
రాష్ట్రంలో 44 లక్షల ఇళ్ల జియోట్యాగింగ్
గొల్లప్రోలు : రాష్ట్రంలో 44 లక్షల ఇళ్లను జీపీఎస్ ద్వారా జియోట్యాగింగ్(హద్దులు గుర్తించి ఆన్‌లైన్ చేయడం) చేస్తామని రాష్ట్రగృహనిర్మాణశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి.శ్రీరాములు చెప్పారు. గొల్లప్రోలులో జరుగుతున్న జియోట్యాగింగ్ విధానాన్ని పరిశీలించేందుకు ఆయన శనివారం వచ్చారు. హౌసింగ్‌శాఖ ద్వారా నిర్మించుకున్న ఇళ్లను పరిశీలించారు. జియోట్యాగింగ్ విధానం గురించి ఆయన సిబ్బందికి వివరించారు. ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా సక్రమంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. డిసెంబర్ నెలాఖరు నాటికి ప్రక్రియ పూర్తికావాలని చెప్పారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇప్పటికే ఆన్‌లైన్ చేసిన 36 లక్షల ఇళ్లతోపాటు, ఆఫ్‌లైన్‌లో ఉన్న 7 లక్షల పైబడి ఇళ్లను జియోట్యాగింగ్ చేస్తామన్నారు.
జీపీఎస్‌తో అనుసంధానమైన ప్రత్యేక మొబైల్ కెమెరాలతో ఇళ్ల నాలుగు పక్కల హద్దులను ఫొటో తీసి ఆన్‌లైన్ చేస్తామన్నారు. దీనివల్ల గృహనిర్మాణశాఖ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక, అక్రమార్కులు గుర్తింపు సులువుగా జరుగుతుందని చెప్పారు. 1994 నుంచి 2014 వరకు నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి జియోట్యాగ్ విధానం అమలుచేస్తామన్నారు. మొదటి విడతగా 2004 నుంచి నిర్మించుకున్న ఐఏఓ ఇళ్లను ఈ విధానం ద్వారా గుర్తిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 1 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభంకాగా, ఇప్పటి వరకు 22,200 ఇళ్లను జియోట్యాగింగ్ చేశామన్నారు. జిల్లాలోని 3.4 లక్షల ఇళ్లు ఉండగా, 2,600 ఇళ్లకు ప్రక్రియ పూర్తయిందన్నారు. దీనికోసం జిల్లాలో 94 బృందాలు పనిచేస్తున్నాయన్నారు. ఆయన వెంట పెద్దాపురం ఏఈ పట్నాయక్, డీఈ కెవివి సత్యనారాయణ, ఏఈ శ్రీనివాస్, వర్క్ ఇన్‌స్పెక్టర్ పోతురాజు తదితరులు ఉన్నారు.