చెల్లని కార్డులు 1,27,936 | 1,27,936 invalid cards | Sakshi
Sakshi News home page

చెల్లని కార్డులు 1,27,936

Published Fri, Jan 3 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM

1,27,936 invalid cards

 చిగురుమామిడికి చెందిన నారాయణపురం హన్మంతు అనే నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. హౌసింగ్ ఏఈ రవీందర్‌రెడ్డి రేషన్‌కార్డు చూపించాలని కోరారు. హన్మంతు ప్రభుత్వం తనకు ఇచ్చిన రేషన్‌కార్డు (నంబర్ ట్యాప్ 205320608864)ను అందించాడు. ఏఈ ఆన్‌లైన్‌లో పరిశీలిస్తే సదరు కార్డు నంబరు కనిపించలేదు. దీంతో హన్మంతుకు మంజూరైన ఇల్లు రద్దవుతుందని చెప్పారు. గత్యంతరం లేక హన్మంతు డెప్యూటీ తహశీల్దార్ విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో తామేమీ చేయలేమని డీటీ బదులిచ్చారు. ఇలాంటి కార్డుల గురించి పై అధికారులకు నివేదించామని, తిరిగి ఉత్తర్వులు వచ్చేంత వరకు వేచిచూడాలని సూచించారు. ఇది ఒక్క హన్మంతు పరిస్థితే కాదు.. జిల్లావ్యాప్తంగా 1,27,936 కుటుంబాలదీ ఇదే వ్యథ.
 - న్యూస్‌లైన్, చిగురుమామిడి
 
 చిగురుమామిడి, న్యూస్‌లైన్ : జిల్లాలో గత నవంబర్‌లో జరిగిన మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో 1,27,936 మందికి కొత్తగా రేషన్‌కార్డులు జారీ చేసినట్లు ప్రజాప్రతినిధులు, అధికారులు గొప్పగా ప్రచా రం చేసుకున్నారు. కానీ కార్డుల స్థానంలో తాత్కాలిక కూపన్లు జారీ చేయడంతో అవి ఎందుకూ కొరగావడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కూపన్లపై కొన్ని చోట్ల రేషన్ సరుకులు ఇస్తుండగా, మరికొన్ని చోట్ల వాటికీ దిక్కులేదని ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డులతో లంకె పెట్టిన విషయం తెలిసిందే. సామాజిక పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, నివేశన స్థలాలు, సబ్సిడీగ్యాస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి ప్రభుత్వ పథకాలు కొత్త రేషన్‌కార్డులు పొందిన లబ్ధిదారులకు వర్తిం చడం లేదు. రేషన్‌కార్డులను తాత్కాలింకగా పనికి వచ్చేలా జారీచేయడంతో కార్డులు పొందిన కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఈ కార్డులు కేవలం రేషన్ సరుకుల కోసం తప్ప మరే అవసరానికీ ఉపయోగపడడం లేదని వాపోతున్నారు. కార్డులపై ఉన్న నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడంలేదని తిరస్కరిస్తున్నారు.
 
 దీంతో ఆయా కుటుంబాలకు సంక్షేమ పథకాల్లో చుక్కెదురవుతోంది. జిల్లావ్యాప్తంగా మొదటి, రెండో విడత రచ్చబండ కార్యక్రమాలతోపాటు జిల్లా, మండల స్థాయి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేశామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పుకున్నారు. ఇలాంటి కార్డులు జిల్లాలో 1,27,936 మంజూరు చేయగా, చిగురుమామిడి మండలంలో 1,074 కుటుంబాలకు అందించారు. తాత్కాలికంగా ఆయా కుటుంబాలకు అందించిన కార్డులు సంక్షేమ పథకాలకు వర్తించేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement