డిమాండ్ల సాధనకోసం అంగన్ వాడీలు ఆందోళన బాట పట్టారు. గడచిన వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన వారు జిల్లాలోని అన్ని ఆర్డీవో కార్యాలయాలను శుక్రవారం ముట్టడించారు. కనీస వేతనాలు ఇవ్వాలని, పనిఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17వ తేదీన చేపట్టనున్న చలో హైదరాబాద్ కార్యక్రమంలో తమ సత్తా ఏమిటో చూపుతామని
ప్రకటించారు.
గుంటూరు ఈస్ట్ కనీస వేతనాలు అమలు చేయాలనీ, పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు శుక్రవారం ఇక్కడి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో చేపడుతున్న రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో భాగంగా పెద్ద సంఖ్యలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు ఆర్డీఓ కార్యాలయానికి ఉదయమే తరలి వచ్చారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కార్యాలయంలోకి చొచ్చుకు పోయేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు గేటు వద్దే బైఠాయించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాపు శ్రీనివాసరావు మాట్లాడుతూ బీఎల్వో, తదితర డ్యూటీలతో పాటు సూపర్‌వైజర్లు, సీడీపీఓలు చేయాల్సిన ఆన్‌లైన్ పనులు కూడా అంగన్‌వాడీ కార్యకర్తలతో చేయిస్తున్నారన్నారు. కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో ఎన్నో వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ వారి సమస్యలపై స్పందించకపోగా, ప్రపంచ మహిళా దినోత్సవంనాడు తమ సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై విరుచుకుపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 17 వ తేదీన చేపట్టిన చలో హైదరాబాదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జ్యోతి రాణి మాట్లాడుతూ సస్పెండ్ చేసిన కార్యకర్తలను వెంటనే పనుల్లోకి తీసుకోవాలని, వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరికి మద్దతు తెలిపిన డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జున రావు మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలన్నారు. మాజీ ఎమ్యెల్యే మస్తాన్ వలి, సీఐటీయూ ఉపాధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, ఉడా మాజీ చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, వర్కర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె.పద్మ, కె.శ్యామల తదితరులు ప్రసంగించారు.
అంగన్‌వాడీల ఆందోళన పథం
Published Sat, Mar 14 2015 2:12 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement