విశాఖపట్నం, న్యూస్‌లైన్: విద్యుత్ ‘తూర్పు’ డిస్కం ఉద్యోగులు సమ్మె హారన్ మోగించారు. గురువారం ఉదయం నుంచి 72 గంటల పాటు సమ్మెలోకి వెళ్తున్నామని ప్రకటించారు. అత్యవసర సేవలైన తాగునీరు, ఆస్పత్రులకు మినహా మిగిలిన ఫిర్యాదులకు స్పందించబోమని స్పష్టం చేశారు. గృహ, వ్యాపార, పారిశ్రామిక వినియోగదారుల సమస్యలను 72 గంటల పాటు పట్టిం చుకోబోమన్నారు. విద్యుత్ లైన్‌మన్ నుంచి చీఫ్ ఇంజినీర్(సీజీఎం) వరకూ సమ్మెలో ఉంటున్నందున అత్యవసర విద్యుత్ సేవలు స్తంభించిపోనున్నాయి.
జిల్లాలో దాదాపు 1700 మందికి పైగా విద్యుత్ ఉద్యోగులున్నారు. వీరంతా రెగ్యులర్ ఉద్యోగులే. వీరితో పాటు మరో 200 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మినహా మిగిలిన 1700 మందిలో ఇంజినీరింగ్ అధికారులు దాదాపు 250 మంది ఇప్పటికే తమ సిమ్ కార్డులను తొలగించి అధికారులకు అప్పగించారు. వీరంతా విద్యుత్ శాఖకు చెందిన సెల్‌ఫోన్ సిమ్ కార్డులను అధికారులకు అప్పగించడం వల్ల దాదాపు 1450 మంది దిగువ స్థాయి ఉద్యోగులకు పని ఆదేశాలిచ్చే అవకాశాలే లేవు.
దీంతో సిబ్బంది మొత్తం సమ్మెలోనే ఉంటున్నట్టు స్పష్టమైంది. దీని వల్ల జిల్లాలోని దాదాపు 10 లక్షల మంది వినియోగదారులకు కష్టాలు తప్పేలా లేవు. వర్షాకాలం కావడంతో ఎక్కడైనా పిడుగు పడిప్పుడు సంబంధిత డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ పేలితే ఆ విద్యుత్ లైన్ పరిధిలోని వినియోగదారులందరికీ విద్యుత్ సరఫరా ఉండదు. గురువారం ఉదయం నుంచి మూడు రోజులు పాటు సమ్మె చేస్తుండడంతో శనివారం రాత్రి వరకూ సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి లేదు.
చిన్నచిన్న ఫ్యూజ్, జంపర్ల సమస్యలొచ్చినా మూడు రోజుల వరకూ నిరీక్షించాల్సిందే. ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రంగంలోకి దించి సమస్యలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నా విద్యుత్ జేఏసీ ప్రతినిధులను కాదని అప్పటికప్పుడు సమస్య పరిష్కరించి విద్యుత్‌ను పునరుద్ధరించే చర్యలు దిగువ స్థాయి, తాత్కాలిక ఉద్యోగులు చేయరని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్య మరింత కష్టంగా ఉండే అవకాశాలున్నాయి.
ఆర్‌ఈసీఎస్ పరిధిలో...
కశింకోట: ఇక్కడి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ (ఆర్‌ఈసీఎస్)పరిధిలోని అత్యవసర సేవల వినియోగదారులు విద్యుత్ సరఫరా విషయమై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ బి.శేషుకుమార్, సీనియ ర్ పరిపాలనాధికారి ఎన్.ఎన్.అప్పారావు సూచించారు. ఈ మేరకు బుధవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈపీడీసీఎల్ విద్యుత్ ఉద్యోగులు గురువారం నుంచి సమ్మె చేపడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సంస్థ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలిగే అవకాశం ఉందన్నారు. దీని దృష్ట్యా సంస్థ పరిధిలోని పాల శీతలీకరణ కేంద్రాలు, శీతలీకరణ గిడ్డంగులు, ఆహార నిల్వ, తయారీ కేంద్రాలు, ఐస్ ఫ్యాక్టరీలు తదితర అత్యవసర యూనిట్ల వినియోగ దారులు విద్యుత్ సరఫరా విషయంలో ప్రత్యామ్నాయంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
72 గంటల విద్యుత్ సమ్మె
Published Thu, Sep 12 2013 2:49 AM | Last Updated on Wed, Sep 5 2018 2:28 PM
Advertisement
Advertisement