దివంగత ముఖ్యమంత్రి కలల సౌధమైన రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (రిమ్స్) కష్టాలను ఎదుర్కొంటోంది.
సాక్షి కడప : దివంగత ముఖ్యమంత్రి కలల సౌధమైన రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (రిమ్స్) కష్టాలను ఎదుర్కొంటోంది. మెరుగైన వసతులతోపాటు అత్యాధునిక పరిజ్ఞానంతో నెలకొల్పిన రిమ్స్‌లో బోధించే అధ్యాపకులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో వైద్య విద్య పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అటు విద్యార్థులతోపాటు ఇటు రోగులకు ఉత్తమ సేవలు అందాలంటే భారీగా ఏర్పడిన పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే టీడీపీ సర్కార్ వైఎస్సార్‌జిల్లాపై వివక్ష చూపుతున్నదన్న ఆరోపణలున్న నేపధ్యంలో రిమ్స్‌పై ఏమాత్రం శ్రద్ధ కనబరుస్తునన్నదే అందరి మదిలో తొలుస్తున్న ప్రశ్న.
వైఎస్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే తనను ఎంతో ఆదరించిన కడప జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఏడాది పూర్తికాక ముందే కడప నగర శివార్లలో రిమ్స్ కలల సాకారానికి పునాదులు వేశారు. 2005-06లో మొదటి బ్యాచ్ వైద్య విద్యార్థులు విద్యనభ్యసించేందుకు చొరవ తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి కేబినేట్ సమావేశంలో కడపతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పిన రిమ్స్‌ల అభివృద్ది కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
రిమ్స్ వైద్య కళాశాలలో అధ్యాపకుల కొరత కొట్టొచ్చినట్లు కనపడటంతో విద్యార్థుల, రోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 2007లో సెమీ అటానమస్ విధానాన్ని తీసుకొచ్చారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం తనిఖీలకు వచ్చినపుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులతో తీర్చిదిద్దారు. కడప రిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చి దిద్దేందుకు అప్పట్లో ప్రభుత్వం కృషి చేసింది, నగర శివార్లలోని పుట్లంపల్లె ప్రాంతంలో పాపికొండలకు సమీపంలో రిమ్స్ సముదాయం కోసం 230 ఎకరాలను కేటాయించారు. 750 పడకలకు సరిపడే విధంగా ఐపీ భవనంలో విభాగాలను కేటాయించారు. అత్యవసర విభాగాల దగ్గర నుంచి ప్రతి విభాగానికి సంబంధించిన వార్డులను విస్తరించేలా సౌకర్యాలు కల్పిస్తూ వచ్చారు.
299కి పనిచేస్తున్నది 94 మందే!
ఓపీ, కళాశాల విభాగాలలో ట్యూటర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లను నియమించుకునేలా సౌకర్యాలు క ల్పించారు. ైవె ద్య విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రధానంగా 18 విభాగాలు అవసరం. మరో ఆరు విభాగాలకు కలుపుకుని మొత్తం 299 మంది అధ్యాపకులు అవసరమైతే వారిలో కేవలం 94 మంది మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు.
సెమీ అటానమస్‌లో భాగంగా నియమితులైన అధ్యాపకులు దాదాపు ఎక్కువ మంది మార్చి, ఆగస్టు నెలల చివరినాటికి కాంట్రాక్టు కాల పరిమితి ముగిడయంతో వారు వెళ్లిపోయారు. దీంతో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ యేడాది జనవరి నుంచి కొరత ఎక్కువైంది. సెమీ అటానమస్ విధానం సమయంలో డెరైక్టర్‌ను కూడా నియమించారు. ప్రస్తుతం డెరైక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్ సిద్దప్ప గౌరవ్ పదవీ కాలం ఈ నెల 16వ తేదీకి ముగియనుంది.
9వ బ్యాచ్‌కు చేరుకున్న వైద్య విద్య
ఇప్పటికి 8 బ్యాచుల్లో 3 బ్యాచుల వారు వైద్య విద్య కోర్సును పూర్తి చేసుకుని పలుచోట్ల డాక్టర్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం 2014-15 బ్యాచ్‌కు ఇటీవల మెడికల్ కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. ప్రతి సంవత్సరం150 మంది వైద్య విద్యార్థులు, 20 మంది పీజీ విద్యార్థులు చేరేందుకు రిమ్స్‌లో అవకాశముంది.
9వ బ్యాచ్ వైద్య విద్యార్థులకు ఈ నెల 1వ తేదీ నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ద్వితీయ సంవత్సరం పీజీ విద్యార్థులు 17 మంది చేరారు. 205 ఖాళీలు కేవలం వైద్య, అధ్యాపక బృందానికి సంబంధించినవి ఉన్నాయి. సెమీ అటానమస్ విధానం మరలా ప్రభుత్వం రెన్యువల్ చేస్తే సమస్య లేకుండా పోతోంది. రాష్ట్ర విభజన జరిగిన నేపధ్యంలో వైద్యులను కూడా విభజిస్తే ఉన్న వాళ్లలో చాలామంది సీనియారిటీ ప్రకారం పదోన్నతులు లభించి రిమ్స్‌కు వస్తే సమస్య లేకుండా పోతుంది. ఇలాంటి అవకాశం కల్పిస్తే తప్ప వైద్య విద్యార్థులకు గాని, రోగులకు గాని మేలు జరిగే అవకాశం కనిపించడం లేదు.