండరు ఖరారు చేశారు.
చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి సత్యసాయివాటర్ సప్‌లై స్కీంద్వారా ఈ ప్లాంటకు వచ్చిన నీటిని శుద్ధిచేసి, రోజుకు 30 మిలియన్ లీటర్ల శుద్ధ జలాలను ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన రక్షిత మంచిననీటి పథకాలకు తాగునీటిని అందించేందుకు వీలుగా ఈ ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేశారు. తొలి విడత పనులు 2014 జనవరి నాటికే పూర్తయ్యాయి. ఆ తర్వాత రెండో విడత పనులను రూ.14.40 కోట్లతో ప్రస్తుత ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ 2014 సెప్టెంబర్ 7న భూమి పూజ చేశారు. అయితే ఆ పనులు ఇప్పటి వరకు పూర్తికాకపోవడంతో 120 గ్రామాలకు నేటికీ చుక్కనీటిని కూడా ఇవ్వలేకపోయారు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గడువు ముగిసినా కదలికేదీ? : వాస్తవానికి 2015 సెప్టెంబర్ నాటికే కాంట్రాక్టర్ ఈ పనులను పూర్తి చేయాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో పనుల్లో జాప్యం జరగటంతో కాలపరిమితిని పెంచారు. ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా మొదటి విడతలో ప్లాంట్, రెండో విడత కింద గ్రామాల్లో ట్యాంకులు, పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ముదిగుబ్బ, తలుపుల మండలాల్లోని 120 గ్రామాల్లోని రక్షిత మంచినీటి పథకాలకు అను«సంధానం చేయాల్సి ఉంది. తొలిదశలో పనులు పూర్తయి రెండేళ్లు కావస్తున్నా... మలిదశ పనుల్లో తీవ్ర జాప్యం జరగుతోంది. వివిధ సాంకేతిక కారణాలను చూపుతూ పనులు చేయడం లేదు. 2014 సెప్టెంబర్ 7న రెండో దశ పనులు ప్రారంభమయితే ఇంకా చిన్నా చితకా పనులు సాగుతూనే ఉన్నాయి. కనీసం వచ్చే వేసవికైనా గ్రామీణులకు తాగునీరు అందుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
పట్టించుకునేవారేరీ?
ఏళ్లుగా ప్రాజెక్టు పనులు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేరు. కంట్రాక్టర్‌కు రూ.కోట్లు చెల్లిస్తున్నా పనులెందుకు పూర్తి కావడంలేదన్న ప్రశ్నకు సమాధానమిచ్చేవారులేరు. ప్రజలేమో గుక్కెడు తాగునీటికి పడరాని పాట్లు పడుతూనే ఉన్నారు. రూ. కోట్లు ఖర్చుచేసినా.. పొలాల గట్లపైన ఇబ్బందులు పడుతూ నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి మాత్రం మారలేదు.
ప్రాజెక్ట్ పేరు : సమగ్ర మంచినీటి పథకం (ముదిగుబ్బ మండలం)
లక్ష్యం : ముదిగుబ్బ, తలుపుల మండలాల్లోని 120 గ్రామాలకు తాగునీటి సరఫరా
లబ్ధి : సుమారు 90,000 మందికి పొలాల వద్దనుంచి తాగునీటిని తెచ్చుకుంటున్న నాగారెడ్డిపల్లి గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment