ఒకటి నుంచి అయిదో తరగతి వరకూ ఉర్దూ నేర్చుకోవాలి. ఆరో తరగతి నుంచి మాత్రం తెలుగు నేర్చుకోవాలి. కానీ ఎక్కడా ఉర్దూ బోధించే ఉపాధ్యాయుల్లేరు.
ఒకటి నుంచి అయిదో తరగతి వరకూ ఉర్దూ నేర్చుకోవాలి. ఆరో తరగతి నుంచి మాత్రం తెలుగు నేర్చుకోవాలి. కానీ ఎక్కడా ఉర్దూ బోధించే ఉపాధ్యాయుల్లేరు. ఫలితంగా ముస్లింలున్న గ్రామాల్లో విద్యార్థులు ఏ భాషలోనూ పట్టు సాధించడం లేదు. రెంటికీ చెడ్డ రేవడి అయ్యారు. జిల్లావ్యాప్తంగా ఏడు ముస్లిం గ్రామాల్లో ఆరేళ్లుగా ఉర్దూ ఉపాధ్యాయుల్లేరు. ముస్లిం విద్యార్థులు మాతృభాషకు నోచుకోవడం లేదు.
నక్కపల్లి, న్యూస్‌లైన్: జిల్లాలో ఉర్దూ బోధించే పాఠశాలలు 35 ఉన్నాయి. వీటిలో 31 ప్రాథమిక, 4 ఉన్నత పాఠశాలలున్నాయి. ఆరు నుంచి 10 వరకు పూర్తిగా ఉర్దూ భాషలో బోధించే ఉన్నత పాఠశాల పెదగంట్యాడ మండలం ఇస్లాంపేటలో ఉంది.
ఆరేళ్లుగా ఉర్దూ ఉపాధ్యాయుల్లేరు
ముస్లింలు నివసించే గ్రామాల్లో ఉర్దూ పాఠశాలలను నెలకొల్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉర్దూ పాఠశాలల్లో 26 ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లోని 7 ముస్లిం గ్రామాలైన పెదదొడ్డిగల్లు, పెదబోదిగల్లం, అప్పలపాయకరావుపేట, చినబోదిగల్లం, రామకృష్ణాపురం, సీతారాంపురం, చెల్లాపురం పాఠశాలల్లో పరిస్థితి మరీ దారుణం. ఈ పాఠశాలల్లో ఆరేళ్లుగా ఉర్దూ బోధించే ఉపాధ్యాయుల్లేరు.
ఒక్కొక్క పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాల్సి ఉండగా, గత ఏడాది వరకు ఇక్కడ నియామకాలు చేపట్టలేదు. ఈ ఏడాది భర్తీ చేసినా ఒక్కొక్కరిని మాత్రమే నియమించారు. ఆరేళ్లుగా ఇక్కడ చదివిన విద్యార్థులు మాతృభాషకు నోచుకోలేదు.
రెంటికీ చెడ్డ రేవడి
ఎలిమెంటరీ వరకు ఇక్కడ ఉర్దూలోనే బోధించాలి. ఇంట్లో ఉర్దూ మాట్లాడుతూ పాఠశాలలో తెలుగు నేర్చుకోవడం విద్యార్థులకు కష్టమవుతోంది.
అరకొరగా నేర్చుకున్నా ఆరో తర గతిలో ప్రవేశించాక ఉర్దూను కొనసాగించేందుకు ఉపాధ్యాయులు ఉండటం లేదు.
ఏటా ఈ గ్రామాల్లో సుమారు 200 మంది ముస్లిం విద్యార్థులు ఎలిమెంటరీ నుంచి హైస్కూల్ స్థాయికి వెళ్తున్నారు.
పెదబోదిగల్లంలో జెడ్పీ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. పాఠశాలలో సుమారు 50 మంది ఉర్దూ విద్యార్థులున్నారు. ఇక్కడ తెలుగు మీడియంలోనే బోధిస్తారు.
ఉర్దూ మీడియంలో చదివిన విద్యార్థులు హైస్కూల్ స్థాయిలో ఉపాధ్యాయుల్లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సగం విద్యాసంవత్సరం అక్షరాలు నేర్పించేందుకే సరిపోతోందని హైస్కూలు ఉపాధ్యాయులు చెబుతున్నారు.
పెదబోదిగల్లం హైస్కూల్లో లాంగ్వేజ్ సబ్జెక్ట్‌గా ఉర్దూను ప్రవేశపెట్టి ఉపాధ్యాయుడ్ని నియమిస్తే సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందని ఉపాధ్యాయులు అంటున్నా రు. వీరికోసం ప్రత్యేకంగా ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయడం లేదా హైస్కూళ్లలో తెలు గు, హిందీ మాదిరిగా ఉర్దూను కూడా లాం గ్వేజిగా చేసి ఉపాధ్యాయుడ్ని నియమించాలని ఈ ప్రాంత ముస్లింలు కోరుతున్నారు.
ఉర్దూకు దూరమవుతున్న విద్యార్థులు
ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ముస్లిం విద్యార్థులు మాతృభాషకు దూరమవుతున్న విషయం వాస్తవమే. నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లోని ైెహ స్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్లుగా ఉర్దూ ఉపాధ్యాయులను నియమించాలని, ఇక్కడ ఒక ఉర్దూ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపించాం.
- ఎమ్‌డీ గౌస్‌లాలీ, ఏఎంవో, ఆర్‌వీఎం(ఉర్దూ)