సాక్షి, ఒంగోలు : జిల్లాలో ఈ ఏడాది రహదారులు రక్తంచిందాయి. వాహన ప్రమాదాలతో వందల మంది మృత్యువాతపడ్డారు. అదేస్థాయిలో గాయాలపాలయ్యారు. రైళ్లు సైతం ప్రయాణికులపై పగబట్టాయి. పట్టాలపై ఎంతోమందిని విగతజీవులుగా మార్చాయి. భారీ వర్షాలు కూడా ప్రజలను పొట్టనపెట్టుకున్నాయి. వరదల్లో చిక్కుకుని, వాగుల్లో గల్లంతై పలువురు ప్రాణాలు విడిచారు. ఈత సరదా..అనేకమంది చిన్నారులను బలితీసుకుంది. కేవలం ఈ నెలలోనే నలుగురు విద్యార్థుల ఉసురుతీసింది. 24వ తేదీ కందుకూరు మండలం మహదేవపురం పంచాయతీ పరిధిలోని మాల్యాద్రికాలనీలో చెందూరి సిద్ధార్థ (12) ఈతకు వెళ్లి కుంటలోపడి మృతిచెందగా, ఆ తర్వాతరోజే వలేటివారిపాలెం మండలం శ్యామీరపాలెంలో పాలడుగు వెంకటనాగరాజు (12), వంశీ (9)లు తూమలేరు వాగులోని కుంటలో ఈత కొట్టేందుకు దిగి మునిగిపోయి మరణించారు.
అదేరోజు అద్దంకి మండలం వెంపరాల గ్రామంలో పదో తరగతి విద్యార్థి కంచర్ల రాంబాబు గుండ్లకమ్మలో ఈతకు వెళ్లి మృతిచెందాడు. ఇలాంటి సంఘటనలు ఇంకా అనేకం చోటుచేసుకున్నాయి. వీటితో పాటు మోసాలు, అపహరణలు, నగదు డిపాజిట్లు..అధిక వడ్డీల పేరుతో చీటింగ్‌లు, బైక్ చోరీలు, చైన్‌స్నాచింగ్‌లతో నేరగాళ్లు రెచ్చిపోయారు. జిల్లాలో సుమారు 10 ప్రైవేట్ సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించకుండా బోర్డులు తిప్పేశాయి. అగ్నిప్రమాదాల్లో 11 మంది మరణించగా, కోట్ల రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది.
180 మందిని బలితీసుకున్న రైలు ప్రమాదాలు...
జిల్లాలో ఈ ఏడాది జరిగిన రైలు ప్రమాదాల్లో మొత్తం 180 మంది మరణించారు. పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని కొంతమంది, రైలులో తలుపుల వద్ద కూర్చుని ప్రమాదవశాత్తూ పట్టాలపైపడి ఇంకొంతమంది, కదులుతున్న రైళ్లు ఎక్కబోయి మరికొంతమంది ప్రమాదాలకు గురయ్యారు.
71 మంది హతం...
జిల్లాలో మానవత్వం మంటగలుస్తోంది. మనిషిని మనిషే చంపుకునే సంస్కృతి పెరిగిపోతోంది. ఈ ఏడాది జిల్లాలో 71 మంది హత్యకు గురికాగా, వారిలో 31 మంది మహిళలు ఉన్నారు. వివాహేతర సంబంధాలు, డబ్బుపై మోజు, పాతగొడవలు, అనుమానాలే అందుకు ప్రధాన కారణంగా ఉన్నాయి.
224 గృహహింస కేసులు.. 8 వరకట్న మరణాలు...
జిల్లాలో ఈ ఏడాది 224 గృహహింస కేసులు నమోదు కాగా, 8 వరకట్న మరణాలు సంభవించాయి. ఇవన్నీ అధికారిక లెక్కల ప్రకార మే. కేసుల వరకూ రాని వేధింపులు కోకొల్లలుగా ఉన్నాయి. మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోంది. గృహహింస నివారణ, నిర్భయ చట్టాలు సైతం మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నాయి. భర్త, అత్తమామలే శత్రువులుగా మారుతున్నారు. రోడ్లపై అర్ధరాత్రి కాదుకదా..పట్టపగలు ఇళ్లలో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. నిత్యం ఏదోకచోట రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే మహిళలు చైన్‌స్నాచింగ్‌కు గురవుతున్నారు. ఈ ఏడాది కందుకూరు, ఒంగోలు ప్రాంతాల్లో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయి పోలీసులకు సవాల్ విసిరారు.
