స్వయం సహాయక సంఘాలకు రూ. వెయ్యి కోట్లు | 1000 crores for dwcra groups | Sakshi
Sakshi News home page

స్వయం సహాయక సంఘాలకు రూ. వెయ్యి కోట్లు

Published Sat, Dec 14 2013 4:56 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM

1000 crores for dwcra groups

 ఏలూరు, న్యూస్‌లైన్: జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు రూ.వెయ్యి కోట్ల రుణాలందించాలని లక్ష్యంగా నిర్ణయించామని కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో వివిధ శాఖల పనితీరు, ఎంపీ లాడ్స్ వినియోగంపై అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షించారు. పట్టణ ప్రాంతాల్లో వచ్చే మార్చిలోగా రూ.87 కోట్లు, పల్లెల్లో రూ.913 కోట్లు రుణాలను అందించి మహిళల ఆర్థిక పురోభివృద్ధికి బ్యాంకులు దోహదపడాలన్నారు. జిల్లాలో మైనార్టీ కార్పొరేషన్ యూనిట్ల స్థాపనను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన కింద ఇచ్చే లబ్ధిని ఈ నెలాఖరు నాటికి ఇవ్వాలన్నారు. భూగర్భజలశాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు బోర్లు మంజూరు చేయాలని, వ్యవసాయ విద్యుత్ కనె క్షన్లు జారీలో జాప్యం లేకుండా  చూడాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ సూర్యప్రకాష్‌ను ఆదేశించారు. ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా, కుటుంబ నియంత్రణ లక్ష్యాలను అధిగమించేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
 ఎంపీ లాడ్స్ పనుల్లో జాప్యాన్ని సహించను
 పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి నిధులతో చేపట్టే పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం రాత్రి ఎంపీలాడ్స్ పనుల ప్రగతి తీరును ఆయన సమీక్షించారు. అపరిష్కృతంగా ఉన్న పనులను 2014 జనవరి, 31 నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు.
 వీఆర్‌ఏలకు రెండు నెలల అడ్వాన్స్
 సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న  వీఆర్‌ఏలకు ప్రభుత్వం రెండు నెలలకు రూ.7 వేలు ప్రత్యేక అడ్వాన్స్ ఇవ్వాలని ఆదేశించిందని, తహసిల్దార్లు ఆ మొత్తాలను వారికందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిద్ధార్థజైన్  శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.  
 భవన నిర్మాణ కార్మికులకు కొత్త బీమా పథకం
 ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్ ) : భవన నిర్మాణ కార్మికులుగా నమోదైన వారికి ప్రస్తుతం అమలవుతున్న ఆమ్ ఆద్మీ బీమా యోజన, జనశ్రీ బీమా యోజనతో పాటు మరోక సంక్షేమ పథకం కూడా ప్రభుత్వం అమలు చేస్తుందని కలెక్టర్ సిద్ధార్థజైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  పనిచేసే ప్రదేశంలో కాని ఇతర ప్రదేశాలలో గాని, నిర్మాణ సమయంలో గాయపడి ఆ గాయాలతో మరణించిన కార్మికుని కుటుంబానికి రూ.2 లక్షలు ఆర్థిక సహాయం అందుతుందన్నారు. శాశ్వత వికలాంగత్వానికి గురైన కార్మికునికి కూడా రూ. 2 లక్షల వరకు సహాయం అందుతుందని తెలిపారు.
 120 గ్రామాల్లో 12 వేల మరుగుదొడ్లు
 ఏలూరు : జిల్లాలో పల్లెనిద్ర-ప్రగతిబాట పేరిట 120 గ్రామాల్లో 12 వేల వ్యక్తిగత మరుగుదొడ్లను 2014 సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ లక్ష్యంగా నిర్ణయించారని డ్వామా పీడీ ఎన్. రామచంద్రారెడ్డి  తెలిపారు. వీటి నిర్మాణానికి అధికారులు కృషి చేయాలని కోరారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement