ఉపాధి కష్టాలు | ‘Upadhi’ Difficulties | Sakshi
Sakshi News home page

ఉపాధి కష్టాలు

Published Tue, Mar 6 2018 8:48 AM | Last Updated on Sat, Aug 25 2018 5:17 PM

‘Upadhi’ Difficulties - Sakshi

వాకాడు: ఇంటి నుంచే తాగునీటి బాటిళ్లు తీసుకెళుతున్న ఉపాధి కూలీలు

వారంతా శ్రమజీవులు.. రొక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి.. పల్లెల్లో పనులు లేక వారంతా ఉపాధి హామీ కూలీలుగా మారారు. పనులు చేస్తే వచ్చే నాలుగు రూపాయలతో కుటుంబాన్ని పోషించుకోవాలన్న ఏకైక లక్ష్యం వారిది. రోజంతా మండుటెండలో పనిచేస్తున్నారు. అయితే కూలి చెల్లించాల్సిన అధికారులు వివిధ కారణలతో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి. జిల్లాలో శ్రమనే నమ్ముకున్న వేలాది మంది ఉపాధి హామీ కూలీల దయనీయ స్థితి ఇది. అధికారులు ఆడిట్‌లో చేసిన తప్పుల ఫలితంగా కూలీలు ఆర్థిక కష్టాలు పడుతున్నారు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో కూలీల వలసలను నివారించేందుకు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. సక్రమంగా పనులు ఉండకపోవటంతో జిల్లాలో వలసలు యథావిధిగానే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉపాధి హామీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తేనే వలసలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే అధికారుల బాధ్యతారాహిత్యం, ఉపాధి హామీ లో చోటుచేసుకుంటున్న అవినీతి వల్ల కూలీలు అంతిమంగా నష్టపోతున్నారు.

జిల్లాలో  గ్రామీణ ప్రాంతాల్లో పనులు గుర్తించి వాటిని ప్రభుత్వం ఆమోదించాలి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయరంగం అభివృద్ధికి సంబంధించిన పనులు, కాలువలు, జంగిల్‌క్లియరెన్స్, చెరువుల్లో మట్టితీయడం, రోడ్లు, పంటకుంటలు, వర్మీకంపోస్టులు తదితర పనులు ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్నారు. అనుమతి ఇచ్చిన తరువాత గ్రామాల్లో జాబ్‌కార్డులు ఉన్న కూలీలకు పనులు కల్పిస్తారు. జాబ్‌కార్డులు కలిగిన కూలీలకు పనులు కల్పించేందుకు, పనులను పర్యవేక్షించేందుకు ఎఫ్‌ఏలు, మేట్లు, టీఏలు, టీటీఏలు, ఏపీఓలు, ఎంపీడీఓలు, ఏపీడీలను నియమించారు.

ఉపాధి పనులు డ్వామా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఉపాధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. ఉపాధిలో ప్రతి ఏటా కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుంటోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రంలో ఆడిట్‌ నిర్వహించారు. దాని వలన నిధులు కేటాయించడంలో జాప్యం జరుగుతోంది. పర్యవసానంగా జిల్లాలోని ఉపాధి కూలీలకు నాలుగు నెలల్లో రూ.20 కోట్ల బకాయి పడ్డారు. బ్యాంక్‌లకు ఆధార్‌కార్డ్‌ లింకేజీ కాని కారణంగా మరో రూ.2.37 కోట్లు నిలిచిపోయింది. దీంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.

నాలుగు నెలలుగా అందని వేతనం
జిల్లాలో 5.85 లక్షల మందికి ప్రభుత్వం అధికారికంగా జాబ్‌ కార్డులు మంజూరు చేసింది. వీరికి నిబంధనల ప్రకారం ఏటా వంద పనిదినాలు కల్పించాలి. వీరికి రోజు కూలి రూ.140 తగ్గకుండా ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తుతం జిల్లాలో గత డిసెంబర్‌ నుంచి జిల్లాలో సుమారు 85 వేల మంది ఉపాధి కూలీలు పనిచేస్తున్నారు. వీరిలో ప్రధానంగా 62 వేల మందికి ఉపాధి కూలి అందని పరిస్థితి. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో 55వేల నుంచి 61 వేల మంది ప్రస్తుతం పనుల్లో ఉన్నారు. అయితే జిల్లాలో 2017 డిసెంబర్‌ నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కూలి మంజూరు కాని పరిస్థితి నెలకొంది.

