300వ రోజు పాదయాత్ర డైరీ | 300th day padayatra diary | Sakshi
Sakshi News home page

300వ రోజు పాదయాత్ర డైరీ

Published Mon, Nov 19 2018 3:35 AM | Last Updated on Mon, Nov 19 2018 7:16 AM

300th day padayatra diary - Sakshi

ఇప్పటి వరకు నడిచిన దూరం: 3,261.6 కి.మీ 
18–11–2018, ఆదివారం 
తోటపల్లి రిజర్వాయర్‌ ప్రాంతం, 
విజయనగరం జిల్లా

బాబుగారు కేవలం శిలాఫలకాలకు చిరునామాగా మిగిలిపోయారు.. 
నేటితో ప్రజా సంకల్ప యాత్ర 300వ రోజుకు చేరింది. ఈ రోజు కూడా ఎందరో కాంట్రాక్టు ఉద్యోగులు, మరెందరో నిరుద్యోగులు కలిశారు. అందరిలోనూ ఒకటే ఆందోళన. ఈ పాలనలో ఉద్యోగ భద్రత కొరవడిందని కాంట్రాక్టు ఉద్యోగులు, ఉద్యోగావకాశాలే కరువయ్యాయని నిరుద్యోగులు వాపోయారు. పార్వతీపురానికి చెందిన విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగులు, హెల్త్‌ అసిస్టెంట్లు, కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ టీచర్లు కలిశారు. ఐదేళ్ల కిందట ఎన్నికలకు ముందు తమనందర్నీ రెగ్యులరైజ్‌ చేస్తానని బాబుగారు హమీ ఇచ్చి.. మేనిఫెస్టోలో పొందుపరిచారన్నారు. ఓట్లేయించుకుని మాట తప్పారని చెప్పారు. ఆందోళన చేసిన ప్రతిసారీ.. న్యాయం చేసేస్తామంటూ మాయమాటలు చెప్పి.. సమ్మె విరమింపజేసి మోసం చేస్తున్నారని వాపోయారు.  
 
ఇప్పటికే రెండుసార్లు టెట్లు రాసి మంచి మార్కులు తెచ్చుకున్నా.. మళ్లీ రాయాల్సి రావడం ఏం న్యాయమంటూ బాధపడింది బంటువానివలసకు చెందిన అరుంధతి అనే చెల్లెమ్మ. తీరా డీఎస్సీకి నెల ముందు సిలబస్‌ పెంచేసి, కొత్త సిలబస్‌ కూడా కలిపితే ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేసింది.  

మధ్యాహ్న శిబిరం వద్ద బాబూరావు అనే అన్న కలిశాడు. పదో తరగతి దాకా చదువుకుని చిన్న చిన్న మెకానిక్‌ పనులు చేసుకునేవాడు. ఉన్నత చదువులు చదవకపోయినా.. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. కొత్త ఆవిష్కరణలు చేయడంలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. వ్యవసాయం మీద మక్కువ.. రైతులకు ఏదన్నా చేయాలన్న తపన.. ఓ పరిశోధకునిగా మార్చాయి. రైతులకు బహుళార్థకంగా ఉపయోగపడే డ్రమ్‌సీడర్‌ను తయారుచేసి ప్రముఖుల ప్రశంసలు పొందాడు. 2017లో విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫెయిర్‌లో బంగారు పతకం సాధించాడు. 30 దేశాలు పాల్గొన్న ఆ సదస్సులో ముఖ్యమంత్రిగారే పతకాన్నిచ్చి.. అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత తన సహజ లక్షణం ప్రకారం మర్చిపోయారు. ప్రచారార్భాటాలకు, ఉత్తుత్తి మాటలకే పరిమితమని మరోసారి నిరూపించుకున్నారు. ఇలాంటి ఆవిష్కర్తల కోసం ఏర్పాటు చేస్తానన్న రూ.వంద కోట్ల నిధి ఏమైపోయిందో! 

సాయంత్రం పార్వతీపురం నియోజకవర్గం దాటి కురుపాంలోకి ప్రవేశించాను. నాన్నగారి సంకల్పఫలమైన తోటపల్లి ప్రాజెక్టు గట్టు మీద నుంచి నడుస్తుంటే.. మనసంతా ఉప్పొంగింది. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్న నా సంకల్పం మరింత బలపడింది. ఈ ప్రాజెక్టు ద్వారా నాన్నగారు ఈ ప్రాంత ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. బాబుగారు కేవలం శిలాఫలకాలకు చిరునామాగా మిగిలిపోయారు. 2004 ఎన్నికలకు ముందు బాబుగారు శంకుస్థాపన చేసి చేతులు దులిపేసుకున్నారు. నాన్నగారు అధికారంలోకి వచ్చాక 95శాతం పనులు పూర్తిచేశారు. మళ్లీ బాబుగారొచ్చాక.. మిగిలిపోయిన ఆ పిల్లకాలువ పనులు కూడా పూర్తిచేయకపోగా.. హడావుడిగా ప్రాజెక్టుకు రంగులేసి ప్రారంభోత్సవం చేసినట్టుగా మరో శిలాఫలకం వేసుకున్నారు. కేవలం ఎన్నికల ప్రచారం కోసం పునాదిరాళ్లు వేయడం.. మరొకరు చేసిన పనులకు రిబ్బన్లు కత్తిరించి ప్రచారం చేసుకోవడం నామోషీగా అనిపించదేమో! పేర్లు శిలాఫలకాలపై కాదు.. ప్రజల మనోఫలకాలపై ఉన్నప్పుడే కదా సార్థకత. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. అంచనా వ్యయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచేసి కమీషన్లు నొక్కేసిన మీరు.. మిగిలిపోయిన పిల్లకాలువ పనులను కూడా పూర్తిచేయకపోవడం వాస్తవం కాదా? పైగా తోటపల్లి ప్రాజెక్టు నాగావళి కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ కోసమంటూ.. ఎన్నికలకు మూడు నెలల ముందు హడావుడిగా రూ.195 కోట్లకు టెండర్లు పిలిచింది.. కేవలం కమీషన్ల కోసమే కాదా? 
-వైఎస్‌ జగన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement