పింఛన్ల కోసం అర్హుల ఎదురు చూపులు..
జిల్లా వ్యాప్తంగా 50 వేల వినతుల పెండింగ్
అర్హులు 11,540 మందేనంటున్న అధికారులు
జన్మభూమి కమిటీల ఇష్టారాజ్యం.. అర్హులకు మొండిచేయి..
అధికార పార్టీ వారికే మంజూరు..
చిత్తూరు : జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేల మంది అర్హులు వివిధ రకాల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త పింఛన్లు సైతం అందక అర్హులు అల్లాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 వేల పింఛన్లను అధికారులు గతంలో తొలగించారు. వారి స్థానంలో జన్మభూమి కమిటీలు టీడీపీ నేతల అనుయాయులకు పింఛన్లు మంజూరు చేస్తున్నాయి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కొత్తగా 50 వేల మందికి పైగా అర్హులు పింఛన్ల కోసం వినతులు సమర్పించారు. వారిలో 11,540 మంది మాత్రమే అర్హులంటూ జన్మభూమి కమిటీలు, జిల్లా అధికారులు తేల్చారు. వారికీ పింఛన్ ఇవ్వలేదు. ఆన్‌లైన్ చేస్తామంటూ మాటలతో కాలయాపన చేస్తున్నారు. మిగిలిన వారికి అర్హత లేదంటూ చిన్నచిన్న సాంకేతిక కారణాలతో దరఖాస్తులు మూలకునెట్టారు. రేషన్‌కార్డు,ఆధార్ కార్డుల్లో ఉన్న వయో పరిమితి తేడాలను అవకాశంగా తీసుకుని కొందరిని అనర్హులుగా తేల్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా పింఛన్ల మంజూరులో అర్హుల ఎంపికలో అధికార పార్టీ నేతలతో నింపిన జన్మభూమి కమిటీలే కీలక పాత్ర పోషింస్తుండడంతో టీడీపీ కార్యకర్తలకు మినహా అర్హులకు పింఛన్లు అందే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం జిల్లాలో 3,71,415 పింఛన్లు ఇస్తున్నారు. ఇందుకోసం నెలకు రూ.39 కోట్లు వెచ్చిస్తున్నారు.
వికలాంగులదీ అదే పరిస్థితి : జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో వికలాంగులకు 44,300 పింఛన్లు ఇచ్చేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 6,840 వాటిని తొలగించి వారి స్థానంలో జన్మభూమి కమిటీల ద్వారా అధికాార పార్టీ అనుచరులకు కట్టబెట్టారు. మరో 22 వేల మంది అర్హులున్నా వారికి నేటికీ పింఛన్లు మంజూరు చేయలేదు.
పరిస్థితి ఇదీ...
- కుప్పం నియోజకవర్గంలోని కుప్పం శాంతిపురం మండలాల్లో అధికార పార్టీ నేతలు అర్హుల పింఛన్లు తొలగించారు. కొత్త వాటి కోసం వెయ్యి మంది దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నా వారికి నేటికీ మంజూరు చేయలేదు.
- పలమనేరులో4 వేల మంది దరఖాస్తులు చేసుకోగా, 3 వేల మందిని అనర్హులంటూ తొలగించారు. వెయ్యి మందే అర్హులని తేల్చారు. వారికీ పింఛన్లు మంజూరు కాకపోవడం గ మనార్హం.
- పుంగనూరు నియోజకవర్గంలో 1400 మంది పింఛన్ల కోసం వినతిపత్రాలు సమర్పించి ఎదురుచూస్తున్నారు.
- పూతలపట్టు నియోజకవర్గంలో 1500 మందికి పైగా అర్హులు పింఛన్ల కోసం అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.
- సత్యవేడు నియోజకవర్గంలో 2735 మంది వినతి పత్రాలు ఇవ్వగా, 985 మందికి పింఛన్లు మంజూరు చేశారు. మిగిలిన వారికి రావాల్సి ఉంది.
- శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 3,335 మంది దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో ఉన్న పింఛన్లలో 8 వేల ఫించన్లు తొలగించి కొత్త వారికి కట్టబెట్టారు.
- నగిరిలో 3543 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా, వారిలో 163 మందికి మాత్రమే ఇచ్చారు. మిగిలిన 3,377 మందికి ఇంకా మంజూరుకాలేదు.
- తంబళ్లపల్లి నియోజకవర్గంలో 3 వేల మంది దరాస్తు చేసుకోగా, వెయ్యి మందికి ఇచ్చారు. మిగిలిన 2 వేల మందికి ఇవ్వాల్సి ఉంది.
- చంద్రగిరి నియోజకవర్గంలో 980 మంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
- మదనపల్లె నియోజకవర్గంలో 1225 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు.
పాతవి పోయె.. కొత్తవీ రాకపాయె..!
Published Mon, Aug 17 2015 2:48 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement