305వ రోజు పాదయాత్ర డైరీ | 305th day padayatra diary | Sakshi
Sakshi News home page

305వ రోజు పాదయాత్ర డైరీ

Published Mon, Nov 26 2018 4:18 AM | Last Updated on Mon, Nov 26 2018 7:06 AM

305th day padayatra diary - Sakshi

25–11–2018, ఆదివారం 
నడిమికెల్ల, శ్రీకాకుళం జిల్లా 

మీ సహచరుడు బ్యాంకుల్లో రూ.6 వేల కోట్లు లూఠీ చేయడంపై ఏం సమాధానం చెబుతారు బాబూ? 
విజయనగరం జిల్లాలో పాదయాత్ర ముగిసింది. ప్రజా సంకల్ప యాత్ర 12 జిల్లాల్లో పూర్తయింది. విజయనగరం పాదయాత్ర ఎన్నో అనుభవాలు, అనుభూతులను మిగిల్చింది. పాదయాత్ర 3,000 కిలోమీటర్లకు చేరుకుంది.. 300వ రోజు జరుపుకొందీ ఇక్కడే. గతేడాది నవంబర్‌ 6న ఇడుపులపాయలో వేసిన తొలి అడుగుకు.. ఈ నవంబర్‌ 6తో ఏడాదికాలం పూర్తయిందీ ఈ జిల్లాలోనే. అధికారం కోసం ఎంతకైనా దిగజారి.. ఆఖరికి ప్రతిపక్ష నేతను భౌతికంగా తుదముట్టించడానికి సైతం సిద్ధపడ్డ కుటిల రాజకీయాలు బహిర్గతమైందీ ఈ జిల్లా పాదయాత్ర సందర్భంగానే. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అత్యంత వెనుకబడ్డ ఈ జిల్లాలో ప్రజలు చూపిన ప్రేమాభిమానాలు జీవితాంతం మరువలేనివి. నాన్నగారి మీద కృతజ్ఞతాభావం అడుగడుగునా అగుపించింది.

సహకార చక్కెర ఫ్యాక్టరీని ఆదుకున్నందుకు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించినందుకు, సంక్షేమాన్ని అందరికీ పంచినందుకు.. నాన్నగారిని పదే పదే తలుచుకున్నారు ఈ జిల్లా ప్రజలు. మళ్లీ ఇప్పుడు 2003 నాటి దుర్భర పరిస్థితులు దాపురించాయి. ఒకప్పుడు జిల్లాకు వెన్నెముకగా నిలిచిన జూటు మిల్లులు, చక్కెర ఫ్యాక్టరీలు, ఫెర్రోఅల్లాయ్‌ పరిశ్రమలు దీనావస్థలో ఉన్నాయి. వీటిపై ఆధారపడ్డవారి బతుకులు బిక్కుబిక్కుమంటున్నాయి. మిగిలిపోయిన కాస్త పనులూ పూర్తికాని ప్రాజెక్టులు.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నాయి. అడుగడుగునా కలిసిన అగ్రిగోల్డ్‌ బాధితులు.. జిల్లాను వణికించేసిన విషజ్వరాల పీడితులు.. పాలక పెద్దల స్వార్థ ప్రయోజనాలను, ప్రభుత్వ వైఫల్యాన్ని పట్టిచూపారు. 15 ఏళ్ల నాటి వలస దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి.  

గిరిశిఖర గ్రామమైన జరడ గ్రామస్తులు కలిశారు. తిత్లీ తుపాను దెబ్బకు ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయని, మూతపడ్డ గిరిజన ఆశ్రమ పాఠశాలలోనే తలదాచుకుంటున్నామని చెప్పారు. ఆ పాఠశాలను మూసేసిన ఘనత కూడా బాబుగారిదేనట. గరుగుబిల్లి మండలంలోని వివిధ గ్రామాల యువత కలిసింది. ఏ గ్రామంలోనూ గ్రంథాలయం లేకున్నా.. ఇంటి పన్నుతో పాటు గ్రంథాలయ పన్నునూ వసూలు చేస్తున్నారని చెప్పారు.  

తులసివలసకు చెందిన ఉషారాణిది దయనీయ గాథ.. మరొకరి సాయం లేకుండా అడుగు కూడా వేయలేని దివ్యాంగురాలు ఆ సోదరి. మద్యానికి బానిసైన ఆమె తండ్రి.. రోగగ్రస్తుడై ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నాడు. తల్లి కూలి పనులకుపోతూ ఐదుగురు కుటుంబ సభ్యులను సాకుతోంది. అమ్మ కష్టాలు చూడలేక చేయూతగా ఉండాలనుకుంది. ఎస్సీ కార్పొరేషన్‌ లోనైనా తెచ్చుకుని కిరాణా కొట్టు పెట్టుకోవాలనుకుంది. గత నాలుగేళ్లుగా లోనుకు దరఖాస్తు చేస్తూ అధికారులు, నేతల చుట్టూ తిరుగుతున్నా.. కనికరించడం లేదని కన్నీరు పెట్టుకుంది. ఓ వైపు, నిజాయితీగా జీవనోపాధి కోసం లక్ష రూపాయల లోను ఇవ్వాలని వేడుకుంటున్నా.. అన్ని అర్హతలున్నా.. దివ్యాంగురాలైన దళిత సోదరికి మొండిచెయ్యే ఎదురవుతోంది. మరోవైపు, ఎగ్గొట్టి దోచుకోవడం కోసమే రుణాలడిగే అధికార పార్టీ అగ్రనేతలకు ఏ అర్హతా లేకున్నా.. వేల కోట్ల బ్యాంకు రుణాలు మంజూరవుతున్నాయి.. ఇది విస్తుగొలిపే విషయం.  

ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టాను. 15 సంవత్సరాల కిందట నాన్నగారు.. ఐదేళ్ల కిందట సోదరి షర్మిల.. తమ పాదయాత్రల్లో భాగంగా తొలి అడుగు వేసిన వీరఘట్టం మండలం నుంచే నా సిక్కోలు యాత్ర మొదలైంది. శతాబ్దాల ఘనచరిత్ర ఉన్న ఉద్యమ ఖిల్లా అయిన శ్రీకాకుళం జిల్లా ప్రజలు.. అంతులేని అభిమానాన్ని చూపుతూ స్వాగతం పలికారు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు చేసిన మోసానికి బలైన డ్వాక్రా అక్కచెల్లెమ్మలను.. ఏ పాపం చెయ్యకపోయినా నిర్దాక్షిణ్యంగా కోర్టు మెట్లు ఎక్కిస్తున్నారే.. మరి మీ అత్యంత సన్నిహిత సహచరుడు.. మీ బినామీగా ప్రజలందరూ భావిస్తున్న వ్యక్తి.. మీరు పట్టుబట్టి మరీ కేంద్రమంత్రిని చేసిన ప్రబుద్ధుడు.. బ్యాంకుల్లో దాదాపు రూ.6 వేల కోట్లు లూఠీ చేయడంపై ఏం సమాధానం చెబుతారు?
-వైఎస్‌ జగన్‌     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement