అవస్థల కేంద్రాలు
అంగన్‌వాడీ కేంద్రాలు అవస్థలకు ఆవాసాలుగా వర్థిల్లుతున్నాయి. తిండిపెట్టేవి అన్న వాదన అతిశయోక్తి కాదు. అదీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. జిల్లావ్యాప్తంగా 25 సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్) ప్రాజెక్టుల పరిధిలో 3587 ప్రధాన, 1365 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. శిథిలావస్థలో భవనాలు.. కార్యకర్తలు, ఆయాలకు చాలీచాలని జీతాలు. ఓటరు నమోదు బాధ్యతలు అప్పగించి వారితో వెట్టిచాకిరీ...నిత్యావసరాలకు నోచుకోని కిశోరబాలికలు..ప్రతి నెలా సక్రమంగా అందని పౌష్టికాహారం. ఇలా అన్నింటా సమస్యలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఈ కేంద్రాల పరిస్థితిని పరిశీలించడానికి సోమవారం విజిట్‌కు వెళ్లిన ‘సాక్షి’కి కఠిన వాస్తవాలెన్నో కనిపించాయి.
వెంకోజీపాలెం(విశాఖపట్నం): జిల్లా మహిళా,శిశు అభివద్ధిసంస్థ ఆధ్వర్యంలోని అంగన్‌వాడీ కేంద్రాలు అవస్థలతో అల్లాడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 25 సమగ్ర శిశు అభివద్ధి సేవా పథకం (ఐసీడీఎస్) ప్రాజెక్టుల పరిధిలో 3587 ప్రధాన, 1365 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కిశోరబాలికలకు సేవలందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలలో ఇందిరమ్మ అమతహస్తం పథకం కింద లబ్ధిదారులకు మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలుజరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ భోజనాలలో నాణ్యత నామమాత్రం. ముఖ్యంగా పాడేరు నియోజకవర్గంలో భోజనాలకు బదులుగా టేక్‌హోమ్ రేషన్ కింద పాతవిధానంలోనే సరకులు అందజేసి చేతులు దులుపుకుంటున్నారు. పలుకేంద్రాలకు 15 రోజులుగా గుడ్లు సరఫరా కాలేదు. పలు కేంద్రాల భవనాలు శిథిలావస్థలో ఉండడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. యలమంచిలి పరిధిలో మధ్యాహ్న భోజనాల తరువాత కేంద్రాలు మూతపడుతున్నాయి. కార్యకర్తలకు అదనపు విధుల భారంతో ఆయాలే వాటిని చూసుకోవాల్సి వస్తోంది. నర్సీపట్నం పరిధిలో రోజూ పిల్లల హాజరు తక్కువగానే ఉంటోంది. అద్దెభవనాలలో పారిశుధ్యం అధ్వానంగా ఉంటోంది. జిల్లాలోని సిబ్బంది చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారు. దీనికితోడు ఓటర్లనమోదు, పల్స్‌పోలియో, బోదకాలు నివారణ మాత్రల పంపిణీ వంటి అదనపు బాధ్యతలు తడిసిమోపెడవుతున్నాయి.
దీంతో కార్యకర్తలు అంకితభావంతో పనిచేయలేని పరిస్థితి నెలకొంది. పని ఒత్తిడి కారణంగా కార్యకర్తలు రోజూ సక్రమంగా పిల్లలకు పాఠాలు బోధించలేకపోతున్నారు. జిల్లాలో 389 కార్యకర్త,ఆయా పోస్టులు ఖాళీగా ఉండడంతో కొన్ని సింగిల్‌హ్యాండ్‌తోనే నిర్వహిస్తున్నారు. ఇలా ఇవి చాలావరకు తిండిపెట్టే కేంద్రాలుగానే వర్థిల్లుతున్నాయనడంలో అతిశయోక్తి కాదు. పలు గ్రామీణ నియోజకవర్గాల పరిధిలో కార్యకర్తలే ఆహార దినుసుల రవాణా ఖర్చులు భరించాల్సి రావడంతో తూకంలో యథేచ్ఛగా అవకవకలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వం విద్యుత్ బిల్లులకు నిధులివ్వకపోవడంతో కార్యకర్తల చేతిచమురు వదులుతోంది.గ్రామీణ అంగన్‌వాడీలలో పరిశుభ్రత గురించి ఎంతచెప్పినా తక్కువే అవుతుంది.