దోచుకున్నోళ్లకు దోచుకున్నంత!
సాక్షి ప్రతినిధి, కడప : ‘నీరు-చెట్టు’ పనుల్లో చోటు చేసుకుంటున్న అవకతవకల ఉదంతానికి ఇదో చక్కటి ఉదాహరణ. నీటి సంరక్షణ చర్యల పేరుతో జిల్లాలో అధికార పార్టీ నేతల జేబులు నింపేదిశగా అధికారుల చర్యలున్నాయి. పాడుబడ్డ వంకలు, వాగులు టీడీపీ నేతలు, కార్యకర్తలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తక్కువ ఖర్చు, శ్రమ తక్కువ, ఎక్కువ లాభం అన్నట్లుగా ఈ పనులు కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.26 కోట్లతో ప్రారంభమైన పనులన్నీ దాదాపు పైన పేర్కొన్న రీతిలోనే సాగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెద్దగా ఉపయోగం లేని పనులకు కోట్లాది రూపాయలిలా ఖర్చు చేస్తున్నారు. ఎక్కువ ఉపయోగం ఉన్న చెరువుల్లో పూడికతీత పనులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, వంకల్లో పూడికతీతకు పెద్ద పీట వేయడం అనుమానాలకు తావిస్తోంది.
మైదుకూరులో 15 శాతం ఖర్చుతో పనులు పూర్తి
వర్షపు నీరు సహజంగానే వాగులు, వంకల ద్వారా చెరువులకు చేరుతోంది. అయితే టీడీపీ నేతల భుక్తి కోసం చెరువులకు నీరు వెళ్లే మార్గాలను శుభ్రపరిచే పనులు చేపట్టారు. అవసరం లేని పనులకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా రూ.3 కోట్లతో పనులు చేపట్టారు. ఈ పనులు ప్రస్తుతం టీడీపీ నేతల దోపిడీకి మార్గమయ్యాయి. మంజూరైన నిధుల్లో కేవలం 15 శాతం ఖర్చుతో పనులు పూర్తి అవుతున్నాయి. మరో 30 శాతం వరకూ అధికారులకు పర్సెంటేజీ ఇవ్వాల్సి ఉందని సమాచారం. తక్కిన మొత్తం టీడీపీ నేతల జేబుల్లోకి వెళుతోంది. అంటే రూ.1లక్ష పనిచేస్తే రూ.50 నుంచి రూ.60 వేల ఆదాయం దక్కుతోంది. దాంతో ఈ పనుల కోసం వారు ఎగబడుతున్నారు. 60 సెంటీ మీటర్లు వంకల్లో పూడిక తీయాల్సి ఉండగా ముళ్లపొదలను తొలగించి డబ్బులు దండుకుంటున్నారు. బ్రహ్మంగారి మఠం మండలంలో ప్రస్తుతం నీరు-చెట్టు పనులు అత్యంత అధ్వానంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మండల వ్యాప్తంగా 25 పనులకుగాను రూ.1.92 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
చక్రం తిప్పుతోన్న ఏఈ
ఆయన సొంత మండలం బి.మఠం. 30 ఏళ్లుగా అదే మండలంలో వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లుగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ పంచన చేరుతాడు. ప్రస్తుతం ఇరిగేషన్ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన అన్ని పార్టీల రాజకీయ నేతగా చలామణి అయ్యారు. అధికారం రావడంతో ప్రస్తుతం టీడీపీతో జట్టు కట్టారు. నీరు-చెట్టు నిధులు ఎల వేసి స్వయంగా ఆయనే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. మైదుకూరు టీడీపీ ఇన్‌ఛార్జి మెప్పు కోసం కొత్తపల్లె, పలుగురాళ్లపల్లె, ముడుమాల, గుండాపురం, నేలటూరు, కమ్మవారిపల్లెలలో అతి తక్కువ ఖర్చుతో టీడీపీ నేతలకు లక్షలాది రూపాయాలు దోచి పెట్టుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ‘నీరు-చెట్టు’లో దోపిడీపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి పలు ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ విభాగం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.