కొత్త నిబంధనలపై కొరవడిన స్పష్టత
జిల్లా అంతటా నిలిచిన రిజిస్ట్రేషన్లు
ఆందోళనలో ప్రజలు
విజయవాడ : రిజిస్ట్రేషన్లను రెవెన్యూతో లింకు పెట్టడంతో గందరగోళం నెలకొంది. రెవెన్యూ రికార్డులు సక్రమంగా లేకపోవడంతో ఇప్పటికే జనం అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్లకు రెవెన్యూ అనుమతి తప్పనిసరని శుక్రవారం రాత్రి 7.20 గంటలకు ప్రభుత్వం జీవో నంబరు 398ను విడుదల చేసింది. తక్షణమే ఈ జీవో అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. ముందస్తు సమాచారం లేకపోవడంతో కొత్త నిబంధనలు తెలియక శనివారం జిల్లా వ్యాప్తంగా 28 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు కూడా కొత్త నిబంధనల గురించి పూర్తిగా తెలియక తలలుపట్టుకున్నారు.
ఒకరికి మోదం.. మరొకరికి ఖేదం
అక్రమ లే అవుట్లను అడ్డుకునేందుకు, వ్యవసాయ భూములను మార్పు చేయకూడదనే లక్ష్యంతోనే రెవెన్యూ అనుమతించిన భూములకే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం చెబుతోంది. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కూడా తిరగాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం ప్రభుత్వ నిర్ణయం తమకు కాసుల వర్షం కురిపిస్తుందని సంబరపడుతున్నారు. ఇప్పటికే అసైన్డ్ జాబితాలు, గ్రామ కంఠాల్లో ఉన్న ప్రయివేటు ఇళ్ల స్థలాలు, పట్టాదార్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్లు లేని రైతుల పూర్వార్జిత ఆస్తులను ఎన్‌వోసీ ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని ప్రతి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఎన్‌వోసీల కోసం ఆస్తి, అవసరాలను బట్టి ఎకరాకు రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు.
గందరగోళంగా రెవెన్యూ రికార్డులు
ప్రస్తుతం జిల్లాలో రెవెన్యూ రికార్డులన్నీ గందరగోళంగా ఉన్నాయి. ఆన్‌లైన్‌లో అడంగల్స్ ప్రక్రియ అంతంతమాత్రంగానే సాగుతోంది. ఆర్‌వోఆర్‌లు, అడంగల్స్‌లో వేర్వేరు పేర్లు, తప్పులతడకలుగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్స్ కోసం వేలాది రూపాయలు ముట్టజెప్పినా నెలల తరబడి రెవెన్యూ కార్యాలయాల చట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికే భూముల క్రయవిక్రయాలపై మ్యుటేషన్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అత్యధిక మండలాల్లో 45 రోజులు దాటినా మ్యుటేషన్ జరగటం లేదు. పేర్లు మారినా అడగంగల్స్‌లో తప్పులను మార్పు చేయించుకునేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రజలు చెబుతున్నారు.
సర్వేయర్లు అవసరం...
వ్యవసాయ భూముల సబ్-డివిజన్ జరగాలంటే ప్రతి గ్రామం, పట్టణాల్లో సర్వేయర్లు పెరగాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలో ఒకే సర్వే నంబరుపై 10 మందికి సంబంధించిన ఏ, బీ, సీ, డీ నంబర్లు ఉంటాయి. వాటిని సబ్ డివిజన్ చేయడానికి సర్వేయర్ ప్రతి పట్టాదారును గుర్తించి నంబరు మార్చి భూమి రికార్డులో నమోదు చేయాల్సి ఉంటుంది. సబ్-డివిజన్ అయిన తర్వాత ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్(ఎఫ్‌ఎంబీ)లో నమోదు అయితేనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కాబట్టి పట్టాదార్ పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్, లింక్ డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ కొత్త నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరిగే పరిస్థితి కనిపించడంలేదు. ఈ క్రమంలో ప్రజలు ప్రతి రిజిస్ట్రేషన్‌కు తహశీల్దార్ కార్యాలయం నుంచి ఎన్‌వోసీ పొందాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్లు.. మరింత జటిలం
Published Sun, Nov 30 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM
Advertisement
Advertisement