విశాఖ హోంగార్డులపై కక్ష సాధింపు | 2 months of severe difficulties to Home Guards | Sakshi
Sakshi News home page

విశాఖ హోంగార్డులపై కక్ష సాధింపు

Published Sat, Apr 27 2019 4:22 AM | Last Updated on Sat, Apr 27 2019 4:22 AM

2 months of severe difficulties to Home Guards - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: పోలీసులతో సమానంగా పనిచేస్తున్న హోంగార్డులపై విశాఖ నగర పోలీసు ఉన్నతాధికారులు కొంతమంది కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి. క్షేత్రస్థాయిలో తాము చెప్పిన పార్టీకి అనుకూలంగా పనిచేయలేదనే కారణంతో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుకూలురనే ముద్ర వేసి 52 మంది హోంగార్డులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచారు. ఆ తర్వాత వివిధ కారణాలు చూపుతూ వారిని ఆర్టీసీ విభాగంలో విధులకు కేటాయించారు. అయితే వారికి తగినంత వేతనం ఇవ్వలేమంటూ ఆర్టీసీ యాజమాన్యం చేతులు ఎత్తేయడంతో వారంతా త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. 2 నెలలుగా వేతనాలు లేకుండా జీవనం సాగిస్తున్న దుస్థితి వారిది. తాము ఏ తప్పూ చేయకపోయినా విధుల నుంచి తొలగించి ఇబ్బందులు పెట్టడం అన్యాయమంటూ వారంతా వాపోతున్నారు. ఉన్నతాధికారుల వద్ద విన్నవించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు ఇప్పటికైనా హోంగార్డులకు న్యాయం చేయాలని బాధిత కుటుంబీకులు వేడుకుంటున్నారు. 

కమిషనరేట్‌ ప్రాంగణంలోకి రానివ్వకుండా అడ్డు.. 
విశాఖపట్నం నగర పరిధిలో 1,196 మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 875 మంది జనరల్‌ విధుల్లో ఉండగా.. మరో 321 మంది డెప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ఇటీవల వీరిలో 52 మంది హోంగార్డులను ఎన్నికల ముందు జనరల్‌ విధుల నుంచి బదిలీ చేస్తూ ఆర్టీసీ విభాగానికి కేటాయించారు. అయితే అక్కడ హోంగార్డులకు ఇచ్చే రోజువారీ వేతనం రూ. 600లు ఇవ్వలేమని.. కేవలం రూ. 400లే ఇస్తామని ఆర్టీసీ యాజమాన్యం తేల్చిచెబుతూ వారిని వెనక్కి పంపింది. దీంతో అటు ఎన్నికల విధులకు హాజరుకాలేక.. ఇటు ఆర్టీసీలో పనిచేయలేక రెండు నెలలుగా వారంతా విధులకు దూరంగా ఉంటున్నారు. దీంతో వారికి వేతనాలు అందలేదు. న్యాయం చేయాలని ఉన్నతాధికారులకు విన్నవించుకోవడానికి వెళ్లగా.. కనీసం కమిషనరేట్‌ ప్రాంగణంలోకి వారిని రానివ్వకుండా ఓ పోలీసు ఉన్నతాధికారి అడ్డుకోవడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. కేవలం వీరంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరులనే కారణంగానే వారిని త్రిశంకు స్వర్గంలో ఉంచినట్లు  ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

హాంగార్డుల నుంచి మాముళ్లు
వివిధ పోలీసుస్టేషన్లు, ట్రాఫిక్, జనరల్, డ్రైవర్లుగా పనిచేసే హోంగార్డులకు ప్రతినెలా విధులు మార్చాలని జీవో ఉన్నప్పటికీ అది రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదు. కొందరు ఉన్నతాధికారులు తమ పనుల కోసం వారిని వినియోగించుకుంటూ ఒకే చోట కొనసాగేలా చేసుకుంటున్నారు. విశాఖ సిటీ పరిధిలో పనిచేస్తున్న హోంగార్డులకు ఏసీపీ నేతృత్వం వహిస్తారు. ప్రతి 45 మంది హోంగార్డులకు ఒక హెడ్‌కానిస్టేబుల్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు. వీరిపై ఓ ఆర్‌ఐ ఇన్‌చార్జిగా ఉంటారు. అయితే ఆర్‌ఐకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే డ్యూటీ వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోంగార్డుల నుంచి నెలవారీ మామూళ్లు కూడా వసూలు చేస్తున్నారని ఆ శాఖ వర్గీయులే గుసగుసలాడుకోవడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement