70 గొర్రెలు, 3 జింకలు మృతి
♦ విషగుళికలు కలిపిన నీరే కారణం
♦ రూ.7 లక్షలు నష్టం
♦ విలవిల్లాడిన పోషకులు
నాగెళ్లముడుపు (తర్లుపాడు) : విషగుళికలు కలిపిన నీరు తాగి 70 గొర్రెలు, 3 జింకలు మృతిచెందిన సంఘటన తర్లుపాడు మండలంలోని నాగెళ్లముడుపు ఇలాఖాలో గురువారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... నాగెళ్లముడుపు, ఉమ్మారెడ్డిపల్లె గ్రామాల వాసులైన నాగం గురవయ్య, వెంకటయ్య, రమణయ్య, మూడమంచు పోలయ్యలకు చెందిన సుమారు 300 గొర్రెలు, పొట్టేళ్లు నాగెళ్లముడుపు ట్యాంకు సమీపంలోకి మేత కోసం వచ్చాయి. ఆ సమీపంలోని మద్దసాని గురుమూర్తి బత్తాయి తోట వద్ద ఉన్న నీటి కుంటలోకి దాహం తీర్చుకునేందుకు వెళ్లాయి.
అయితే, ఆ తోట యజమాని.. బత్తాయి చెట్లను అడవి పందులు, జింకలు నాశనం చేస్తుండటంతో వాటిని అంతమొందించేందుకు సమీపంలో గుంతతీసి నీరు నింపి విషగుళికలు కలిపడంతో ఆ నీరు తాగిన గొర్రెలు కొద్దిసేపటికే గిలగిల్లాడుతూ అక్కడికక్కడే చనిపోయి కుప్పలుకుప్పలుగా పడ్డాయి. మరికొన్ని గొర్రెలు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. కంటికి రెప్పలా పెంచుకున్న గొర్రెలు తమ కళ్ల ముందే మృతి చెందడాన్ని బాధితులు జీర్ణించుకోలేక విలవిల్లాడారు. సమాచారం అందుకున్న పరిసర గ్రామాల ప్రజలు మృతిచెందిన గొర్రెలను చూసేందుకు భారీగా అక్కడకు తరలివచ్చారు.
బాధితులు విలపించిన తీరు చూపురులతో కంటతడి పెట్టించింది. ఈ విషయంపై తాడివారిపల్లె పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించి తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. కాగా, అదే విషపు నీరు తాగి మూడు జింకలు చనిపోయాయి. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని చనిపోయిన జింకలను పరిశీలించారు. దీనిపై వారు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.