ఉపాధి హమీ పనుల్లో అవకతవకలు జరిగాయని తరచూ విచారణలు చేపడుతున్నా చర్యలు మాత్రం శూన్యం. అయితే కూలీల వేతనాల మంజూరుకు మాత్రం దీనిని సాకుగా చూపుతున్నారు. 
∙ఉదాహరణకు  వాకాడు మండలంలో 665 గ్రూపుల్లో 10,075 మందికి జాబ్‌ కార్డులు ఉన్నాయి. ప్రసుత్తం వీరిలో వెయ్యి మందికి మాత్రమే ఉపాధి పనులు దక్కాయి. వీరికి గత డిసెంబర్‌ నుంచి ఇప్పటి వరకు కూలీలకు రూ.3 లక్షలు వరకు ఉపాధి సొమ్ము రావాల్సి ఉంది. ఉపాధి కూలీలు మూడు నెలలుగా పనులు చేస్తున్నప్పటికీ కూలి సొమ్ము అందక పస్తులుంటున్నారు. కూలీలకు సంబంధించిన వేతనాలు కేంద్ర ప్రభుత్వం నేరుగా నోడల్‌ బ్యాంక్‌లకు విడుదల చేసి అక్కడ నుంచి వివిధ బ్యాంక్‌ల ప్రధాన కార్యాలయాలకు పంపుతుంది.

అనంతరం క్షేత్ర స్థాయిలో ఉన్న బ్రాంచ్‌ల్లో జమ అవుతుంది. కూలీలు తమ ఖాతా నంబర్లు, ఆధార్‌ కార్డులు అనుసంధానం చేయాల్సి ఉంది. ఇలా అనుసంధానం చేసిన నంబర్లు ఎన్‌సీపీఐ(నేషనల్‌ పేమెంటు కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)లో సింక్‌ అయితే ఆయా వేతనాలు కూలీల ఖాతాలో జమ అవుతాయి.  కూలీలకు సంబంధించిన ఆధార్, ఖాతా నంబర్లు ఎన్‌సీపీఐలో సింక్‌ చేయడంలో అధికార్లు జాప్యం, చేసిన పొరపాట్లు కారణంగా వేతనాలు జమకాకుండా రిజెక్ట్‌ అవుతున్నాయి. పూర్తిగా అధికారులు చేసిన తప్పులకు కూలీలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఐదు వారాలుగా కూలీ అందక పస్తులుంటున్నాం 
ఐదు వారాలుగా ఉపాధి పనులు చేస్తున్నా.. ఇప్పటికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఈ విషయమై సంబంధిత అధికారులను అడిగితే బ్యాంక్‌లో జమ చేశామని, అక్కడ అడిగితే జమకాలేదని ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. వారం రోజులుగా పనులు సైతం మానుకుని కూలి డబ్బుల కోసం తిరుగుతున్నాం. ఇల్లు గడవక కుటుంబం పస్తులుండాల్సి వస్తోంది.
–వేమాల మస్తానయ్య ఉపాధి కూలీ, వాకాడు

చేతిలో చిల్లిగవ్వలేక అల్లాడుతున్నాం 
సెంటు భూమిలేని మా లాంటి పేదోళ్లంతా ఉపాధి పనులను నమ్ముకుని బతుకుతున్నాం. 48 రోజులుగా పనులు చేస్తున్నా ఇంతవరకు డబ్బులు జమకాలేదు. ఇప్పుడు ఆరోగ్యం సరిగా లేదు. మాత్రలు కొనడానికి కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా లేక అల్లాడుతున్నాం. అధికారులను అడిగితే ఇదిగో.. అదిగో అంటున్నారే తప్ప డబ్బులైతే ఇవ్వట్లేదు. పాస్‌ పుస్తకాలు పట్టుకుని బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నాం.   –వంజివాక పిచ్చమ్మ, ఉపాధి కూలీ, వాకాడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement