17,275 ఎకరాల్లో నివాస సముదాయాలు
♦ ఆరు జోన్లుగా వాణిజ్య ప్రాంతం
♦ నేడు రాజధాని మాస్టర్‌ప్లాన్ నోటిఫికేషన్ జారీ!
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతి నగరాన్ని నిర్మించే మొత్తం భూమిలో అత్యధికంగా 23 శాతాన్ని నివాస సముదాయాలుగా ఏర్పాటు చేయనున్నారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో ఈ మేరకు ప్రతిపాదించారు. 14 శాతం భూమిని మౌలిక సదుపాయాలు, 19 శాతాన్ని పార్కులు, ఖాళీ స్థలాలకు, ఆరుశాతాన్ని ప్రస్తుతమున్న గ్రామాలకు, రెండు శాతాన్ని మిశ్రమ వినియోగానికి, పదిశాతం భూముల్ని వాణిజ్య అవసరాలకు, ఆరుశాతాన్ని కాలుష్యంలేని పరిశ్రమలకు, పదిశాతాన్ని జలవనరులకు, తొమ్మిదిశాతం భూమిని పౌర అవసరాల(సివిక్ ఎమినిటీస్)కు వినియోగించాలని భూమి వినియోగ ప్రణాళికలో పేర్కొన్నారు.
ఈ లెక్కప్రకారం 17,275 ఎకరాల్లో నివాస భవనాలు, సముదాయాలు నిర్మించనున్నారు. 8,462 ఎకరాల్లో వాణిజ్యప్రాంతం, పరిశ్రమలు నెలకొల్పాలని, 4,875 ఎకరాల్లో పౌర అవసరాలు(సివిక్ ఎమినిటీస్), 15,975 ఎకరాల్లో పార్కులు, ఖాళీ స్థలాలకు కేటాయించారు. సింగపూర్ ఇచ్చిన మాస్టర్‌ప్లాన్‌కు మెరుగులు దిద్ది సీఆర్‌డీఏ నోటిఫికేషన్ జారీ చేయడానికి సిద్ధమైంది. శుక్రవారమే ఇవ్వాలనుకున్నప్పటికీ సీఎం మార్పులు సూచించడంతో శనివారం నోటిఫికేషన్ విడుదలకు సీఆర్‌డీఏ సన్నద్ధమవుతోంది.నెలరోజులపాటు ప్రజలనుంచి అభిప్రాయాల్ని సేకరించి మార్పులుంటే చేర్చి తుది మాస్టర్‌ప్లాన్‌ను ఆమోదించనుంది.
సింగపూర్ ప్రభుత్వసంస్థ సుర్బానా రాజధాని రీజియన్‌కు కాన్సెప్ట్ ప్లాన్, రాజధాని నగరానికి మాస్టర్‌ప్లాన్, తొలుత అభివృద్ధి చేసేప్రాంతానికి సీడ్ ప్లాన్‌ను ప్రభుత్వానికి సమర్పించడం తెలిసిందే. చివరిగా సీడ్ మాస్టర్‌ప్లాన్‌ను జూలైలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రభుత్వానికి అందించారు. వీటిలో కీలకమైన రాజధాని నగరం,సీడ్ ప్లాన్‌లో లోపాలుండడంతో సరిచేసేందుకు సీఆర్‌డీఏ కసరత్తు చేసింది. చైనాకు చెందిన జీఐఐసీ సంస్థనూ భాగస్వామ్యం చేసి మార్పులు చేసింది.ఈ ప్లాన్‌కోసం రాజధాని ప్రాంతీయులు ఎదురుచూస్తున్నారు.
మాస్టర్‌ప్లాన్‌లోని ఇతర ముఖ్యాంశాలివీ..
► నివాసప్రాంతాన్ని ఆర్-1, ఆర్-2, ఆర్-3, ఆర్-4 సెక్టార్లుగా విభజించారు. ఆర్-1లో ప్రస్తుతమున్న గ్రామ కంఠాలు, ఆర్-2లో సాధారణ ప్రజలకు జీ+7 భవనాలు, ఆర్-3లో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకోసం జీ+15 భవనాలు, ఆర్-4లో విల్లాలు, పెద్ద భవంతులు నిర్మించాలని పేర్కొంది.
► వాణిజ్య ప్రాంతాల్ని ఆరుజోన్లుగా విభజించి బహుళ ప్రయోజన పరిశ్రమలకోసం పీ-1, సాధారణ పరిశ్రమలకు పీ-2, పీ-3 జోన్లు, పీ-4లో టౌన్ సెంటర్ జోన్, పీ-5లో రీజినల్ సెంటర్ జోన్, పీ-6లో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
► మణిపాల్ ఆస్పత్రి వెనుకనుంచి సీతానగరం, ఉండవల్లి మీదుగా బోరుపాలెం వరకూ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రతిపాదిం చారు.పీడబ్ల్యూడీ వర్క్‌షాపు, గణపతి సచ్చిదానంద ఆశ్రమం ఎదురు, రాయపూడి మీదుగా బోరుపాలెం వరకూ ఈ హైవేను నిర్మిస్తారు.
► వెంకటపాలెం, రాయపూడి, తుళ్లూరు ప్రాంతాలను కలుపుతూ రాజధాని నగరంలో రెండు రైలుమార్గాల్ని డిజైన్‌లో చూపించారు.
► వెంకటపాలెం, నీరుకొండ, పెద్దమద్దూరు వద్ద రిజర్వాయర్లను ప్రతిపాదించారు. నీరుకొండ రిజర్వాయర్ నుంచి అమరావతి ప్రభుత్వ భవన సముదాయానికి నీటిని సరఫరా చేయాలని సూచించారు.
► ఉండవల్లి నుంచి కృష్ణాయపాలెం వరకూ గ్రీన్‌బెల్ట్ ఏర్పాటుకానుంది.
► ఉండవల్లి గుహల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ ఉద్యానవనాలు, అమరావతి టౌన్‌షిప్, నిడమర్రు, అనంతవరం, బోరుపాలెం వద్ద పారిశ్రామికవాడలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాన్‌కు మరికొన్ని మార్పులు చేసి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.