
జన్మభూమికి పింఛన్ల సెగ!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : గ్రామాల్లో పింఛన్ల రగడ మొదలైంది. అధికార పార్టీ నేతలు కక్షగట్టి తీసేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. నోటికాడ కూడును లాక్కున్నారని ఆగ్రహిస్తున్నారు. ఆవేదన ఆపుకోలేక జన్మభూమి కార్యక్రమంలో అధికారులను నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో గొడవలు జరిగే ఆస్కారముంది. గ్రామాలకొచ్చే అధికారులు, ప్రజాప్రతినిధులను బాధితులు చుట్టుముట్టే అవకాశం ఉందని ఇంటెలిజెన్‌స అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో ఎక్కడెక్కడ నిలదీసే అవకాశం ఉందో తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జన్మభూమికి ఆటంకం కల్గించొద్దని, అర్హుల జాబితాలో మళ్లీ చేర్చుతామని బాధితులను వేడుకుంటున్నారు. జిల్లాలో మొన్నటి వరకు 2లక్షల 79వేల 700మందికి పింఛన్లు అందేవి.
అయితే, ఇటీవల నిర్వహించిన పింఛన్ల పరిశీలన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 32వేల మందిని అనర్హులుగా తేల్చారు. వారందరికీ పింఛన్లు నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. అన్ని అర్హతలున్నా ఒక కుటుంబంలో ఒకరికే పింఛను ఇస్తామని ప్రభుత్వం నిబంధన పెట్టడంతో ఉమ్మడి కుటుంబంలో ఉన్న వేలాది మంది వృద్ధులు, వికలాంగులు పింఛన్లకు దూరమవుతున్నారు. అలాగే, భర్త చనిపోయినట్టు ధ్రువీకరణ పత్రాలు చూపించలేదన్న సాకుతో వేలాది మంది వితంతువుల పింఛన్లు కూడా నిలిపేశారు.
జిల్లాలో ఏ గ్రామానికెళ్లినా ఇదే గోడు వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలో గ్రామాల్లో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సందర్భంలో జన్మభూమి కార్యక్రమం జరుగుతుండడంతో తమ కు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు బాధితులకు మంచి అవకాశం దొరికినట్టు అయ్యింది. గ్రామానికి వచ్చే అధికారులు, ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకోవచ్చని, అవసరమైతే నిలదీయవచ్చని భావిస్తున్నారు. బాధితులకు అండగా నిలుస్తామని ఇప్పటికే విపక్షాలు భరోసా ఇచ్చాయి. దీంతో జన్మభూమిలో గొడవలు జరిగే అవకాశం ఉందని, గతంలో మాదిరి గా అధికార బృందాలను చుట్టుముట్టొచ్చన్న క్షేత్రస్థాయి పరిస్థితులను ఇంటెలిజెన్‌స పోలీసులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.
ఇప్పటికే బాధితులు కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు వచ్చి ఆందోళనలు చేశారని, ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ నోటికొచ్చినట్టు తిడుతున్నారని, పత్రికల్లో కూడా పెద్ద ఎత్తున కథనాలొచ్చాయని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారాన్ని చేరవేసినట్టు తెలిసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆవేదనతో ఉన్న బాధితులకు నచ్చచెప్పాలని, ఒకవేళ అర్హులై ఉండి తొలగింపు జరిగితే మళ్లీ చేరుస్తామంటూ సర్దిచెప్పి పరిస్థితులను అదుపులోకి తెచ్చే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్టు తెలిసింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి ఆందోళన చేసే అవకాశం ఉన్న పింఛను బాధితులను కలుస్తున్నారు. జన్మభూమి ప్రశాంతంగా జరిగిపోవాలన్న ఉద్దేశంతో న్యాయం చేస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
దీనికి ఉదాహరణ...బొబ్బిలి మం డలం ఎరకందొరవలస గ్రామానికిచెందిన బడ్నాన అప్పలస్వామి(70), నరసమ్మ(66) దంపతులకు రేషన్‌కార్డులో వయస్సు తక్కువ ఉందని పింఛను తీసేయగా, వీరికి జరిగిన అన్యాయాన్ని ‘సాక్షి’ మెయిన్ పేజీలో ‘పెన్షనర్ల గుండెల్లో టెన్షన్’శీర్షికతో ప్రచురించింది. దీంతో ప్రభుత్వ ఉన్నతాధికారులు రంగంలోకి జిల్లా అధికారులను వివరణ కోరినట్టు తెలిసింది. దీంతో యుద్ధప్రాతిపదికన ఎరకందొరవలస గ్రామ కార్యదర్శిని బాధితుల వద్దకు పంపించి, పింఛను వచ్చేసిందని చెప్పండని, అర్హుల జాబితాలో చేర్చుతామని, జన్మభూమిలో ప్రస్తావించొద్దని చెప్పినట్టు తెలియవచ్చింది. అయితే, బాధిత దంపతులు జన్మభూమిలో కచ్చితంగా నిలదీస్తామని చెప్పారు. ఇదే తరహాలో మిగతా ప్రాం తాల్లో ఆగ్రహంతో ఉన్న పింఛను బాధితులను అధికారులు కలిసే ప్రయత్నం చేస్తున్నారు. జన్మభూమికి ఆటంకాలు కలగకుండా పోలీసుల సాయంతో నిర్వహించాలని చూస్తున్నారు. మొత్తానికి గ్రామాల్లో నెలకొన్న పింఛన్ల రగడతో జన్మభూమిలో ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయోనన్న భయం అధికారులకు పట్టుకుంది.