219 గృహచోరీలు...
జిల్లాలో గత జనవరి నుంచి ఇప్పటి వరకూ 219 గృహాల్లో చోరీలు జరిగినట్లు కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదుకాని చిన్నాచితకా చోరీలు అనేకం ఉన్నాయి. ఇళ్లలోనే కాకుండా దుకాణాలు, బంకులు, షాపుల్లో 646 చోరీలు జరిగాయి. లక్షల రూపాయల్లో సొత్తు అపహరణకు గురైంది. ఇళ్లు, షాపులకు తాళాలువేసి రెండుమూడు రోజులు ఎక్కడికైనా టూర్ వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. చోరీలతో పాటు దోపిడీలూ జరుగుతున్నాయి. ఇళ్లలో పడి దాడిచేసి గాయపరిచి బెదిరించి మరీ దోచుకుంటున్నారు.
మహిళలపై అఘాయిత్యాలూ అధికమే...
మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి ఈ ఏడాది 34 కేసులు నమోదయ్యాయి. కేవలం మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడి ఒంగోలు నగరంలోని జిల్లా జైలులో 72 మంది నిందితులు శిక్ష అనుభవిస్తున్నారంటే ఈ రకం నేరాలు జిల్లాలో ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. లైంగికదాడులకు గురైన అనేకమంది.. బయటకు తెలిస్తే భవిష్యత్తుకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఫిర్యాదు చేయకపోవడంతో ఇంకా అనేక సంఘటనలు వెలుగులోకి రావడం లేదు. ఇలాంటి సంఘటనలు గ్రామాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి.
రక్తం తాగుతున్న రహదారులు...
ఈ ఏడాది జిల్లాలోని పలు రహదారులపై 1,463 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 445 మంది దుర్మరణం పాలయ్యారు. 500 మందికిపైగా తీవ్ర గాయాలకు గురయ్యారు. మద్యం సేవించి వాహనాలు నడపటం, అతివేగం ప్రధాన కారణాలు కాగా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, డ్రైవర్లకు విశ్రాంతి లేకపోవడం వల్ల కూడా అనేక వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. వందల మంది మృతిచెంది వారి కుటుంబాలు రోడ్డున పడుతుండగా, గాయాలపాలైన వారు వికలాంగులుగా మారుతున్నారు. జీవితాంతం నరకం అనుభవిస్తున్నారు.
బోర్డు తిప్పేసిన సంస్థలు...
జిల్లా ప్రజలు ఈ ఏడాది పెద్దఎత్తున బోగస్ సంస్థల బారినపడ్డారు. తాము దాచుకున్న మొత్తాన్ని కోల్పోయారు. మాయమాటలు చెప్పి సంస్థల్లో పెట్టుబడులు, డిపాజిట్లు చేయించుకున్న అనేక సంస్థలు బోర్డు తిప్పేసి ప్రజలను నిలువునా మోసం చేశాయి. ఈ ఏడాది జిల్లాలో అక్షర గోల్డ్, ఎన్‌మార్ట్, ప్రగతి, నక్షత్ర, ఆర్‌ఎంపీ, మైత్రీ, సంచయ ఇన్‌ఫ్రాలు బోర్డు తిప్పేశాయి. అదే విధంగా కోట్లాది రూపాయలకు కుచ్చుటోపీ పెట్టి చీటీల నిర్వాహకులు మొహంచాటేశారు.
59.30 శాతం రికవరీలు...
చోరీలు, దోపిడీలు, మోసాలపై నమోదైన కేసులకు సంబంధించి ఈ ఏడాది జిల్లాలో 59.30 శాతాన్ని పోలీసులు రికవరీ చేశారు. గతంతో పోలిస్తే రికవరీ శాతం బాగానే ఉన్నప్పటికీ దొంగతనాలను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు.
నేరం..ఘోరం
Published Tue, Dec 31 2013 3:04 AM | Last Updated on Sat, Aug 11 2018 8:45 PM
Advertisement